• facebook
  • whatsapp
  • telegram

చైనా - ఇరాన్‌ సహకారంలో చిటపటలు

అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్‌ ఎంతో కాలంగా సతమతమవుతోంది. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వాణిజ్య, ఆర్థిక రంగాల్లో చైనా నుంచి పూర్తిస్థాయి తోడ్పాటును కాంక్షిస్తోంది. అందులో భాగంగానే రెండేళ్ల కిందట బీజింగ్‌తో కుదిరిన వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

బీజింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో కొంతకాలంగా నెలకొన్న స్తబ్ధతను తొలగించడమే లక్ష్యంగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల చైనాలో పర్యటించారు. ఆయన పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఆసక్తి రేకెత్తించింది. అమెరికా ఆంక్షల కొరడాతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెహ్రాన్‌లో కొత్త ఆశలు నింపింది. ఆంక్షల ముప్పునకు బెదరకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని చైనా, ఇరాన్‌ ఈ సందర్భంగా తీర్మానించుకున్నాయి. వ్యవసాయం, పర్యాటకం, వాణిజ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, సాంస్కృతికం తదితర రంగాల్లో పరస్పర సహకారంపై దాదాపు 20 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అరకొర పెట్టుబడులు

టెహ్రాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బీజింగ్‌. ఇరాన్‌ నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేసేది చైనాయే. యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా రష్యా నుంచి చైనా భారీ రాయితీపై చమురును కొనుగోలు చేస్తోంది. దరిమిలా ఇరాన్‌ నుంచి దిగుమతులను తగ్గించుకుంది. దీనికితోడు నిరుడు డిసెంబరులో సౌదీ అరేబియాలో జిన్‌పింగ్‌ చేపట్టిన పర్యటనతో బీజింగ్‌-టెహ్రాన్‌ సంబంధాల్లో ఒకింత సంక్షోభం నెలకొంది. ప్రాంతీయంగా అస్థిర పరిస్థితులను సృష్టించేలా టెహ్రాన్‌ కార్యకలాపాలు ఉన్నాయని నాడు చైనా-గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ) విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉగ్రవాద, వేర్పాటువాద ముఠాలకు ఇరాన్‌ మద్దతిస్తోందని అందులో ఉంది. దాంతో చైనా విషయంలో ఇరాన్‌ తీవ్ర అసంతృప్తికి లోనైంది.

వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకొనే లక్ష్యంతో 2021లో టెహ్రాన్‌, బీజింగ్‌ పాతికేళ్ల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. చమురు సరఫరాకు బదులుగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ద్వారా 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని చైనా అందులో ప్రతిపాదించింది. అది ఇప్పటికీ పట్టాలెక్కలేదు. గత రెండేళ్లలో ఇరాన్‌లో చైనా కేవలం 16.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది టెహ్రాన్‌కు తీవ్ర అసహనం కలిగించింది. ఈ నేపథ్యంలోనే ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు రైసీ చైనాలో పర్యటించారు. వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని జిన్‌పింగ్‌తో భేటీలో విన్నవించారు. చైనా అధ్యక్షుడు అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లే తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా- ఇరాన్‌తో స్నేహపూర్వక సహకారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని జిన్‌పింగ్‌ తెలిపారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో భాగంగా ఆ దేశంలో పలు ప్రాజెక్టులు చేపడతామన్నారు. త్వరలో తాను స్వయంగా ఇరాన్‌లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.

బీజింగ్‌పై అనుమానాలు

ఇరాన్‌తో 2015 నాటి అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ హయాములో 2018లో అమెరికా వైదొలగింది. ఫలితంగా టెహ్రాన్‌పై ఆంక్షల పిడికిలి బిగిసింది. ఆ ఒప్పందం పునరుద్ధరణకు అవసరమైన చర్చల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా తాజాగా ప్రకటించింది.  ఇరాన్‌పై ఏకపక్షమైన ఆంక్షలు తగవంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అదంతా మొసలి కన్నీరేనన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అణు ఒప్పందం పునరుద్ధరణకు బీజింగ్‌ పూర్తిస్థాయిలో కృషిచేయదని వారు విశ్లేషిస్తున్నారు. అందుకు సహేతుక కారణాలు లేకపోలేదు. ఇరాన్‌ నుంచి చమురు, సహజవాయువును 30శాతం రాయితీ ధరపై కొనుగోలు చేసేలా, సంబంధిత సొమ్మును చెల్లించేందుకు రెండేళ్ల గడువు ఉండేలా వ్యూహాత్మక సహకార ఒప్పందంలో చైనా ఓ షరతును పొందుపరచుకుంది! చమురు, సహజవాయువు కొనుగోలు సంబంధిత సొమ్ము విలువలో మూడింట రెండొంతులను డబ్బు రూపంలో చెల్లించేలా, మిగతా మొత్తాన్ని వస్తుమార్పిడి విధానంలో ఉత్పత్తుల ద్వారా సమకూర్చేలా కూడా ఓ  నిబంధన రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అణు ఒప్పందం పునరుద్ధరణ జరిగి, ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోతే బీజింగ్‌కు ఈ వెసులుబాట్లు దూరమయ్యే ముప్పుంది. అందుకే వాషింగ్టన్‌, టెహ్రాన్‌ మధ్య సయోధ్య కోసం బీజింగ్‌ మనస్ఫూర్తిగా ప్రయత్నించే అవకాశాలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమ్ముల పొదిలో కృత్రిమ మేధ

‣ త్రైపాక్షిక సహకారంతో వ్యూహాత్మక ముందడుగు

‣ భూతాపం.. మానవాళికి శాపం!

‣ ఈ ఏడాదైనా రూపాయి బలపడుతుందా?

‣ అక్షరాస్యతే అభివృద్ధి అస్త్రం

‣ అధిక జనాభా వరమా.. భారమా?

Posted Date: 20-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం