• facebook
  • whatsapp
  • telegram

అందరికీ అందని వైద్య సేవలు

ప్రజారోగ్యానికి అరకొర కేటాయింపులు

కొవిడ్‌ కొట్టిన దెబ్బ నుంచి దేశార్థికం ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నా ఆరోగ్య సంరక్షణ రంగం మాత్రం నిధులు లేక కునారిల్లుతోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నందువల్ల ప్రజలు వైద్యం కోసం సొంత జేబు నుంచి ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోతున్నారు. భారత జీడీపీలో కేవలం 1.26శాతాన్ని ప్రజారోగ్యంపై ఖర్చు పెడుతున్నారు. 2025కల్లా దీన్ని 2.5శాతానికి పెంచాలని 2017నాటి జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశించినా అది ఇప్పటికీ సుదూర గమ్యంగానే ఉంది. ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే ఇప్పటి నుంచి 2025 వరకు ఆరోగ్య బడ్జెట్‌ను ఏటా 0.35శాతం చొప్పున పెంచాలి. కానీ, 2015-16 నుంచి 2020-21 వరకు ఏటా 0.02శాతం చొప్పునే పెంచారు. 2020కల్లా రాష్ట్రాలు తమ బడ్జెట్లలో కనీసం ఎనిమిది శాతం నిధులను ఆరోగ్యానికి కేటాయించాలని జాతీయ ఆరోగ్య విధానం సూచించినా, రాష్ట్రాలు సగటున 5.4 శాతం నిధులను మాత్రమే వెచ్చించాయి.

లోపించిన నాణ్యత

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌... 2015-2021 మధ్య కాలంలో ఆరోగ్యానికి అయిదు శాతంకన్నా తక్కువ నిధులతో సరిపెట్టాయి. ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత, లభ్యతలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకన్నా భారత్‌ వెనకబడి ఉందని విఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక ‘ల్యాన్సెట్‌’ వెల్లడించింది. 30శాతం భారతీయులకు ప్రాథమిక ఆరోగ్య సేవలైనా లభించడం లేదు. వైద్యానికి సొంతంగా ఖర్చు పెట్టుకోవలసి రావడంతో ఏటా కోట్లమంది భారతీయులు పేదరికంలోకి జారిపోతున్నారు. ఖర్చుకు జడిసి 30శాతం గ్రామీణ జనాభా ఆస్పత్రులకు వెళ్ళడమే మానేస్తున్నారు. గ్రామాల్లో 47శాతం, పట్టణాల్లో 31శాతం వైద్య ఖర్చులకు అప్పులు చేయక తప్పడం లేదు. ఉన్న ఆస్తి అమ్ముకోవలసి వస్తోంది. భారతదేశంలో ప్రజలు- వైద్యం కోసం చేసే ఖర్చులో 69శాతం తామే స్వయంగా భరించాల్సి వస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు. థాయ్‌లాండ్‌లో ఇది 25శాతం, చైనాలో 44శాతం, శ్రీలంకలో 55శాతంగా ఉంది. వైద్య చికిత్స కోసం భారతీయులు తమ పొదుపు మొత్తాలను వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు అనారోగ్యంతో పనులకు గైర్హాజరు కావడం వల్ల ఆదాయం కోల్పోక తప్పడంలేదు. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల సార్వత్రిక ఆరోగ్య భద్రత దక్కడంలేదు. మన మహానగరాల్లో పాశ్చాత్య దేశాలకు దీటైన చికిత్సా వసతులు ఉన్నప్పటికీ గ్రామాలు, చిన్న పట్టణాలలో ఒక మోస్తరు చికిత్స లభించడమూ కష్టంగా మారింది.

భారత్‌లో ఏటా 30 వేల మంది వైద్యులు, 20 వేల మంది దంతవైద్యులు, 45 వేల మంది నర్సులు తయారవుతున్నారు. 2021 నవంబర్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతిప్రవీణ్‌ పవార్‌ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం- ఇక్కడ ప్రతి 834 మందికి ఒక డాక్టర్‌ ఉన్నారు. అయితే, ఇతర అంచనాల ప్రకారం దేశమంతటా రోగులు, వైద్యుల నిష్పత్తి ఒకేరకంగా లేదు. ఆస్ట్రేలియాలో ప్రతి 249 మంది రోగులకు ఒక డాక్టరు చొప్పున ఉండగా, బ్రిటన్‌లో ప్రతి 1,665 మందికి అయిదుగురు, అమెరికాలో ప్రతి 548 మందికి తొమ్మిది మంది వైద్యుల చొప్పున ఉన్నట్లు ఇతర అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో ప్రతి 90,343 మంది రోగులకు ఒక ప్రభుత్వ ఆస్పత్రి, ప్రతి 20 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఉంది. మహానగరాలకు వెలుపల 734 జిల్లా ఆస్పత్రులు వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి. ఇవి కాక మహిళలు తదితర వర్గాలకు వైద్య సేవలు అందించే ఆస్పత్రులు 300 దాకా ఉంటాయి. 18 శాతం పీహెచ్‌సీ‡లకు వైద్యులు లేరు.

సంస్కరణలు అత్యావశ్యకం

మొత్తం మీద దేశ జనాభాకు విస్తృతంగా నాణ్యమైన చికిత్సా సౌకర్యాలు అందించాలంటే యావత్‌ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా సంస్కరించక తప్పదు. పటిష్ఠ వైద్య చికిత్సా వ్యవస్థ కొరవడినందువల్ల గడచిన రెండేళ్లుగా కొవిడ్‌ బీభత్సాన్ని సమర్థంగా ఎదుర్కోలేక సతమతమవుతున్నాం. ఆక్సిజన్‌, ఆస్పత్రి పడకలు, టీకాలు, మందులు అన్నింటికీ కొరత ఏర్పడింది. కొవిడ్‌ బారిన పడిన ప్రజలు ఆస్పత్రిలో చికిత్స కోసం బయట మండుటెండలో బారులు తీరడం, రోడ్డు పక్కన కూలిపోవడం వంటి దృశ్యాలు మనసులను కలచివేశాయి. సకాలంలో సరైన చికిత్స అందక లక్షల మంది మరణించారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరెందరో దివాలా తీశారు. ప్రభుత్వం ముందుగానే మేల్కొనకపోవడం ఈ అనర్థానికి మూలం. ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో వచ్చి పడిన మూడో దశ కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ మన ఆరోగ్య సంరక్షణ రంగంపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతోంది. ఒమిక్రాన్‌ను తట్టుకోవాలంటే దేశ జనాభా అంతటికీ రెండు డోసుల టీకాలు వేసి, అర్హులైన వారికి మూడో డోసును వేగంగా వేయాలి. టీకా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలి. వేగవంతంగా పూర్తి చేయాలి. ఇకనైనా కేంద్రం, రాష్ట్రాలు తమ బడ్జెట్లలో ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులను పెద్దయెత్తున పెంచాలి. అధునాతన వైద్య సదుపాయాలను మహానగరాలు, పట్టణాలకే పరిమితం చేయకుండా వెంటనే గ్రామాలకూ విస్తరించాలి. నిధుల కొరతను అధిగమించడానికి వైద్య చికిత్సా రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి.

ప్రైవేటు విజృంభణ

మన దేశంలో ప్రజలకు ప్రాథమిక స్థాయి నుంచి సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతున్నందువల్లే ప్రైవేటు రంగంలో ఆస్పత్రులు విస్తరిస్తున్నాయి. 1947లో కేవలం ఎనిమిది శాతం ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా, నేడు 93శాతం ఆస్పత్రులు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. 64శాతం ఆస్పత్రి పడకలు, 80-85 శాతం వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితం. దేశంలో సుమారు 75శాతం డిస్పెన్సరీలు, 60శాతం ఆస్పత్రులు, 80శాతం వైద్యులు- పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. ప్రజారోగ్యంపై భారత ప్రభుత్వం ఏటా చేసే తలసరి వ్యయం పొరుగునున్న శ్రీలంక, చైనాల కన్నా తక్కువ. ఆరోగ్య బీమాకు బ్రిటిష్‌ ప్రభుత్వం 83.5శాతం వాటా సమకూరుస్తుండగా, భారత్‌లో కేవలం 32శాతం సమకూరుతున్నట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) తెలిపింది. 76శాతం భారతీయులకు ఆరోగ్య బీమా లేనందువల్ల చికిత్సకు సొంతంగా ఖర్చు పెట్టుకోవలసి వస్తోంది.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అణ్వాయుధ నిరోధంపై ఐక్యగళం

‣ సేంద్రియ సాగుకు ప్రోత్సాహమే కీలకం

‣ సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపులు

‣ సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం