• facebook
  • whatsapp
  • telegram

సేంద్రియ సాగుకు ప్రోత్సాహమే కీలకం

విస్తరణకు సర్కారు ప్రణాళికలు

అన్నదాతలు రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తెచ్చి, సేంద్రియ సాగుపై మొగ్గుచూపాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలి. రసాయన ఎరువులను వాడకపోతే దిగుబడి తక్కువగా వస్తుందన్నది తప్పుడు అభిప్రాయం. రైతులు మొదట చిన్న కమతంలో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాలి. ఫలితాలను చూసిన తరవాత విస్తరించాలి. - ప్రధాని నరేంద్ర మోదీ

హరిత విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో భారీ మార్పులు సంభవించాయి. దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు ఏడాదికి రెండు, మూడు పంటలను సాగుచేయడం ప్రారంభించారు. అందుకోసం రసాయన ఎరువులను విరివిగా వాడటంతో పంటపొలాలు నిస్సారంగా మారుతున్నాయి. పురుగుమందుల పిచికారీ విపరీతంగా పెరిగి, పంటల ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు చేరి మానవుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గమే సేంద్రియ సాగు విధానం. నేడు ప్రపంచంలోని చాలా దేశాలు సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి. వాటి ఉత్పత్తులనే వాడాలని ప్రజలకు సూచిస్తున్నాయి.

పెరుగుతున్న విస్తీర్ణం

ఇండియాలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఏటా సేంద్రియ సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27.80 లక్షల హెక్టార్లలో సేంద్రియ విధానంలో పంటలు సాగవుతున్నాయి. దేశంలోని నికర సాగు భూమి(సుమారు 14 కోట్ల హెక్టార్ల)లో ఇది దాదాపు రెండు శాతానికి సమానం. మనదేశంలో సిక్కిం, ఉత్తరాఖండ్‌, త్రిపుర రాష్ట్రాలు ఈ సాగులో ముందున్నాయి. సిక్కిం పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కింది. విస్తీర్ణంపరంగా చూస్తే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర అధిక వాటాను కలిగి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 76 వేల హెక్టార్లలో ఈ సాగును చేపట్టారు. ఇది దేశంలో ఉన్న మొత్తం సేంద్రియ సాగు భూమిలో 27శాతానికి పైనే. దేశవ్యాప్తంగా సాగవుతున్న భూమిలో ఈ మూడు రాష్ట్రాల్లోని విస్తీర్ణమే సగం కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ రైతులు ఎక్కువగా ఉన్నది కూడా మన దేశంలోనే. నూనెగింజలు, టీ, కాఫీ, పండ్లు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు దేశంలో ఎక్కువగా పండుతున్నాయి. మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం లేకుండా సాగు చేయాలంటే సేంద్రియ విధానమే మార్గం. ఈ విధానం నేలను సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొక్కలు, జంతు వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తారు. పచ్చిరొట్ట, ఆవుపేడ, ఇతర జంతువుల వ్యర్థాలు, కంపోస్టు ఎరువులను పంటలకు వాడతారు. పైర్లను ఆశించే చీడపీడలు, క్రిమికీటకాల నివారణకు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారైన ద్రావణాలను పిచికారీ చేస్తారు. ఈ విధానంలో అంతర లేదా బహుళ పంటలను సాగు చేస్తారు. పంట మార్పిడి తప్పనిసరిగా ఉంటుంది. కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ సేంద్రియ సాగు కేంద్రం (ఎన్‌సీఓఎఫ్‌)’ దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు ప్రాజెక్టును చేపట్టింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్‌పీఓపీ)’లో విత్తన ధ్రువీకరణ సంస్థల గుర్తింపు, ఉత్పత్తుల ప్రమాణాల పెంపుదల, సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడానికి తోడు చీడపీడల ఉద్ధృతి అధికమవుతోంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సేంద్రియసాగు వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. పంటలకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఉత్పత్తులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ఆహార ఉత్పత్తి పద్ధతిగా మాత్రమే చూడకూడదు. స్థిర వ్యవసాయానికి, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడే విధానంగా గుర్తించాలి. ఎడారీకరణ, వాతావరణ మార్పు కారకాల ప్రభావాన్ని తగ్గించే సాధనాల్లో ఒకటిగా భావించాలి.

సవాళ్లను అధిగమించాలి...

సేంద్రియ సాగులో విత్తన, ఉత్పత్తుల ధ్రువీకరణ అనేది చాలా కీలకం. ప్రస్తుతం మన దేశంలో ‘వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (అపెడా)’ గుర్తింపు ఉన్న 32 సంస్థల ద్వారా ధ్రువీకరణ జరుగుతోంది. సేంద్రియ పంటలు విస్తరిస్తూ ఉండటంతో ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా మరిన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. సేంద్రియ ఉత్పత్తులు అధిక ధరలు పలకాలంటే ధ్రువీకరణ అవసరమని, ఇందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రయోగ శాలలను ఏర్పాటు చేస్తోందని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. నాణ్యమైన ఉత్పత్తులతోనే ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలను అందించాలి. మద్దతు ధరలపై భరోసా కల్పించాలి. దేశీయంగానూ మార్కెటింగ్‌ అవకాశాలను విస్తృతపరచాలి. భారత్‌లో అధికశాతం చిన్న కమతాలు కావడంతో ఎక్కువ మంది రైతులు సేంద్రియ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది. వారికి ప్రభుత్వాలు అండగా నిలవాలి. సాగు తొలినాళ్లలో కొంతమేర దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, రైతులకు రాయితీలు కల్పించాలి.

ఎగుమతుల్లో పురోగమనం

సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఊపందుకొంటోంది. కొవిడ్‌ సంక్షోభంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్నందువల్ల ప్రజలు సేంద్రియ ఉత్పత్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. భారత్‌లో 2020-21లో అన్ని సేంద్రియ పంటల దిగుబడులు కలిపి సుమారు 34 లక్షల టన్నులు. అదే ఏడాది రూ.7,078 కోట్ల మేర సేంద్రియ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికా, కెనడా, బ్రిటన్‌, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, ఈక్వెడార్‌, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర 58 దేశాలకు మన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. భారత సేంద్రియ పంటల ఎగుమతుల్లో ఎక్కువ శాతం నూనెగింజలు, పండ్ల రసాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు, చక్కెర తదితరాలు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2020-21లో భారత్‌ ఎగుమతులు 42శాతం మేర పెరిగాయి. మొత్తం ఎగుమతుల్లో సోయాబీన్‌ సహా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు 57శాతం వాటాను ఆక్రమించాయి. ఆ తరవాతి స్థానాల్లో నూనెగింజలు (తొమ్మిది శాతం), తృణ, చిరు ధాన్యాలు (ఏడు శాతం) ఉన్నాయి.

- దేవవరపు సతీష్‌బాబు
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

‣ ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 07-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం