• facebook
  • whatsapp
  • telegram

పునర్‌ నిర్మాణ బాటలో కశ్మీర్‌

ఎప్పటికి కుదుటపడేనో!

జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తరవాత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అక్కడ పర్యటించారు. రూ.20 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.5,300 కోట్లతో కిష్త్‌వార్‌ జిల్లాలో చీనాబ్‌ నదిపై 850 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న రాట్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వాటిలో ముఖ్యమైనది. రూ.3,100 కోట్లకుపైగా నిధులతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగాన్నీ ప్రధాని ప్రారంభించారు. దాని పొడవు    8.45 కిలోమీటర్లు. దిల్లీ, అమృత్‌సర్‌లను జమ్మూలోని కట్రాతో అనుసంధానించే ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నిర్మించే మూడు మార్గాలకూ మోదీ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన పలువురు వ్యాపారవేత్తలూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు.

దాయాది పాకిస్థాన్‌ కుయుక్తులు, ఉగ్ర సంస్థల దాడులతో జమ్మూకశ్మీర్‌ దశాబ్దాలపాటు రావణకాష్ఠంలా రగిలింది. వేర్పాటువాదుల నిరసనలు తోడవడంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు, కార్పొరేట్‌ కంపెనీలేవీ ముందుకు రాలేదు. ప్రభుత్వ ప్రాజెక్టుల పనులూ విద్రోహచర్యల కారణంగా మందకొడిగా సాగాయి. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత పరిస్థితుల్లో మార్పు కనిపించింది. 2015 నవంబరులో అప్పటికి రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ కోసం ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.80 వేల కోట్లను మోదీ ప్రకటించారు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆ నిధులతో రోడ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, పర్యాటకం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2019 వరకు అందులో 37శాతం నిధులనే అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది. 370 అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి పనులను కేంద్రం వేగవంతం చేసింది. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 370 అధికరణ రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో చిన్నాచితకా కలిపి దాదాపు 1.5 లక్షల కొత్త పనులు/ప్రాజెక్టులు చేపట్టారు. 100శాతం ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్‌ అందింది. విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి సాధనకు జమ్మూకశ్మీర్‌ చేరువైంది. రహదారుల నిర్మాణాన్నీ విస్తృతంగా చేపట్టారు.

జమ్మూకశ్మీర్‌కు 2019 ఆగస్టు తరవాత రెండు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలను (ఎయిమ్స్‌) కేటాయించారు. వాటికి అదనంగా ఏడు వైద్య కళాశాలలు, రెండు క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాలు, 15 నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. 854 వైద్య విద్య సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ, ఐఐఎంలూ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య 96 నుంచి 147కు పెరిగింది. శ్రీనగర్‌ను మిగతా దేశంతో రైల్వేలైన్‌తో అనుసంధానించే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్‌కు ఏడు దశాబ్దాల్లో కేవలం రూ.17 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులే వచ్చాయి. అతి త్వరలో ప్రైవేటు నుంచి రూ.38 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల తెలిపారు. సమాచార సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో సత్వర ప్రగతికి ఆ నిధులు తోడ్పడతాయని చెప్పారు. రెండేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో ప్రపంచస్థాయి క్రీడా వసతులు అందుబాటులోకి వస్తుండటం మరో కీలక పరిణామం. ఒకప్పుడు వేర్పాటువాదులు, ముష్కరుల కుట్రలతో హింసవైపు మొగ్గిన కశ్మీరీ యువత ఇప్పుడు ఆటల్లో రాణించేందుకు మక్కువ చూపుతోంది. రాళ్లు రువ్వడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడేవారికి పాస్‌పోర్టులు జారీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానికేతరులను వివాహం చేసుకుంటే జమ్మూకశ్మీర్‌ మహిళలు తమ ఆస్తులపై హక్కు కోల్పోయేవారు. వారి భర్తలకు స్థానిక హోదా దక్కేది కాదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసేందుకు వారికి అనుమతులు ఉండేవి కావు. 370 అధికరణ రద్దుతో పరిస్థితులు మారిపోయాయి. జమ్మూకశ్మీర్‌ మహిళలను వివాహం చేసుకునే బయటి వ్యక్తులకూ స్థానిక హోదా లభిస్తోంది. అక్కడ ఆస్తుల కొనుగోలుకు, ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు చేసుకునేందుకు వారిని అనుమతిస్తున్నారు. వలస వెళ్ళిన కశ్మీరీ పండిట్‌లు తిరిగి లోయ బాట పడుతున్నారు. కశ్మీరీల మనసు గెలుచుకునేందుకు సర్కారు చేస్తున్న కృషికి అక్కడి ప్రజలు, స్థానిక రాజకీయ పార్టీల సహకారమూ తోడవ్వాలి. అప్పుడే ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పూర్తిస్థాయి విజయం సాధ్యమవుతుంది.

- శ్రీయాన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కడలిపై పట్టుకు వ్యూహం

‣ పటిష్ఠ వాణిజ్య బంధంపై అనురక్తి

‣ సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

‣ ఉత్కంఠభరితం ఫ్రాన్స్‌ అధ్యక్ష సమరం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం