• facebook
  • whatsapp
  • telegram

ఫిరాయింపుల ప్రజాస్వామ్యం!

భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణంగా మారాయి. ఒక పార్టీలో గెలిచి, మరొక పార్టీలోకి వెళ్లడాన్ని నిరోధించేందుకు చట్టం తెచ్చినా, పెద్దగా ప్రయోజనమైతే కనిపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నేతల గోడదూకుళ్లకు అడ్డకట్ట పడాలంటే- ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని పటిష్ఠం చేయాలి.



రాజకీయ నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ గూటికి చేరడాన్ని సూచించే యారామ్‌-గయారామ్‌ సంస్కృతి భారతదేశంలో కొత్తేమీ కాదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల వేళ, ఆ తరవాతా పలు రాష్ట్రాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మార్చేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. రాజకీయ గోడ దూకుడు క్రీడ యథేచ్ఛగా సాగుతున్నా, ఫిరాయింపుల నిరోధక చట్టం మాత్రం ప్రేక్షకపాత్రకు పరిమితమవుతోంది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పొందుపరచిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 1985లో తీసుకొచ్చారు. 1960ల్లో, 70ల్లో పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఇష్టారీతిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారు. దాన్ని నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, చట్టం అమలులోకి వచ్చిన తరవాత కూడా దేశంలో పెద్దసంఖ్యలో ఫిరాయింపులు చోటుచేసుకున్నట్లు రాజ్యాంగం పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ ఆక్షేపించింది. పదో షెడ్యూలు ఎందుకిలా ప్రభావశూన్యంగా మారిపోయింది? 


లొసుగులతో చేటు

పదో షెడ్యూలు ముసాయిదాలోని లొసుగులే ఫిరాయింపులకు తావిస్తున్నాయి. ముఖ్యంగా గుంపు ఫిరాయింపులకు అవి అవకాశమిస్తున్నాయి. ఎవరైనా చట్టసభ సభ్యులు తమ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, లేదా పార్లమెంటులోగాని, రాష్ట్రాల అసెంబ్లీలోగాని సొంత పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు పదో షెడ్యూలు ప్రకారం అనర్హత వేటు పడుతుంది. స్వతంత్ర ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఎన్నికైన తరవాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతారు. కానీ- స్పీకర్, ఛైర్‌పర్సన్‌ దగ్గర అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లు చాలాకాలం పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలో రెండు మినహాయింపులున్నాయి. రాజకీయ పార్టీలో చీలికలకు సంబంధించినది ఒకటైతే, రెండోది పార్టీల విలీనానికి చెందినది. పార్టీలు, చట్టసభ సభ్యుల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు ఫిరాయింపుల వంటి మినహాయింపులను ఉపయోగించుకోవచ్చని ఈ చట్టంపై జరిగిన పార్లమెంటరీ చర్చలు స్పష్టంచేస్తున్నాయి. ఉద్దేశాలు మంచివే అయినా, ఇలాంటి మినహాయింపులను చాలామంది తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అలా పదేపదే ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగిస్తుండటంతో 2003లో చీలిక మినహాయింపును తొలగించారు. విలీనానికి సంబంధించిన మినహాయింపు మాత్రం కొనసాగుతోంది. పదో షెడ్యూలు ప్రకారం... ఒకవేళ అభ్యర్థులు ఒకేసారి రెండు షరతులను నెరవేర్చగలిగితే అనర్హత వేటు నుంచి మినహాయింపు పొందవచ్చు. ఒకటి, చట్టసభ్యుడి సొంత రాజకీయ పక్షం మరొక పార్టీలో విలీనమైనప్పుడు; రెండోది, విలీనానికి అంగీకరించిన లెజిస్లేచర్‌ పార్టీలోని మూడింట రెండొంతుల మంది సమూహంలో సభ్యుడైనప్పుడు మినహాయింపు లభిస్తుంది. ఏదేని చట్ట సభలో ఒక పార్టీకి సంబంధించి ఎన్నికైన సభ్యుల బృందాన్ని లెజిస్లేచర్‌ పార్టీగా వ్యవహరిస్తారు. విలీనానికి సంబంధించిన మినహాయింపు ముసాయిదాలోని సంక్లిష్టత... స్పీకర్లు, కోర్టులు భిన్నభాష్యాలు చెప్పేందుకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట శాసనసభా పక్షంలో మూడింట రెండొంతుల మంది మరొక శాసనసభా పక్షంలో విలీనమయ్యేందుకు అంగీకరిస్తే, అది రెండు రాజకీయ పార్టీల మధ్య విలీనంగా భావించవచ్చని పలు హైకోర్టులు వివరణ ఇచ్చాయి. దీనికి రెండు రాజకీయ పక్షాల మధ్య విలీనం అవసరం లేదు. రాజకీయ పార్టీల శాసనసభా పక్షాలు చట్టసభ లోపల విలీనమైతే సరిపోతుంది. బయటి సభ్యులతో అవసరం ఉండదు. ఉదాహరణకు 2019లో గోవా శాసనసభలో ఉన్న మొత్తం 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో పదిమంది భాజపాలో చేరారు. అది భాజపా, కాంగ్రెస్‌ శాసనసభా పక్షాల మధ్య చెల్లుబాటైన విలీనంగా నిలిచింది. ఆ పదిమంది కాంగ్రెస్‌ సభ్యులనూ గోవా అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు నుంచి మినహాయించారు. ఆ నిర్ణయాన్ని గోవాలోని బాంబే హైకోరు ధర్మాసనం సైతం సమర్థించింది. రెండు శాసనసభా పక్షాల మధ్య విలీనాలను మాత్రమే నిరూపించాల్సిన అవసరం ఉండటంతో గుంపు ఫిరాయింపుల ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. ఫిరాయింపులకు పాల్పడే చట్టసభ సభ్యులపై అనర్హత వేటు పడకుండా అడ్డుకోవడంలో విలీనాలు, చీలికలే కీలకంగా మారుతున్నాయి.


సమగ్రంగా సమీక్షించాలి

ఫిరాయింపుల నిరోధక చట్టం- స్వతంత్ర ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంతమేర విజయం సాధించిందని చెప్పవచ్చు. 1989-2011 మధ్య హరియాణా అసెంబ్లీలో దాఖలైన 39 పిటిషన్లలో స్పీకర్‌ 12 సందర్భాల్లో అనర్హత వేటు వేశారు. తొమ్మిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. ఇందులో 2004లో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై వేటు పడిన సందర్భమూ ఉంది. ఆ ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో చేరినవారే. 1988-2009 మధ్య మేఘాలయ అసెంబ్లీలో 18 అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయిదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలో చేరినందుకు స్పీకర్‌ వారిపై వేటు వేశారు. ఎన్నికలు ముగియగానే రాజకీయ పక్షాల్లో చేరిపోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయాలకు సంబంధించిన గణాంక సమాచారం సంబంధిత వెబ్‌సైట్లలో చేర్చనేలేదు. దీన్ని పదో షెడ్యూలు సమగ్ర మూల్యాంకనానికి అడ్డంకిగా భావించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో అఖిల భారత ప్రిసైడింగ్‌ అధికారుల సదస్సులో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా పదో షెడ్యూలు పనితీరును సమగ్రంగా పరిశీలించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.


కోరల్లేని చట్టం

ఒక అధ్యయనం ప్రకారం, 1986-2004 మధ్య లోక్‌సభ స్పీకర్ల ముందు దాఖలైన 55 అనర్హత పిటిషన్లలో నలభై తొమ్మిదింటిలో ఏ ఒక్క సభ్యుడిపైనా అనర్హత వేటు పడలేదు. వారంతా పార్టీలు మారినవారే. ఇందులో 77శాతం తమ ఫిరాయింపును చెల్లుబాటయ్యేదిగా రుజువు చేసుకోవడం గమనార్హం. ఉత్తర్‌ ప్రదేశ్‌కు సంబంధించి 1990-2008 మధ్య 69 పిటిషన్లు దాఖలుకాగా, కేవలం రెండు పిటిషన్లలోనే అనర్హత వేటు పడింది. 67 కేసుల్లో చర్యలేమీ లేవు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న దుస్థితి ఇదీ.


- రిత్విక శర్మ 

(న్యాయ నిపుణులు, విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పెను ప్రమాదంలో జీవ వైవిధ్యం

‣ ఆస్ట్రియాతో చెలిమి... ఇండియాకు కలిమి!

‣ ఉపాధి వృద్ధికి మేలిమి మార్గం

‣ ఫ్రాన్స్‌ దారెటు?

‣ విశాఖ ఉక్కు నిలదొక్కుకుంటుందా?

‣ సాంస్కృతిక వెలుగులో జనగణన

‣ పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని