• facebook
  • whatsapp
  • telegram

కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!



ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.6శాతం వృద్ధిరేటు సాధించింది. ఇది రిజర్వు బ్యాంకు అంచనా వేసిన 6.5శాతం కన్నా ఎక్కువ. అనేక సవాళ్లు ముసురుకొన్న పరిస్థితుల్లో అధిక వృద్ధిరేటుకు కారణం ఏమిటి?  దానివల్ల సామాన్యులకు ఒరిగిందేమిటి?


స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని త్రైమాసిక పద్ధతిలో లెక్కగట్టే విధానాన్ని కేంద్ర గణాంక సంస్థ(సీఎస్‌ఓ) 1999 నుంచి చేపడుతోంది. మూడు నెలల కాలంలో ఉత్పత్తి, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ విధానంలో జీడీపీని గమనించడం ద్వారా ఆశించిన వృద్ధి రేటును సాధించడానికి విధానపరంగా తగిన మార్పుచేర్పులు చేపట్టవచ్చు. 2023 రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబరు)-క్యూ2లో ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు మంచి వృద్ధి రేటును సాధించాయి. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెరిగి జీడీపీ వృద్ధిరేటు అధికమవడానికి తోడ్పడింది. గడచిన 10 త్రైమాసికాలలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం 12.4శాతం పెరిగింది. 2022-23 క్యూ2తో పోలిస్తే 2023-24 రెండో త్రైమాసికంలో ప్రభుత్వ స్థిర పెట్టుబడి 9.6శాతం నుంచి 11.4శాతానికి పెరిగింది. 2022-23లో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ.7.28లక్షల కోట్లు. 2023-24 బడ్జెట్‌ సంవత్సరంలో అది రూ.10లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది 37.4శాతం పెరుగుదల. అధిక పెట్టుబడులు అధిక ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. అందుకే ఎన్నికలకు ముందు సంవత్సరంలో ప్రభుత్వాలు పెట్టుబడి వ్యయాలను పెంచుతాయి.


ఆహార భద్రతపై ఆందోళనలు

పారిశ్రామిక ఉత్పత్తిపై పెట్టుబడులు 2022 క్యూ2లో 3.8శాతం తరుగుపడగా, 2023 క్యూ2లో 13.9శాతం పెరిగాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ), స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో వివిధ కంపెనీల షేర్ల ధరల హెచ్చుతగ్గులను బట్టి పారిశ్రామిక అభివృద్ధిని అంచనా వేస్తారు. ముడి సరకులు, ఇంధనం, లోహాల ధరలు తగ్గడం, కార్పొరేట్‌ ఆదాయాలు పెరగడం, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుదల- ఇవన్నీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అధిక పారిశ్రామిక ఉత్పత్తికి దారితీశాయి. బొగ్గు, ముడి చమురు, సిమెంటు, ఉక్కు వినియోగం, ఉత్పత్తి పెరగడం జీడీపీ వృద్ధికి దోహదపడింది.


ఉత్పత్తి పెరిగినప్పుడు పన్ను వసూళ్లు అధికమవుతాయి. వస్తూత్పత్తి పెరగడానికి, తగ్గడానికి ప్రధాన కారణం- ప్రభుత్వ విధానాలే. వస్తుసేవల ఉత్పత్తి పెరిగితే పన్నుల ఆదాయమూ అధికమవుతుంది. అది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి దోహదపడుతుంది. ఇటీవలి పరిణామాల క్రమంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉండటంవల్లే, ఇటువంటి ప్రతికూల వాతావరణంలోనూ జీడీపీ వృద్ధి రేటు అధికంగా నమోదైంది. అయితే, దేశార్థికానికి సంబంధించి పలు సవాళ్లూ ఉన్నాయి.


ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) తగ్గింది. పీఎఫ్‌సీఈ అనేది దేశార్థికంలో వస్తుసేవలకు ఉన్న గిరాకీని సూచిస్తుంది. 2022-23 క్యూ2లో 8.1శాతం పెరిగిన పీఎఫ్‌సీఈ 2023-24 క్యూ2లో 3.1శాతం తగ్గింది. ఏడాది క్రితం జీడీపీలో 59.3శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగం ప్రస్తుత క్యూ2లో 56.8శాతానికి తగ్గిపోయింది. నిరుడు 2.5శాతం వృద్ధి నమోదుచేసిన వ్యవసాయరంగం ఈ ఏడాది 1.2శాతానికి పడిపోయింది. ఈ దుస్థితికి వాతావరణ మార్పులే చాలావరకు కారణం. ఆహార భద్రతపై మరింత జాగ్రత్త వహించాలని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈసారి వాణిజ్య వాహనాల విక్రయాలు, ప్రైవేటు వాహనాల కొనుగోళ్లు తగ్గాయి. విమాన, రైల్వే ప్రయాణికుల సంఖ్యతో పాటు రైళ్ల ద్వారా సరకు రవాణా సైతం తగ్గుముఖం పట్టింది. 2022-23 రెండో త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్లు, కమ్యూనికేషన్లు, సర్వీసులు 15.6శాతం వృద్ధిరేటు సాధించాయి. తాజా క్యూ2లో అవి 4.3శాతమే పెరిగాయి. కొవిడ్‌ కాలంలో నిలిచిపోయిన ప్రయాణాలు లాక్‌డౌన్‌ తొలగిన వెంటనే వేడి పాల పొంగులా పైకి ఎగసి ఆ తరవాత చల్లారడమే దీనికి కారణం. అయినప్పటికీ, ప్రజల ప్రయాణాలు ఇంతలా ఎందుకు తగ్గాయన్నది విశ్లేషించాలి. జీఎస్‌టీ వసూళ్లలో సరకు రవాణా వాటా ఎంత అనేది కీలకం. 2022 మే నుంచి రిజర్వు బ్యాంకు రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం ఆ రేటును 6.5శాతం దగ్గర నిలిపింది.


బహుముఖ చర్యలు కీలకం

విదేశీ మార్కెట్లలో ఎగుమతులకు అవకాశాలు తగ్గినప్పుడు స్వదేశీ మార్కెట్లో వినియోగం పెరగాలి. అది దేశార్థిక పురోగమనానికి ఊతమిస్తుంది. అందువల్ల విధానకర్తలు ద్రవ్యోల్బణం పెరగకుండా జాగ్రత్త వహిస్తూ స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ పెంచాలి. ముడిసరకులు, వస్తుసేవల లభ్యతలో అవరోధాలు ఏర్పడకుండా చూడాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ)తో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రత్యేక విధానాలను అవలంబించాలి. ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగిపోయాయి. ఎరువుల ధర ఒక శాతం పెరిగితే వ్యవసాయ సరకుల ధర 0.2శాతం చొప్పున అధికమవుతుందని అంచనా. అందువల్ల భారత్‌ ఎరువుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం ఎంతో అవసరం. సమీప భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో అస్థిరత, ఎగుమతుల తగ్గుదల దేశాభివృద్ధిని క్షీణింపజేయవచ్చు. మొత్తం 17 ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11- నేరుగా వ్యవసాయాభివృద్ధితో ముడివడినవే. కాబట్టి, వాతావరణ మార్పులను సైతం తట్టుకొనే అత్యాధునిక సేద్య విధానాలను అనుసరించడం మేలు.


పెరగని కుటుంబ ఆదాయాలు

దేశార్థికానికి ద్రవ్యోల్బణంవల్ల సవాలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) పెరుగుదలను ఆరు శాతానికి పరిమితం చేయాలనేది రిజర్వు బ్యాంకు లక్ష్యం. 2022-23లో సీపీఐ ఆరు శాతాన్ని మించిపోవడం ఆందోళన కలిగించింది. 2023-24లో అది దిగిరావడం కొంత ఊరటనిచ్చే విషయం. గడచిన ఏడు నెలల్లో స్థూల బ్యాంకు రుణాలు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు తీసుకోవడం బాగా ఎక్కువైంది. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో అవి 30శాతానికి పైగా అధికమయ్యాయి. మరోవైపు, జీఎస్‌టీ వసూళ్లూ గణనీయమైన వృద్ధిని నమోదుచేశాయి. పన్నుల ఆదాయం పెరగడంతో పెట్టుబడి వ్యయాన్ని సర్కారు ఇతోధికం చేయగలిగింది. కానీ, వ్యక్తులు, కుటుంబాల ఆదాయం పెరగకపోవడంతో వారి వినియోగ వ్యయం తగ్గింది. అంటే వస్తుసేవలకు గిరాకీ తగ్గిందన్నమాట. ఇది వస్తూత్పత్తి మీద, తద్వారా ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ధరల వాతలు.. తీరేనా వెతలు?

‣ సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

‣ సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం