• facebook
  • whatsapp
  • telegram

నైపుణ్యాలే ఉపాధి సోపానాలు



ఉన్నత విద్యను పూర్తిచేసే క్రమంలోనే ఉద్యోగం సాధించాలని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే ప్రాంగణ నియామకాలను కల్పించే విద్యాసంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆధునిక ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలలో పట్టు సాధించడం నేటి యువతకు ఎంతో అవసరం.


దేశంలో కొన్నేళ్లుగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లోనూ ఇవి తగ్గుముఖం పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ‘ప్రతిభా నివేదిక-2024’ అనేక కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన 11వేల మంది విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, మానవ వనరుల నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. దేశంలో ఏడు శాతం కళాశాలలు మాత్రమే నూరు శాతం ప్రాంగణ నియామకాలను చేపడుతున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు, వివిధ పరిశ్రమలు లేఆఫ్‌లు ప్రకటించడం నియామకాలు తగ్గడానికి ప్రధాన కారణాలని అది పేర్కొంది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాలను తగ్గించుకుంటున్నాయి.


ప్రాంగణ నియామకాల్లో పెద్దపీట

వివిధ కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులు, గత అనుభవం, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, సిఫారసులను అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కొంతకాలంగా ప్రాంగణ నియామకాలు తగ్గడంతో విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, అంకుర సంస్థల్లో పని చేయడానికి చాలామంది వెనకాడుతున్నారని ప్రతిభా నివేదిక-2024 పేర్కొంది. ఆకర్షణీయమైన జీతం కంటే ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని అది వివరించింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రులు మాత్రం ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనే కాకుండా, పనిని బట్టి ఏ సంస్థలో చేరడానికైనా ముందుకు వస్తున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది. చాలా సంస్థలు ప్రాంగణ నియామకాల్లో యువతుల కంటే యువకులకే ఎక్కువ ప్యాకేజీని ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. వాస్తవంలో చూస్తే, ప్రాంగణ నియామకాల కోసం చాలామంది విద్యార్థులు సరిగ్గా సిద్ధపడటం లేదు. నైపుణ్యాలు కొరవడటంవల్లే చివరి సంవత్సరం విద్యార్థుల్లో ఎక్కువమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేకపోతున్నారు. ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుండటం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్య ప్రణాళికలను ఆధునికీకరించకపోవడం, నాణ్యమైన బోధన కొరవడటం వంటివి కూడా ప్రాంగణ నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి.


యునెస్కో అధ్యయనం ప్రకారం, భారతీయ యువతలో దాదాపు సగం మందికి వివిధ రంగాలకు అవసరమైన కనీస నైపుణ్యాలు కూడా ఉండటం లేదు. భారతదేశ నైపుణ్యాల నివేదిక-2022 సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇంజినీర్లకు సంబంధించిన జాతీయ ఉపాధి అవకాశాల నివేదిక (2019) అయితే- దేశంలో వివిధ సాంకేతిక కోర్సులు పూర్తిచేసిన వారిలో 80శాతం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఏ ఉద్యోగం చేయడానికీ అర్హులుకారని తేల్చేసింది. ముఖ్యంగా ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన డిజిటల్‌ నైపుణ్యాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో కొరవడుతున్నాయని అది విశ్లేషించింది. సాంకేతిక విద్యను అభ్యసించిన వారిలో కేవలం 2.5 శాతానికి కృత్రిమ మేధ(ఏఐ), 5.5శాతానికి ప్రాథమిక ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యాలు ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే 1.5శాతం యువ ఇంజినీర్లలోనే ఆధునిక ఉద్యోగాలకు అవసరమైన అన్ని రకాల అర్హతలు ఉంటున్నాయని ప్రాంగణ నియామకాలు చేపడుతున్న సంస్థలు చెబుతున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న ఇండియా ప్రపంచ ఉద్యోగ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలి. వచ్చే మూడు దశాబ్దాలలో ప్రపంచ ఉద్యోగాల్లో 22శాతం భారతదేశమే అందించాలని, 2050 నాటికి అదనంగా 18.3 కోట్ల మంది యువతీ యువకులను నిపుణులుగా తీర్చిదిద్దాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి జనాభా గణాంకాలు చెబుతున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే- ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, వ్యాపార మెలకువలపై యువతకు శిక్షణ ఇవ్వాలి. వీటితో పాటు విషయ పరిజ్ఞానం, చక్కటి భావవ్యక్తీకరణ, సానుకూల దృక్పథం, నైతిక విలువలు, బృందంతో కలిసి పనిచేసే మనస్తత్వం వారికి అలవరచాలి. అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగార్థుల నుంచి భావవ్యక్తీకరణ సామర్థ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను, విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం వంటి లక్షణాలను ఎక్కువగా ఆశిస్తున్నట్లు ఇండియా ఎడ్యుకేషన్‌ ఫోరం గతంలో నివేదించింది.


పాఠశాల స్థాయిలోనే పునాది

ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యను దేశ యువతకు అందించడం ఎంతో అవసరం. సంప్రదాయ కోర్సుల స్థానంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌, వర్చువల్‌ రియాలిటీ, డేటా సైన్స్‌ వంటి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాలి. చదువు పూర్తయ్యే నాటికి విద్యార్థులను ఆయా అంశాల్లో మెరికలుగా తీర్చిదిద్దాలి. వైజ్ఞానిక శకంలో నాణ్యమైన విద్య అంటే నైపుణ్యాలను అందించే విద్యే. కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లోనూ ఐఐటీ ముంబయికి చెందిన 85 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో కోటి రూపాయలకు పైగా ప్యాకేజీలతో ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారంటే కారణం- సమర్థ నైపుణ్యాలే! అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకొని మన దేశంలోనూ నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, గణిత (స్టెమ్‌) పాఠ్యాంశాలను లోతుగా అభ్యసించేలా ప్రోత్సహించాలి. జాతీయ నూతన విద్యావిధానం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. వివిధ రంగాల్లో ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాలను మదింపువేసి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలి. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం నిరీక్షించే దుస్థితిని పారదోలి, ఆయా సంస్థలే వారి కోసం పోటీపడే పరిస్థితిని తీసుకురావాలి.


నూతన సాంకేతికతలను అంది పుచ్చుకొంటేనే..

ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో 8.3 కోట్ల ఉద్యోగాలు అంతర్థానమవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది. అంటే సాధారణ అర్హతలు కలిగిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు అందివస్తాయన్న మాట. భవిష్యత్తులో కృత్రిమ మేధ (ఏఐ), యంత్రభాష (ఎంఎల్‌), వ్యాపార విశ్లేషణ (బీఏ), సమాచార భద్రతలో నైపుణ్యాలు కలిగిన వారికి అధిక డిమాండ్‌ ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 54శాతం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి.


- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ (విద్యారంగ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పట్టాలెక్కని మహిళా కోటా

‣ వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

‣ మసిబారుతున్న ప్రజారోగ్యం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

Posted Date: 06-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం