• facebook
  • whatsapp
  • telegram

భద్రతకు ఆత్మనిర్భరతే పునాది



త్రివిధ దళాల కోసం రూ.2.23లక్షల కోట్ల విలువైన ఆయుధ సంపత్తిని సమకూర్చడానికి భారత రక్షణశాఖ ఇటీవల పచ్చజెండా ఊపింది. అందులో 98శాతం నిధులను స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధాల సేకరణకు వెచ్చిస్తారు. ఈ అస్త్రశస్త్రాలు త్రివిధ బలగాల పోరాట పటిమను ఇనుమడింపజేయడంతో పాటు రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధనకూ తోడ్పడతాయి.


మన సైన్యం, వైమానిక, నౌకా దళాలు ఆయుధాలు సేకరించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు శీఘ్రంగానే లభించాయి. కానీ, సేకరణ ప్రక్రియ మాత్రం బాగా ఆలస్యమవుతోంది. రకరకాల నియమ నిబంధనలు సంక్లిష్ట సేకరణ ప్రక్రియ సజావుగా సాగకుండా అడ్డుపడుతున్నాయి. ఈ అడ్డంకులను తొలగించి వేగంగా ఆయుధ సేకరణ చేపట్టడానికి పలు చర్యలు తీసుకున్నప్పటికీ, చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. మొత్తం ఆయుధ సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరం కనిపిస్తోంది.


ఆధునిక సాంకేతికతలు

భారత ప్రభుత్వం 1956లో తెచ్చిన పారిశ్రామిక విధానం సొంత గడ్డపై ఆయుధోత్పత్తి సాధించాలని లక్షించింది. కానీ, మన రక్షణ దళాల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఆ విధానం సఫలం కాలేకపోయింది. 1990లలో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం కావడం, మన సాయుధ దళాల అవసరాలకు కావలసిన ఆయుధాలను స్వదేశంలోనే ఉత్పత్తిచేసే సామర్థ్యం కొరవడటం, ఆర్థిక సరళీకరణ తరవాత రక్షణోత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం వంటి పరిణామాలు సంభవించాయి. మారిన కాలానికి తగినట్లుగా ఆయుధ సేకరణ విధానాన్నీ మార్చుకోవలసి వచ్చింది. తదనుగుణంగా 1989లో ప్రజాపద్దుల కమిటీ 187వ నివేదిక రక్షణ పరికరాల సేకరణ విధానానికి కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఆ ప్రకారం, 1992లో నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. 2001లో సంభవించిన కార్గిల్‌ యుద్ధం- సొంతంగా ఆయుధోత్పత్తి శక్తిని సముపార్జించాల్సిన ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఆ క్రమంలో త్రివిధ దళాలు, తీరరక్షక దళానికి ఆయుధ సేకరణ విధానాలు, సేకరణ ప్రక్రియ రూపకల్పనకు ‘రక్షణ సేకరణ మండలి’ని ఏర్పరచాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. 2002లో ప్రవేశపెట్టిన రక్షణోత్పత్తుల సేకరణ విధానం (డీపీపీ) ఆయుధ సేకరణకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఆపై 18 సంవత్సరాల్లో డీపీపీని ఎనిమిదిసార్లు సవరించారు. 2020లో డీపీపీ పేరును డీఏపీగా మార్చారు. నాటి నుంచి అది రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రాతిపదిక పత్రంగా ఉపయోగపడుతోంది. డీఏపీ-2020ని రక్షణపరంగా ఆత్మనిర్భరత సాధనకు పునాదిగా పరిగణిస్తున్నారు. విదేశాలతో భారత్‌ కుదుర్చుకునే రక్షణ ఒప్పందాల నుంచి ‘ఆఫ్‌సెట్‌ క్లాజు’ను డీఏపీ-2020 తొలగించింది. ఆయుధాలను, ఇతర రక్షణ పరికరాలను లీజుపై తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆఫ్‌సెట్‌ క్లాజు కింద విదేశీ కంపెనీ భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద విలువలో 30శాతాన్ని ఇండియాలోనే పెట్టుబడి పెట్టాలి. తద్వారా భారత్‌కు ఆధునిక సాంకేతికతలు, నైపుణ్యాలు అంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఆచరణలో ఆ ఫలితాలు సిద్ధించలేదు. స్థానిక పరిశ్రమలకు అధునాతన సాంకేతికతలు, నైపుణ్యాలు అందలేదు. దాంతో ఆఫ్‌సెట్‌ కన్నా ఆయుధ లీజులకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. డీఏపీలో మరిన్ని నియమనిబంధనలను చేరుస్తూ రావడంతో రక్షణ ఉత్పత్తుల సేకరణ ప్రక్రియ జటిలంగా మారింది. డీఏపీ ప్రకారం, ఆయుధ సేకరణ ప్రక్రియ 74-106 వారాల్లో పూర్తికావాలి. కానీ, ఆ గడువులోగా పని పూర్తికాని సందర్భాలే ఎక్కువ. ఉదాహరణకు 66 ఆధునిక హాక్‌ శిక్షణ జెట్‌ విమానాల సేకరణకు 2003లో ఒప్పందం కుదిరింది. అవి భారత్‌కు అందడానికి 20 ఏళ్లు పట్టింది!


ఆయుధ సేకరణ ఆవశ్యకతను గుర్తించడం, అందుకు ఆమోదం తెలపడం, సరఫరాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వారి ఆయుధాలను సాంకేతికంగా మదింపు చేయడం, ఒప్పంద నిబంధనలపై సంప్రతింపులు చేపట్టడం, తుది ఆమోదం తెలుపడం- డీఏపీలో అంతర్భాగాలు. ఇది 12 అంచెలుగా జరిగే ప్రక్రియ. ఒప్పందంపై సంప్రతింపులు జరుగుతుండగానే ఆయుధాల ధర, కొనుగోలుకు కావలసిన నిధులను పరిశీలించడానికి ఒక కమిటీని నియమిస్తారు. ఆ సంఘం అనుమతించిన తరవాతే తుది ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రక్షణ సామగ్రి సేకరణకు 122 ఒప్పందాలు కుదిరాయి.


దేశీయంగా అభివృద్ధే కీలకం

దేశంలో రక్షణోత్పత్తుల తయారీకి డీఏపీ-2020 ఊతమిచ్చినప్పటికీ, కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలి. ఆయుధాలు కొనడం (బై), స్వదేశీ ఆయుధాలను కొనడం, ఇక్కడే తయారుచేయడం (బై అండ్‌ మేక్‌), అంతర్జాతీయంగా కొనడం, భారత్‌లో తయారుచేయడం (బై-గ్లోబల్‌) వంటి తరగతుల కింద ఆయుధ సేకరణకు డీఏపీ-2020 మార్గదర్శకాలు రూపొందించింది. బై-గ్లోబల్‌ తరగతి కింద కొనుగోలు చేసే ఆయుధాల్లో 30శాతాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి. భారీ రక్షణ ఒప్పందాలకు; భారత్‌, ఇతర దేశాల మధ్య కుదిరే ఒడంబడికలకు బై-గ్లోబల్‌ నిబంధనలు వర్తిస్తాయి. ఇతర తరగతుల కింద కుదిరే ఒప్పందాల్లో సగం మొత్తాన్ని స్వదేశంలో ఆయుధోత్పత్తికి వెచ్చించాలి. కానీ, ఈ విధానంలో రెండు ప్రధాన లోపాలున్నాయి. ఒకటి: స్వదేశంలో తయారుచేసే ఆయుధాలను ఒప్పంద విలువ ఆధారంగా నిర్ణయించడం. రెండోది: విదేశాల నుంచి ఆయుధాలను అనివార్యత వల్ల దిగుమతి చేసుకుంటున్నారో, వెసులుబాటును బట్టి దిగుమతి చేసుకుంటున్నారో స్పష్టత లేకపోవడం. ఆయుధాల్లో స్వదేశీ వాటా గురించి డీఏపీ-2020లో స్పష్టత ఉండాలి. ఆయుధ సేకరణ, స్వదేశంలో రక్షణ పరిశ్రమల అభివృద్ధికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా దేశాలు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలి. ఫ్రాన్స్‌ విధానాన్ని మనం చేపట్టడం అభిలషణీయమని 2005లో రక్షణశాఖ నియమించిన కేల్కర్‌ కమిటీ సిఫార్సు చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కీలక పరిజ్ఞానాలను స్వదేశంలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. మొదట విడిభాగాల తయారీపై దృష్టి పెట్టాలి. అందుకు అనుగుణంగా డీఏపీ-2020లో మార్పుచేర్పులు చేపట్టాలి.


సేకరణ ప్రక్రియలో జాప్యం..

మన దేశంలో ఆయుధాల కొనుగోలుకు పలువురు అధికారులు, సంస్థలు, సంఘాల ఆమోదం అవసరం. దాంతో రక్షణ ఉత్పత్తుల సేకరణ ప్రక్రియ (డీఏపీ) జాప్యమవుతోంది. రూ.300కోట్ల విలువైన ఆయుధాలు, రక్షణ పరికరాల కొనుగోళ్లకు త్రివిధ సాయుధ దళాధిపతుల ఆమోద ముద్ర కావాలి. రూ.500కోట్ల విలువ వరకు రక్షణశాఖ కార్యదర్శి అనుమతి, రూ.2,000కోట్ల వరకు రక్షణ మంత్రి అనుమతి కావాలి. అంతకన్నా ఎక్కువ విలువైన ఆయుధాలను కొనడానికి భద్రతా వ్యవహారాలపై ఏర్పాటయ్యే ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ సంఘం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తికావడానికి చాలా సమయం పడుతోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

‣ కెన్యాతో కలిసికట్టుగా..

‣ భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం