• facebook
  • whatsapp
  • telegram

ఇటు శాంతి మంత్రం.. అటు రణతంత్రం



ఈశాన్య భారతంలో శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అక్కడి సాయుధ తిరుగుబాటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇటీవల యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా)తో త్రైపాక్షిక సంధి కుదిరింది. కానీ, ఒక వర్గమే ఈ సయోధ్యకు ముందుకు వచ్చింది. ఇలాంటి శాంతి ఒప్పందాలతో ప్రయోజనం ఎంత?


ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా పలు హింసాత్మక తిరుగుబాటు ఉద్యమాలు రేగుతూ వచ్చాయి. దీనివల్ల అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో అస్థిరత నెలకొని అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. 2014 తరవాత పరిస్థితి చాలావరకు మెరుగుపడినట్లు కేంద్రం చెబుతోంది. ఈశాన్య భారత రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, సైన్యం కలిసి తిరుగుబాట్ల అణచివేతకు గట్టి చర్యలు తీసుకొన్నాయి. రాజ్యాంగ పరిధిలో శాంతియుత పరిష్కారానికి కేంద్రం కృషి చేసింది. తిరుగుబాటు బృందాలతో చర్చలు జరిపి హింసను విడనాడాలని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని హింసోద్యమకారులతో సరిహద్దు రక్షణకు, శాంతి సాధనకు 2014 నుంచి కేంద్రం తొమ్మిది ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవల అస్సాం ప్రభుత్వం, కేంద్రం, యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా) మధ్య కుదిరిన ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకొంది.


విదేశాల్లో స్థావరాలు

ఉల్ఫాకు చెందిన అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని ఒక వర్గమే ఇటీవలి చర్చలకు ముందుకు వచ్చింది. పరేశ్‌ బారువా నేతృత్వంలోని మరో వర్గం శాంతి ఒప్పందంలో పాలుపంచుకోలేదు. ఈ వర్గం ప్రత్యేక అస్సాం దేశం ఏర్పడే వరకు పోరాటం కొనసాగిస్తామని భీష్మించినందు వల్ల ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పూర్తిగా సద్దుమణగకపోవచ్చు. పరేశ్‌ వర్గం మయన్మార్‌లో శిబిరాలను ఏర్పరచుకుని అక్కడి నుంచి అస్సామ్‌లో హింసాత్మక దాడులు చేపడుతోంది. 244ఎ రాజ్యాంగ అధికరణ కింద అస్సామ్‌లో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలని కార్బి తెగవారు పోరాడుతున్నారు.  రాష్ట్రంలోని గిరిజన తెగలకు స్వయం నిర్ణయాధికారంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఈ అధికరణ వీలు కల్పిస్తోంది. అంతకుముందు నవంబరు 29న మణిపుర్‌ ప్రభుత్వం, కేంద్రం, యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (యూఎన్‌ఎల్‌ఎఫ్‌)ల మధ్య మరో శాంతి ఒప్పందం కుదిరింది. మణిపుర్‌లో ఆరు దశాబ్దాల నుంచి హింసాత్మక దాడులకు తెగబడుతున్న యూఎన్‌ఎల్‌ఎఫ్‌ భారత రాజ్యాంగాన్ని, దేశ చట్టాలను గౌరవిస్తానని ప్రకటించింది. ఈ ఒప్పందంతో మణిపుర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని కేంద్రం భావించింది. అక్కడ తాజాగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య భారతంలోని నాగాలాండ్‌లో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. ఈ రాష్ట్రంలో 70 ఏళ్ల నుంచి నాగా తిరుగుబాటు కొనసాగుతోంది. దీనికి స్వస్తి పలకడానికి 1997 ఆగస్టు ఒకటిన కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం గ్రూపు) మధ్య శాంతి ఒప్పందం కుదిరినా పరిస్థితి పూర్తిగా కుదుటపడలేదు. నాగాలాండ్‌కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం కావాలని ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం గ్రూపు పటుపట్టడమే దీనికి కారణం. ఏడు నాగా తిరుగుబాటు బృందాలతో ఏర్పడిన నాగా జాతీయ రాజకీయ బృందాలు (ఎన్‌ఎన్‌పీజీ) మాత్రం శాంతికి కలిసివస్తున్నాయి. తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ మేఘాలయలో నిషేధిత హిన్యూత్రిప్‌ నేషనల్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌సీ) సైతం శాంతి చర్చల నుంచి వైదొలగాలని తాజాగా నిర్ణయించింది. ఏతావతా ఈశాన్య భారతంలో శాశ్వత శాంతికి ఇంకా ఎన్నో అవరోధాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు తేటతెల్లం అవుతూనే ఉంది. ఈశాన్య భారత సాయుధ తిరుగుబాటుదారులు గతంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని భారత్‌పై దాడులకు తెగబడేవారు. ఈ బృందాల అగ్ర నాయకుల స్థావరాలు, శిక్షణ కేంద్రాలు ఆ దేశాల్లో ఉండేవి. వాటిని నిర్మూలించడానికి 2003లో భూటాన్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ ఆల్‌ క్లియర్‌ పేరిట పెద్దయెత్తున దాడులు నిర్వహించింది. 2009లో బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రధానమంత్రి పదవి చేపట్టాక తమ దేశంలోని ఈశాన్య భారత తిరుగుబాటుదారుల కేంద్రాలపై దాడులు చేపట్టారు. అనూప్‌ చెటియా, అరవింద రాజ్‌ఖోవా అనే అగ్ర తిరుగుబాటు నాయకులను బంగ్లా ప్రభుత్వం పట్టుకొని భారత్‌కు అప్పగించింది. 2019లో భారత్‌, మయన్మార్‌ సైన్యాలు కలిసి అక్కడ తిష్ఠ వేసిన ఈశాన్య భారత తిరుగుబాటుదారుల్ని శిబిరాలను తుడిచిపెట్టాయి. చైనా ఇక్కడి తిరుగుబాటుదారుల్ని భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. ఉల్ఫాలో ఒక వర్గానికి నాయకుడై పరేశ్‌ బారువాకు చైనా ఆయుధాలు, నిధులు అందిస్తోంది. అతడికి ఆశ్రయమూ కల్పించింది.


ఆగ్నేయాసియాతో ఆర్థిక వారధి

ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి, ఆగ్నేయాసియాకు మధ్య భౌగోళిక వారధిగా నిలుస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) సభ్యదేశాలతో, ఇతర తూర్పు ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలను పెంచుకోవడానికి ఇండియా 2014లో తూర్పు దిశగా కార్యాచరణ విధానాన్ని చేపట్టింది. 2017లో భారత్‌, జపాన్‌లు ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధికి తూర్పుదిశగా కార్యాచరణ వేదికను ఏర్పరచాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి, సుస్థిరతలకు జపాన్‌ 2023 మార్చిలో ప్రారంభించిన ఇండో-పసిఫిక్‌-జపనీస్‌ ప్రణాళిక (ఎఫ్‌ఓఐపీ) ఈశాన్య భారతానికి లబ్ధి చేకూరుస్తుంది. ఈశాన్య భారతానికి ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అనుసంధానతను ఏర్పరచే అవకాశాలను భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలు అన్వేషిస్తున్నాయి. బంగాళాఖాత దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార వృద్ధికి ఉద్దేశించిన బిమ్‌స్టెక్‌ పథకమూ ఈశాన్య భారత ప్రగతికి తోడ్పడుతుంది. అయితే, ఈశాన్యంలో తరచూ తలెత్తుతున్న ఉద్రిక్తతలు ఆ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. వీటిని నిలువరించి ఈశాన్యంలో శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి కేంద్రం మరింతగా కృషి చేయాలి.


వ్యూహాత్మకంగా చికెన్స్‌ నెక్‌

ఈశాన్య భారతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడం భారత్‌కు చాలా ముఖ్యం. అస్సామ్‌లో కోడి మెడ (చికెన్స్‌ నెక్‌)గా పేరుపడిన సిలిగుడి కారిడార్‌ ఈశాన్య భారత రాష్ట్రాలకు, మిగతా భారతదేశానికి మధ్య ఏకైక వారధిగా నిలుస్తోంది. ఈ కారిడార్‌ వెడల్పు 21 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఈ ఇరుకైన మార్గాన్ని చికెన్స్‌ నెక్‌గా పిలుస్తారు. దీనిపై పట్టు కోల్పోతే భారత్‌కు ఈశాన్యంతో లంకె తెగిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఈశాన్య భారతంలో తిరుగుబాటు బృందాలు చెలరేగిపోతుంటాయి. సిలిగుడి కారిడార్‌ చైనా, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకు సమీపంలో ఉండి వ్యూహపరంగా కీలక ప్రాముఖ్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఈ కారిడార్‌ భారతదేశానికి ఆగ్నేయాసియా దేశాలతోనూ వారధి ఏర్పరుస్తున్నందువల్ల భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

‣ ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు

‣ కాగ్‌ విశ్వసనీయతకు తూట్లు

‣ మాల్దీవులతో బంధానికి బీటలు

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం