• facebook
  • whatsapp
  • telegram

అసమాన పోరాట శక్తిగా నౌకాదళం



సువిశాల సాగర జలాలపై హక్కులను కాపాడుకోవడంలో మన నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోంది. హిందూ మహాసముద్రం గుండా వెళ్ళే రవాణా మార్గాలను పరిరక్షించడంతోపాటు దేశ భద్రత, విపత్తుల నిర్వహణ వంటి బాధ్యతలనూ నిర్వర్తిస్తోంది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా..


దేశ రక్షణలో మన నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. సముద్రాల్లో మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలు, సాయుధ దోపిడి, చేపల అక్రమ వేటను అడ్డుకోవడంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. సునామీ, తుపానులు వంటి విపత్తుల వేళ సహాయక చర్యలు చేపడుతోంది. హిందూ మహాసముద్రంలో, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మన పొరుగు ప్రాంతాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా ‘ముత్యాల సరం’ ప్రాజెక్టు చేపడుతోంది. దానికి ప్రతిగా భారత్‌ ‘వజ్రాల హారం’ పథకాన్ని తీసుకొచ్చింది. దక్షిణ చైనా సముద్రం, ఆసియాన్‌ దేశాలు, హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి ఇది ఇండియాకు ఉపకరిస్తుంది.


డ్రాగన్‌కు దీటుగా..

మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో డ్రాగన్‌ పట్టుపెంచుకొంది. భారతదేశ తీరానికి సమీపంలోని సముద్రాల్లో చైనా అణు జలాంతర్గాములు, యుద్ధనౌకలు, చేపల పడవలు, పరిశోధన నౌకల సంచారం పెరగడం మన నౌకాదళానికి ఆందోళన కలిగిస్తోంది. సాగర గర్భంలో చైనా డ్రోన్ల సంచారమూ ఎక్కువైంది. ఈ ఏడాది జనవరిలో మానవరహిత డ్రోన్‌ వాహకనౌకను ప్రవేశపెట్టింది. ఇటువంటి డ్రోన్లు, పరిశోధక నౌకలను చైనా ప్రస్తుతం నిఘా కార్యకలాపాల్లో వినియోగిస్తోంది. వీటి సాయంతో భవిష్యత్తులో కీలక సముద్ర రవాణా, నౌకాదళ మార్గాలను దిగ్బంధించే ప్రమాదముంది. కాబట్టి, డ్రాగన్‌ నుంచి ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి 2035కల్లా ఆత్మనిర్భరత కింద 175 యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని భారత్‌ లక్షించింది. విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగానే వీటిని నిర్మించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 41 యుద్ధనౌకలు దేశీయంగా తయారవుతున్నాయి. రెండింటిని మాత్రం విదేశాల నుంచి సమకూరుస్తున్నారు. మరో 49 యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. 2030కల్లా 24 యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని 2012-27 నౌకాదళ సామర్థ్య ప్రణాళిక నిర్దేశిస్తోంది. భారత్‌ ఇటీవల అయిదు కల్వరి శ్రేణి జలాంతర్గాములను సమకూర్చుకొంది. ప్రస్తుతమున్న రెండు విమాన వాహక యుద్ధనౌకలకు తోడు మూడో నౌకనూ నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. మన యుద్ధనౌకలపై 40 మానవ రహిత డ్రోన్లను మోహరించడానికి భారత్‌ 2022లో అంతర్జాతీయ టెండర్‌ను పిలిచింది. వీటిలో పదింటిని రూ.1,300 కోట్లతో సేకరించే ప్రక్రియ జోరందుకొంది. సాగరగర్భ సర్వే చేపట్టడానికి, సముద్రంలో మందుపాతరలను కనిపెట్టి నిర్వీర్యం చేయడానికి తోడ్పడే స్వయంచాలిత వాహనాల (ఏయూవీ) తయారీ ప్రాజెక్టును గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ సంస్థ ఈ ఏడాది జులై 28న ప్రారంభించింది. మానవ రహిత గగనతల, సముద్రగర్భ డ్రోన్ల తయారీలో ఆత్మనిర్భరత కింద ప్రైవేటు రంగాన్నీ భాగస్వామిని చేస్తున్నారు. ఎల్‌ అండ్‌టీ అదమ్య, అమోఘ్‌, మాయ అనే సముద్రగర్భ డ్రోన్లను తయారు చేస్తోంది. టార్డిడ్‌ టెక్నాలజీస్‌ మూడు మానవ రహిత ఉపరితలనౌక (యూఎస్‌వీ)లను నిర్మిస్తోంది. కృత్రిమ మేధ, డ్రోన్ల దండుతో పనిచేసే భారతదేశపు ప్రప్రథమ సాయుధ యూఎస్‌వీ పరాశర్‌ను సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ నిర్మిస్తోంది. శత్రు జలాలపై నిఘా ఉంచడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక దాడులు చేపట్టడానికి ఇది దోహదపడుతుంది. భారత నౌకాదళం తొలిసారిగా 2004లో సముద్ర రక్షణ వ్యూహాన్ని ప్రకటించింది. పరిస్థితులకు తగ్గట్లుగా దాన్ని 2007, 2009, 2015 సంవత్సరాల్లో సవరించారు. 2007నాటి సవరణ- హిందూ మహాసముద్రాన్ని భారతదేశ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించుకోవాలని నిర్దేశించింది. 2009 సవరణ భారత్‌ను హిందూ మహాసముద్ర పహారాదారుగా వర్ణించింది. 2015 సవరణపత్రం- భారత్‌ను హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌ను నిలువరించే శక్తిమంతమైన రాజ్యంగా తీర్చిదిద్దాలని నిర్దేశించింది. 2015కు ముందు మన నౌకాదళ దృష్టి అంతా బంగాళాఖాతం, అరేబియా సముద్రంపైనే కేంద్రీకృతమై ఉండేది. కాలక్రమంలో పడమర హోర్ముజ్‌ జలసంధి, బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ నుంచి తూర్పున మలక్కా జలసంధి, లోంబాక్‌, సుండా, ఓంబాయ్‌ జలసంధుల వరకు కార్యకలాపాలను విస్తరించింది. మధ్యధరా సముద్రం, అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాలకూ ప్రాధాన్యమిస్తోంది. హిందూ మహాసముద్ర తీర దేశాలకు భద్రత కల్పించడంపై దృష్టి సారించిన 2015నాటి వ్యూహపత్రాన్ని త్వరలోనే సవరించి, చైనా ముట్టడి వ్యూహాన్ని చేపట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


బలపడుతున్న బంధాలు..

భారత్‌ తన వ్యూహ లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే- ఇతర దేశాలతో బంధాలను పటిష్ఠపరచుకోవాలి. ఇప్పటికే మన నౌకాదళం మిత్రదేశాలతో కలిసి విన్యాసాలు చేపడుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇండొనేసియా, ఇరాన్‌, కువైట్‌, కజఖ్‌స్థాన్‌, మాల్దీవులు, మంగోలియా, మయన్మార్‌, ఒమన్‌, రష్యా, సిషెల్స్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, బ్రిటన్‌, అమెరికా, యూఏఈ, వియత్నాం, ఆసియాన్‌ దేశాలతో సైనిక, నౌకాదళ సంయుక్త విన్యాసాలను భారత్‌ ముమ్మరం చేసింది. అమెరికాతోపాటు అనేక దేశాలతో ద్వైపాక్షిక, బహుళపక్ష రక్షణ సహకార ఒప్పందాలు కుదుర్చుకొంది. సింగపూర్‌లోని చాంగి రేవు, ఇండొనేసియాలోని సబాంగ్‌, ఒమన్‌లోని దుక్మ్‌ రేవుల వినియోగానికి అంగీకారం కుదుర్చుకుంది. కోకో, రీయూనియన్‌ దీవుల్లో నౌకా స్థావరాల నిర్వహణకు ఆస్ట్రేలియా, సిషెల్స్‌, రీయూనియన్‌లతో భారత్‌ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు, ఇండో-పసిఫిక్‌ క్వాడ్‌, సాగర్‌ వేదికల ద్వారా బహుళపక్ష సహకారం నెరపుతోంది. సమర్థవంతమైన ఆయుధ నిర్మాణ ప్రణాళికలతో 2047కల్లా స్వావలంబన సాధించాలని భారత నౌకాదళం ఉవ్విళ్లూరుతోంది. కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకొని 2030 నాటికి అసమాన పోరాటశక్తిగా అవతరించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.


మేటిగా నిలవాలని..

ప్రపంచంలోని ప్రధాన నౌకాదళాల్లో ఒకటిగా నిలవడం కోసం ఇండియన్‌ నేవీ 2004-15 సముద్ర వ్యూహం చేపట్టింది. శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం కోసం 2012 నుంచి అత్యాధునిక సాంకేతికతలు, సాధన సంపత్తిని సమకూర్చుకొంటోంది. ముఖ్యంగా విమానవాహక యుద్ధ నౌకలు, సముద్ర గర్భంలో స్వయంచాలితంగా తిరిగే వాహనాలు(ఏయూవీ), మానవ రహితంగా కదలాడే ఉపరితల నౌకలు(యూఎస్‌వీ), సముద్రగర్భ వాహనాలు(యూయూవీ), జలాంతర్గాములు, డ్రోన్లు వంటి వాటిని సముపార్జిస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

‣ పటిష్ఠ చర్యలతోనే భూతాప నియంత్రణ

‣ జీ20 సారథ్యంలో మేటి విజయాలు

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం