• facebook
  • whatsapp
  • telegram

జమిలి బాటలో సవాళ్ల మేట



దేశీయంగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం ప్రత్యేక సంఘాన్ని నియమించింది. స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. సవరణలు ఏవైనా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈనెల 18నుంచి జరగనున్నాయి. అసలు ఈ సమావేశ అజెండా ఏమిటో ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. జమిలి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ప్రజల్లో బహిరంగ చర్చ జరపకుండా, పారదర్శకత లేకుండా, ఔచిత్యం, రాజ్యాంగబద్ధతను పట్టించుకోకుండా ఎన్డీయే సర్కారు జమిలి ఎన్నికలకు తొందరపడుతోంది.


రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి

స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన ఉన్నత స్థాయి సంఘాన్ని (హెచ్‌ఎల్‌సీ) నియమించింది. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు 1951-52లో జరిగాయని, అప్పటి నుంచి 1970 వరకు లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎలెక్షన్లు జరుగుతూ వచ్చాయని ప్రభుత్వం వివరించింది. ఆ తరవాత కొన్ని కారణాల వల్ల ఏటా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి దీర్ఘకాలం అమలులో ఉండటం వల్ల అభివృద్ధి పడకేస్తోందని పేర్కొంది. ఇలా జమిలి ఎన్నికల అవసరాన్ని చెబుతూ- ఉన్నతస్థాయి సంఘాన్ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభ, శాసనసభలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించడమన్నది ఎప్పుడో ఒకసారి జరగాలే తప్ప, అదే సర్వసాధారణం కాకూడదని న్యాయ సంఘం సూచించింది. మరోవైపు ఉన్నత స్థాయి సంఘం(హెచ్‌ఎల్‌సీ) కూర్పు, దాని పరిశీలనాంశాలు సంతృప్తికరంగా లేవు. తనకు అప్పగించిన బాధ్యతలను ఈ సంఘం ఎప్పటిలోగా పూర్తి చేయాలనేదీ స్పష్టంగా వివరించలేదు. హెచ్‌ఎల్‌సీ తన సమావేశాలు, ఇతర విధులను ఎలా నిర్వహించాలో తానే నిర్ణయించుకోవచ్చు. అంటే, హడావుడిగా సమావేశాలను నిర్వహించి ప్రభుత్వానికి కావాల్సిన విధంగా సిఫార్సులు చేసి మమ అనిపించేయవచ్చు! ఈ సంఘంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభ్యత్వం కల్పించారు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడికి స్థానం లేదు. దానికి బదులు రాజ్యసభలో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి సభ్యత్వం కల్పించారు. హెచ్‌ఎల్‌సీ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతిని నియమించడం విడ్డూరం. అసలు దేశంలో అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తి హెచ్‌ఎల్‌సీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి అంగీకరించడం సముచితం అనిపించుకోదు. నైతికంగానూ సమర్థనీయం కాదు.


దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే కనీసం ఏడు రాజ్యాంగ అధికరణలకు సవరణలు చేపట్టడం తప్పనిసరి. పార్లమెంటు, శాసనసభల పదవీ కాలాలకు... శాసనసభలు, స్థానిక ఎన్నికల రద్దుకు సంబంధించిన రాజ్యాంగ అధికరణలతోపాటు రాష్ట్రపతి పాలన విధింపునకు వీలు కల్పించే 356వ అధికరణకు సైతం సవరణలు చేయాల్సి ఉంటుంది. ఏతావతా, ఏయే సవరణలు తీసుకురావాలో ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేయాలి. ప్రపంచంలో నేడు కేవలం మూడు దేశాల్లోనే జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. అవి- బెల్జియం, స్వీడన్‌, దక్షిణాఫ్రికా. అవేవీ భారత్‌ మాదిరిగా సువిశాల దేశాలు కావు. మన రాజ్యాంగానికి ఏ సవరణలు చేపట్టాలన్నా 368వ అధికరణ నిర్దేశించిన ప్రకారమే జరగాలి. కనీసం సగం రాష్ట్రాలు ఆమోదిస్తే తప్ప కొన్ని నిబంధనలను మార్చడానికి వీలుండదు. హెచ్‌ఎల్‌సీ సిఫార్సులను 2024లోగా సగం రాష్ట్రాలు ఆమోదిస్తాయా అంటే సందేహమే. పైగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ(1973) కేసులో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. తన చిత్తం వచ్చినట్లు రాజ్యాంగానికి సవరణలు చేయడం కోసం పార్లమెంటుకు 368వ అధికరణ పరిధిని విస్తరించే అధికారం లేదు. ఈ మేరకు 2007లో ఐఆర్‌ కొయెలో వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసులో తొమ్మిది మంది సభ్యుల సుప్రీం ధర్మాసనం తీర్మానించింది. అపరిమిత సవరణాధికారాలతో రాజ్యాంగ మౌలిక చట్రాన్ని దెబ్బతీయకూడదని పేర్కొంది. ఎన్నికలు సైతం ఈ చట్రంలోకే వస్తాయి. రాష్ట్రాల ఆమోదం పొందకుండా రాజ్యాంగాన్ని మార్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.


పార్టీలకే ప్రయోజనం

జమిలి ఎన్నికల నిర్వహణ విషయంలో విభిన్న వర్గాలతో విస్తృతంగా సంప్రతింపులు చేపట్టి, పారదర్శకతకు పట్టంకట్టాలి. ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. పదేపదే ఎన్నికలు జరపడంవల్ల అభివృద్ధి కుంటువడుతోందని అనుకుంటే- ప్రతిపక్షాలతో సంప్రతింపులు నిర్వహించి ఎన్నికల నియమావళిలో తగిన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. దానికి రాజ్యాంగ సవరణే చేయనక్కర్లేదు. వాస్తవానికి జమిలి ఎన్నికలంటే స్థానిక సంస్థలకు, లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడమని అర్థం. స్థానిక సంస్థల్లో సహజంగానే పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడతారు. మూడు ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలంటే భారీ సంఖ్యలో ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) కావాలి. మరోవైపు, ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బంది అవసరం. ఎన్నికల అక్రమాలను నివారించడానికి పెద్ద సంఖ్యలో భద్రతా దళాలనూ మోహరించాల్సి ఉంటుంది. పైగా వారిని దేశమంతటా పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలి. దేశంలో సుమారు 10లక్షల పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 40శాతం పోలింగ్‌ సామగ్రిని రిజర్వులో పెట్టుకోవాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలను ఏడు దశలుగా నిర్వహించాల్సి రావచ్చు. ఇందుకు భారీగా ఖర్చు అవుతుంది. ఏకకాల ఎన్నికలవల్ల డబ్బు ఆదా అయ్యేదల్లా రాజకీయ పార్టీలకే! అవి ఒకేసారి జమిలి ఎన్నికల్లో ప్రచారానికి ఖర్చు చేస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పూర్వాపరాలను విశ్లేషించిందా లేక ఆదరా బాదరాగా జమిలి ఎన్నికల నిర్వహణకు తొందరపడుతోందా అనేది కీలక ప్రశ్న!


అనుకూల భాష్యం

గతంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి కాబట్టి మళ్ళీ అలానే నిర్వహించాలని, జమిలి ఎన్నికలవల్ల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందంటూ ప్రభుత్వం తనకు అనుకూలమైన భాష్యం చెబుతోంది. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని చెప్పడమూ సహేతుకమైన వాదన కాదు. దేశ విభజన అనంతరం చాలాకాలంపాటు కాంగ్రెస్‌ పార్టీయే పాలించింది. 1951-52 నుంచి 1970 వరకు లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 1970లో లోక్‌సభను అర్ధాంతరంగా రద్దు చేసినప్పటి నుంచి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక వృద్ధికి కృత్రిమ మేధ

‣ జీ20 సర్వత్రా ఆసక్తి!

‣ లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం

‣ విశ్వ కుటుంబంగా ముందడుగు

Posted Date: 15-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం