• facebook
  • whatsapp
  • telegram

Biannual Admissions: ఏడాదికి రెండుసార్లు... విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు

* తొలి విడతగా జులై-ఆగస్టులో అడ్మిషన్లు

దేశీయ విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోవడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మన విశ్వవిద్యాలయాల్లో సైతం ఏడాదిలో రెండుసార్లు ప్రవేశాలు కల్పించనున్నారు. జులై-ఆగస్టులో తొలి విడతగా, జనవరి-ఫిబ్రవరిలో మలి విడతగా ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు జరగనున్నాయి.

ప్రపంచంలో అనేక దేశాలు ఏటా రెండుసార్లు ప్రవేశాలు నిర్వహిస్తున్న దృష్ట్యా మనం కూడా ఆ ప్రక్రియను అనుసరిస్తే అంతర్జాతీయ స్థాయిలో విద్యాప్రమాణాలు పెరిగి విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి సులభతరమయ్యే అవకాశం ఇనుమడిస్తుంది. రాష్ట్రాల పరిధిలోని విద్యా సంబంధ బోర్డులు, కళాశాలలు ఒకే తరహా క్యాలెండర్‌ను అనుసరించలేకపోవడం, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జాప్యం జరుగుతుండటంతో చాలామంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాలలో అడ్డంకులు నెలకొంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా దేశవ్యాప్తంగా ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)’ నిర్వహిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లోని వర్సిటీలకు ఇలా ఒకే తరహా క్యాలెండర్‌ లేదు. ఇలాంటి తేడాల కారణంగా కొంతమంది విద్యార్థులు ప్రవేశాలపరంగా ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తోంది. అటువంటి విద్యార్థులకు మలి విడత ప్రవేశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఉండటంతో ద్వైవార్షిక ప్రవేశాల ప్రక్రియ ఐచ్ఛికం కానున్నది. ద్వైవార్షిక ప్రవేశాలు ప్రాంగణ నియామకాలకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కంపెనీలకు ఉద్యోగుల అవసరం దృష్ట్యా విద్యాలయాల్లో ఏడాదికి రెండుసార్లు నియామకాలు చేపట్టవచ్చు. మొదటిసారి నియామకాలలో అర్హత సాధించలేని విద్యార్థులకు రెండోసారి అవకాశం లభిస్తుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా భారతీయ విద్యార్థులకు ద్వైవార్షిక ప్రవేశాల రూపేణా ఉన్నత విద్య చదవడానికి, ఉద్యోగ నియామకాలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. మన దేశ విశ్వవిద్యాయాలలో క్రమేపీ విదేశీ విద్యార్థుల సంఖ్య మరింతగా పెరగడానికి అవకాశం ఉంది.

ద్వైవార్షిక ప్రవేశాలు పెద్ద సవాలే

అయితే, ఏడాదిలో ఒకసారి ప్రవేశ పరీక్షలు జరిపి ప్రవేశాలు కల్పించడానికే ఆపసోపాలు పడుతున్న కొన్ని రాష్ట్రాలు, వర్సిటీలకు ద్వైవార్షిక ప్రవేశాలు పెద్ద సవాలే. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఒకే సమయంలో జరగడం లేదు. సంప్రదాయంగా, సాంకేతికంగా విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలల్లో విద్యా సంవత్సరం జూన్‌-జులైలో ప్రారంభమైనా కొన్ని కోర్సులకు అక్టోబర్, నవంబర్‌ వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ జాప్యానికి కొవిడ్‌ కొంత కారణమైతే తదుపరి సంవత్సరాల్లో విద్యాలయాల తీరు మరొక కారణం. రాష్ట్ర ఉన్నత విద్యామండళ్లు వర్సిటీల స్వయంప్రతిపత్తిపై మితిమీరిన జోక్యం చేసుకోవడంతో విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం కలుగుతోందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. మన దేశంలోని వర్సిటీల్లో దాదాపు సగం అధ్యాపకుల పోస్టులు భర్తీ కాకుండా మిగిలి ఉన్నాయి. చాలా వర్సిటీలు మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, డిజిటల్‌ తరగతి గదులను సమకూర్చుకోవడంలో వెనకంజలో ఉన్నాయి. ఇప్పుడు అమలులో ఉన్న సెమిస్టర్‌ విధానంలో ద్వైవార్షిక ప్రవేశాలతో పాఠ్యాంశాల బోధన క్లిష్టంగా మారుతుంది. అధ్యాపకులు, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయ సదుపాయం వంటి వాటిని పెంచాల్సి ఉంటుంది. సాంకేతిక, వృత్తివిద్యలలో ప్రయోగశాలల కొరత, సర్దుబాటు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తే ప్రవేశపరీక్ష ఎన్నిసార్లు నిర్వహించాలి? సీట్లు యథాతథంగా ఉంచాలా, పెంచాలా అనేది మరో సమస్య. వసతి గృహాలు, గ్రంథాలయాల నిర్వహణ సమయాలను సైతం సరిచేయాల్సి ఉంటుంది.

మెరుగైన బోధన, ప్రణాళిక, చిత్తశుద్ధి అవసరం

అరకొరగా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలతో విద్యాపరమైన లక్ష్యాల్ని అందుకోవడం కష్టం. ద్వైవార్షిక ప్రవేశాలను అనుసరించే ముందు ఆయా దేశాలు స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యకు చేస్తోన్న కేటాయింపుల్ని పరిశీలించాలి. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, నార్వేలాంటి దేశాలు జీడీపీలో ఆరుశాతానికి పైగా విద్యపై ఖర్చు చేస్తున్నాయి. మనదేశంలో మూడు శాతమైనా దాటడం లేదు. ఒక విద్యాప్రణాళిక ఆ దేశ విద్యార్థుల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, విద్యకు బడ్జెట్లో కేటాయింపులపై ఆధారపడి ఉంటుంది. నిధుల లేమి, అధ్యాపకులు, సౌకర్యాల కొరతతో విద్యా లక్ష్యాల్ని సాధించలేమని ప్రభుత్వాలు గుర్తించాలి. విద్యాలయాలు ఉన్నంతలో మెరుగైన బోధన, ప్రణాళిక, చిత్తశుద్ధితో ముందుకెళ్ళి ద్వైవార్షిక ప్రవేశాలను స్వాగతించి విద్యార్థులకు మేలు చేయడంలో చొరవచూపిస్తే కొంతలో కొంత ఉపయోగం ఉంటుంది.

- ప్రొఫెసర్‌ గుజ్జు చెన్నారెడ్డి (నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.