• facebook
  • whatsapp
  • telegram

  Gayatri: ఆ ఒక్క సీటు... నాదే!


 



చిన్నతనం నుంచీ డాక్టరవ్వాలన్న తన కల నిజం చేసుకున్నారు. కానీ మహిళలు ఎదుర్కొంటున్న పీసీఓడీ... సంతానలేమి వంటి సమస్యలు వైద్యురాలిగా ఆమెని కలవరపరిచాయి. దాంతో రిప్రొడక్టివ్‌ విభాగంలో పరిశోధనలు చేయాలనుకున్నారామె. ఆ లక్ష్యంతోనే డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి ప్రవేశపరీక్ష రాసి జాతీయస్థాయిలో నంబర్‌.1 ర్యాంకులో నిలిచారు విజయనగరానికి చెందిన డాక్టర్‌ గుణుపూరు గాయత్రీ శ్వేత. ఈ సందర్భంగా ఈనాడు వసుంధరతో మాట్లాడారామె...  


ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ అయ్యాక దిల్లీ ఎయిమ్స్‌లో పీజీ చేయడానికి వెళ్లా! ఒక గర్భిణి కేసు వచ్చింది... ఆమెకి ఐదోనెల అప్పుడు. అప్పటికే ఎనిమిది గర్భస్రావాలయ్యాయి. కారణం.. ఆమె బ్లడ్‌గ్రూప్‌ నెగెటివ్‌. బేబీ బ్లడ్‌గ్రూప్‌ పాజిటివ్‌. ఇలా ఉన్నప్పుడు తల్లుల్లో కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈమెకీ అదే ఇబ్బంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే రేర్‌ యాంటీజెన్‌ని సేకరించి ఇవ్వాలి. ప్రపంచంలో ఇద్దరి దగ్గర మాత్రమే ఆ యాంటీజెన్‌లు ఉన్నాయి. ఒకరు ఇవ్వలేని పరిస్థితి. మరొకరు జపాన్‌లో ఉన్నారు. ఎయిమ్స్‌ దిల్లీ ఆధ్వర్యంలో అక్కడి నుంచి రక్తం తెప్పించి ఆమెకి ఎక్కించి... సుఖ ప్రసవం చేశాం. ఆ విజయం మా డాక్టర్లందరిలో ఓ స్ఫూర్తిని రగిలించింది. మా వృత్తిలో సవాళ్ల గురించి చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్పాను. విధుల్లో క్షణం తీరికలేకపోయినా డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి ప్రవేశ పరీక్ష రాయడానికీ ఇలాంటి సంఘటనలే నాకు స్ఫూర్తి.


 మాది మన్యం జిల్లాలోని కృష్ణరాయపురం. ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాం. అమ్మ రమణమ్మ న్యాయవాది. నాన్న సత్యంనాయుడు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డీఈఈగా పనిచేస్తున్నారు. అక్క డాక్టర్‌ సాయి సౌమ్య ఎండీ రేడియాలజీ పూర్తి చేసింది. చిన్నతనం నుంచీ నాకూ డాక్టరవ్వాలని ఉండేది. కుటుంబ ప్రోత్సాహం కూడా ఉండటంతో నా కల వేగంగానే నిజమైంది. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ అయ్యాక, ఎయిమ్స్‌ న్యూదిల్లీలో ఎండీ గైనకాలజీ చేసి, విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచాను. ఎంబీబీఎస్‌లో 15 బంగారు పతకాలు సాధించా. 19 సబ్జెక్టుల్లో మెరిట్‌ అందుకోవడంతో పాటు కోర్సు టాపర్‌గా నిలిచాను. ప్రస్తుతం కేజీహెచ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేస్తున్నా.


క్షణం తీరిక ఉండదు...

గైనకాలజీ చదివేటప్పుడు ఉదయం ఆరున్నర గంటలకు వెళ్తే.. రాత్రి తొమ్మిది గంటల వరకు విధుల్లో ఉండేదాన్ని. ఒక్కోసారి భోజనం ఉండేది కాదు. అలాంటప్పుడు ఈ పనిని ఎందుకు ఎంచుకున్నానా అనిపించి.. మానేద్దామనిపించేది. కానీ ఎన్నో అనారోగ్య సమస్యలతో మా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం పోసుకోవడానికి వస్తారు. వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు తల్లీ, బిడ్డా క్షేమంగా ఇంటికి చేరాలి అనుకుంటాం. అలా వెళ్లిన వాళ్లు... డాక్టరమ్మని దేవతలా చూస్తారు. ‘అమ్మా మా పాపకి మీ పేరే పెట్టుకున్నాం’ అంటారు. వాళ్ల ఫొటోలు పంపిస్తుంటారు. అలా ఈ వృత్తిలో చాలా సంతృప్తి ఉంటుంది. అలాగే కొన్ని ఆలోచించే విషయాలూ ఉంటాయి. ఆడవాళ్లలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి కారణంగా పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్, సంతాన సమస్యలు పెరగడం గమనించాను. అందుకే ఐవీఎఫ్‌ స్పెషలైజేషన్‌తో డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో చేరాలనుకున్నా. కాకపోతే దీనిలో ఒకే ఒక్క సీటుంది. ఇలాంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో సీటు కోసం ఎయిమ్స్‌ నుంచే పోటీ ఎక్కువ ఉంటుంది. వేలల్లో రాస్తారు. విధులకు హాజరవుతూనే, పరీక్షకు సిద్ధమయ్యా. తొలి ప్రయత్నంలోనే సీటు వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్సు మూడేళ్లపాటు చదవాలి. పేద, సామాన్య కుటుంబాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా కల.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.