• facebook
  • whatsapp
  • telegram

Group -1 Mains: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌  

* తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌  మాధ్యమాల్లో పరీక్ష 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయంది. పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏ పరిధి)లోనే ఉంటాయంది. ప్రతి పేపర్‌ కాలపరిమితి మూడు గంటలని, పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ షెడ్యూలును జారీ చేశారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయని వివరించారు. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపరు పదోతరగతి స్థాయిలో ఉంటుందని, ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకుల నిర్ధరణలో పరిగణనలోకి తీసుకోబోమన్నారు. పరీక్షల పూర్తిస్థాయి సిలబస్‌ కోసం 2024 ఫిబ్రవరి 19న జారీ చేసిన గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన పరిశీలించాలని సూచించారు. 

మూడు భాషల్లో పరీక్షలు..

ప్రధాన పరీక్షలన్నీ డిస్క్రిప్టివ్‌ విధానంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష సమాధానాలు ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఒకసారి మాధ్యమాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆరు పేపర్ల సమాధానాలన్నీ అదే భాషలోనే రాయాలి. ఒక పేపరును ఒక భాషలో, మరో పేపరును మరో భాషలో రాయడానికి వీల్లేదు. అలాగే ఒకే పేపర్‌లో కొన్ని సమాధానాలను ఇంగ్లిష్‌లో, మరికొన్నింటిని తెలుగు/ఉర్దూలో రాసినా... అనర్హులవుతారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు అన్ని పేపర్ల పరీక్షలు రాయాలి. దేనికైనా గైర్హాజరైతే అనర్హులు అవుతారు. 

ఇదీ ప్రధాన పరీక్షల విధానం 

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష 2023 జనవరి 18న నిపుణుల కమిటీ ఖరారు చేసిన విధానం ప్రకారం జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. సంబంధిత విధానాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున ఆరు పేపర్లకు కలిపి మొత్తం 900 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది.

ఇవీ వివరాలు... 

జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హత పరీక్ష): ఇందులో మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. మార్కులు 150. పదోతరగతి స్థాయిలో ఆంగ్లభాష పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. 

పేపర్‌-1 జనరల్‌ ఎస్సే: ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మూడింటికి కలిపి 150 మార్కులు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతిప్రశ్నకు సమాధానం వెయ్యి పదాల్లో ఉండాలి. 

పేపర్‌-2: చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ 

పేపర్‌-3: భారతీయ సమాజం, రాజ్యాంగం,   పరిపాలన 

పేపర్‌-4: ఎకానమీ, డెవలప్‌మెంట్‌

పేపర్‌-2, 3, 4లలో మూడేసి సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మూడింటికి కలిపి 150 మార్కులు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లోని ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు పది మార్కుల చొప్పున ఉంటాయి. అయితే ప్రతి సెక్షన్‌లోని ఐదు ప్రశ్నల్లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానాలు రాయాలి. ఎలాంటి ఛాయిస్‌ ఉండదు. మూడు, నాలుగు, ఐదు ప్రశ్నల్లో ఉంటుంది. 

పేపర్‌-5 (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌): ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో ఐదు ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ సెక్షన్లలో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి జవాబు రాయాలి. మిగతా మూడింటికి ఛాయిస్‌ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు 200 పదాల్లో ఇవ్వాలి. ఇక మూడో సెక్షన్‌లో 30 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏవేని 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి. ఒకవేళ 25 కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలిస్తే తొలి 25 ప్రశ్నలనే ప్రామాణికంగా తీసుకుని మూల్యాంకనం చేస్తారు. అదనంగా జవాబులు రాసిన ప్రశ్నలను మూల్యాంకానికి తీసుకోరు. 

పేపర్‌-6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు 

ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు పది మార్కుల చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరి సమాధానాన్ని రాయాలి. ఎలాంటి ఛాయిస్‌ ఇవ్వలేదు. మిగతా మూడు, నాలుగు, ఐదు ప్రశ్నలకు ఉంటుంది. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.