• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌-యూజీ ప్రవేశాలను నిలిపివేయం  

* పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు

* ప్రవేశ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్య

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ)పై ఉందని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్‌టీఏలను ఆదేశించింది. అయితే, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపుదల (స్టే) చేసేందుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జులై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్‌ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆలోగా ఎన్‌టీఏ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. నీట్‌-యూజీ (2024) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివంగి మిశ్ర, మరో 9 మంది నీట్‌ అభ్యర్థుల పిటిషన్లను కూడా ఈ కేసుతో జత చేసింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విద్యార్థుల తరఫు న్యాయవాది అభ్యర్థననను ధర్మాసనం తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌ను కొనసాగనివ్వాలని సెలవుకాల ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కూడా మే 17న నీట్‌-యూజీ(2024) ఫలితాల వెల్లడిపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనపై నోటీసు జారీ చేసేందుకు అంగీకరించింది. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్‌ యూజీ-2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

నీట్‌-పీజీ 2022పై పిటిషన్‌ కొట్టివేత

పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను 2022లో నిర్వహించిన నీట్‌-పీజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్‌ 11న కొట్టివేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.