• facebook
  • whatsapp
  • telegram

NEET : దర్యాప్తు ముమ్మరం!

* నీట్‌ (యూజీ) అవకతవకలపై బిహార్, గుజరాత్‌లకు సీబీఐ బృందాలు

దిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ (యూజీ)లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. జూన్‌ 23న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నీట్‌లో అక్రమాలపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ జరపనుంది. అలాగే బిహార్‌లో పేపర్‌ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా దర్యాప్తు చేయనుంది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంది. మరోవైపు నీట్‌ అక్రమాలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు విచారించారు. నీట్‌ యూజీ మే నెల 5వ తేదీన దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే బిహార్‌లో పేపరు లీక్‌ కావడంతోపాటు పలుచోట్ల అవకతవకలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో జూన్‌ 22న సీబీఐ విచారణకు కేంద్ర విద్యాశాఖ సిఫార్సు చేసింది. దీంతో ఆదివారం ఐపీసీలోని 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులనూ ఈ కేసు పరిధిలోకి తీసుకురానుంది. కేసు నమోదు చేసిన వెంటనే బిహార్‌లోని పట్నాకు, గుజరాత్‌లోని గోద్రాకు ప్రత్యేక బృందాలను సీబీఐ పంపింది. 

* కేంద్ర విద్యాశాఖకు బిహార్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం జూన్‌ 22న నివేదికను సమర్పించింది. 

* ఎన్‌టీఏపై కేంద్రం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ జూన్‌ 24న తొలిసారిగా భేటీ కానుంది. 

*  దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు జూన్‌ 23న గుజరాత్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

* నీట్‌ (యూజీ)లో అక్రమాలకు సంబంధించి జూన్‌ 22న ఝార్ఖండ్‌లో అరెస్టు చేసిన ఐదుగురిని జూన్‌ 23న బిహార్‌కు తీసుకొచ్చారు. దీంతో మొత్తం అరెస్టులు 18కి చేరుకున్నాయి.  

ముందురోజే పీడీఎఫ్‌

ఝార్ఖండ్‌లో అరెస్టు చేసిన నిందితుల్లో బలదేవ్‌ కుమార్‌.. సంజీవ్‌ కుమార్‌ అలియాస్‌ లూటన్‌ ముఖియా గ్యాంగ్‌తో కుమ్మక్కయ్యాడు. నీట్‌ (యూజీ) సమాధాన పత్రం బలదేవ్‌ ఫోన్‌కు పీడీఎఫ్‌ రూపంలో ముందు రోజే వచ్చింది. దీనిని ప్రింట్లు తీసిన బలదేవ్‌ గ్యాంగ్‌ పట్నాలోని రామకృష్ణా నగర్‌లో రహస్యంగా ఉంచిన విద్యార్థులకు 4వ తేదీనే పంపిణీ చేశారు. 

* నీట్‌ (యూజీ) ప్రశ్నపత్రాన్ని ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల నుంచి ముఖియా ముఠా సంపాదించింది.

* కాల్చేసిన పత్రాలను ఎన్‌టీఏ ప్రశ్నపత్రంతో బిహార్‌ దర్యాప్తు బృందం పోల్చి చూసినప్పుడు సరైనవే అని తేలింది. దీంతో పేపరు లీకవడం నిజమేనని నిర్ధారణ అయింది. 

* ప్రశ్నపత్రాల రవాణాలో జరిగిన పొరపాట్లు లీకవడానికి ఒక కారణంగా దర్యాప్తు బృందం తేల్చింది. 

* నిందితుల్లో రాజీవ్‌ కుమార్, పంకు కుమార్, పరంజీత్‌ సింగ్‌లు నకిలీ సిమ్‌లను, వసతిని సమకూర్చారు.

* విద్యార్థులను తరలించిన ట్యాక్సీ డ్రైవరు ముకేశ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

లాతూర్‌లో..

నీట్‌లో అవకతవకలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నాందేడ్‌కు చెందిన ఏటీఎస్‌ విభాగం వారిని జూన్‌ 22న రాత్రి అదుపులోకి తీసుకుందని, కొన్ని గంటలు ప్రశ్నించాక వదిలేసిందని జూన్‌ 23న అధికారులు వెల్లడించారు. వారిలో ఒకరు లాతూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని వారికి పోలీసులు చెప్పారు.

విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పగించారు: ప్రియాంక 

 దేశంలోని విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతిపరుల చేతిలో మోదీ ప్రభుత్వం పెట్టిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. నీట్‌ పీజీ, సీఎస్‌ఐఆర్‌-నెట్‌ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయని, యూజీసీ నెట్‌ రద్దయిందని, నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీకైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ విద్యా వ్యవస్థ, పిల్లల భవిష్యత్తును అత్యాశపరులకు, మతోన్మాద శక్తులకు అప్పజెప్పాలన్న రాజకీయ దురహంకారంవల్ల పేపర్ల లీక్‌లతోపాటు పరీక్షలూ రద్దవుతున్నాయి. రాజకీయ గూండాయిజం మన విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారింది. భాజపా ప్రభుత్వం ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. యువత భవిష్యత్తుకు భాజపా ఏకైక అడ్డంకిగా మారింది. భాజపా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సమర్థులైన యువత తమ సమయాన్ని, శక్తిని కోల్పోతున్నారు. ఈ విషయంలో మోదీ నిస్సహాయంగా ఉంటూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు’ అని ‘ఎక్స్‌’ వేదికగా ప్రియాంక ధ్వజమెత్తారు.

ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ భద్రమే..

దిల్లీ, పట్నా: యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులపై బిహార్‌లో స్థానికులు దాడి చేశారు. నవాడాలోని కశియాదీ గ్రామంలో జూన్‌ 22న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.