• facebook
  • whatsapp
  • telegram

RGUKT Admissions: గ్రామీణ విద్యార్థికి ఆర్జీయూకేటీ ఆహ్వానం

* ఆంధ్ర-తెలంగాణ విద్యార్థులకు సీట్లు

* 1500 మంది విద్యార్థులకు ప్రవేశం
 

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యాలయం ఆహ్వానం పలుకుతోంది. 2024-25 విద్యా సంవత్సరానికి 1500 సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశంగా విద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యార్థులు జూన్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రతి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల నకళ్లను (హార్డ్‌కాపీ) పోస్టులో లేదా నేరుగా 29వ తేదీ వరకు విద్యాలయానికి పంపించాలి. జులై 3వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 10 తేదీలలో పరిశీలిస్తారు. 

ఎంపిక ప్రక్రియ ఇలా..

ఆర్జీయూకేటీలో 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. వచ్చిన దరఖాస్తులను మెరిట్‌ ఆధారంగా వడబోస్తారు. ఈ మేరకు ఆయా పదో తరగతి బోర్డు (ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌ఈ)ల నుంచి నేరుగా విద్యార్థుల మార్కుల జాబితాలను సేకరించి మెరిట్‌ పరిశీలిస్తారు. పదోతరగతిలో సాధించిన మార్కుల జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. జిల్లా, పురపాలక, గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు వెనుకబాటు సూచి విధానం ద్వారా 0.4 జీపీఏను అదనంగా కలుపుతారు. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371-1డి ప్రకారం 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం ఆంధ్ర-తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. 1500 సీట్లకు అదనంగా 7 శాతం (105) సూపర్‌న్యూమెరరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రేతర విద్యార్థులు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ సంతతి విద్యార్థులకు 5 శాతం, ఎన్‌ఆర్‌ఐ, విదేశీ విద్యార్థులకు 2 శాతం కేటాయిస్తారు. మిగతావి గ్లోబల్‌ కోటాలో స్థానికులు ఎవరైనా సీటు పొందొచ్చు.

దరఖాస్తు విధానం

ఆర్జీయూకేటీలో చేరే విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌ ప్రక్రియ (ఏపీటీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌) ద్వారా ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా దరఖాస్తులను నమోదు చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అందులో కోరినట్లు వివరాలు పొందుపరిచి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. అనంతరం ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు పత్రాన్ని ప్రింట్‌ తీసుకుని, దానికి జతచేసిన ధ్రువపత్రాల నకళ్లను ఆర్జీయూకేటీకి తపాలా ద్వారా పంపొచ్చు. లేదా నేరుగా కూడా అందించవచ్చు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి.

బోధన రుసుముల వివరాలు

ఎంపికైన విద్యార్థులు ఏటా రూ.30 వేలు విద్యాలయానికి చెల్లించాలి. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే బోధన రుసుం విద్యాలయానికి చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్‌ రుసుము కింద జనరల్, బీసీ విద్యార్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాషన్‌ డిపాజిట్‌ కింద ప్రతి విద్యార్థి రూ.2000 చెల్లించాలి. దీన్ని విద్యార్థి విద్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు తిరిగి అందజేస్తారు. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు ఏటా రూ.3,01,000, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏటా రూ.1.36 లక్షలను బోధన రుసుముగా చెల్లించాలి. గ్లోబల్‌ కోటాలో ఏటా రూ.1.36 లక్షలు చెల్లించి స్థానికులు ఎవరైనా సీటు పొందొచ్చు.

విద్యా విధానం

ఆరేళ్ల సమీకృత విద్యావిధానం ఆధారంగా ఆర్జీయూకేటీలో బోధన సాగుతుంది. మొదట రెండేళ్ల ఇంటర్‌ తత్సమాన కోర్సు పీయూసీ ఉంటుంది. రెండేళ్ల పీయూసీ విద్య అభ్యసించిన అనంతరం ఎవరికైనా మెరుగైన విద్యావకాశాలు వస్తే ఆర్జీయూకేటీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు సెమిస్టర్‌ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్జీయూకేటీ బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులను అందిస్తోంది. పీయూసీ అనంతరం విద్యార్థి తన గ్రూపును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు పీయూసీలో సాధించిన మార్కులు ఆధారంగా తీసుకుంటారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.