జూన్ 3 నుంచి 19 వరకు కార్యాచరణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు, ప్రజలు, గ్రామైక్య సంఘాల సహకారంతో కార్యాచరణ పూర్తి చేయాలని మార్గదర్శకాలు తయారు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన సహా పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
జూన్ తొలివారంలో బడిబాట కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కార్యక్రమం విజయవంతానికి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఎంపీడీవో, ఎంఈవో, గ్రామైక్య సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం జూన్ 3 నుంచి 19 వరకు ఏయే కార్యక్రమాలు చేపట్టాలో సూచించారు. జగిత్యాల జిల్లాలో 788 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో బడిఈడు, బడి మానేసిన పిల్లలను చేర్పించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
అందరి భాగస్వామ్యంతోనే..
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు రోజు వరకు అంటే జూన్ 3 నుంచి 11 వరకు గ్రామస్థాయి కమిటీలు, మహిళా సంఘాల సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సహకారంతో రోజువారీ కార్యక్రమానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జూన్ 3న గ్రామ సమాఖ్య సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించాలి. 4న ఇంటింటి సర్వే చేపట్టి గ్రామ విద్యాశాఖ రిజిస్టర్లో పిల్లల వివరాలు నమోదు చేయాలి 5 నుంచి 10 వరకు ప్రచార బోర్డులతో ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తారు. బడిఈడు, బడి మానేసిన పిల్లలను చేర్పించడం లాంటి వాటిపై అవగాహన కల్పించాలి. 11న గ్రామసభ నిర్వహించి బడిబాట నిర్వహించిన తీరుపై చర్చించాలి. 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా చిన్నారులకు స్వాగతం తెలపాలి. 13 నుంచి 18 వరకు చదువుకోలేని వారిని గుర్తించి ప్రవేశం కల్పించాలి. 19న స్పోర్ట్స్ డే నిర్వహించాలి.
విజయవంతానికి ప్రణాళిక
- జగన్ మోహన్ రెడ్డి, డీఈవో, జగిత్యాల
కలెక్టర్ పర్యవేక్షణలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. జూన్ 1న మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి 3 నుంచి కార్యాచరణ కొనసాగుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన సహా అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో మరమ్మతులు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరి సహకారంతో బడిబాట విజయవంతమయ్యేందుకు కృషి చేస్తాం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.