• facebook
  • whatsapp
  • telegram

Startups: ఉద్యోగార్థులూ.. మేమున్నాం

* ఆకర్షిస్తోన్న అంకురాలు  

* ‘ఫ్రెషర్స్‌’కు పెరుగుతున్న అవకాశాలు

 


 

ఒకవైపు అంతర్జాతీయ సంస్థలు, టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు అంకురాలు కొత్త వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఐటీ సేవల రంగాల్లోని స్టార్టప్‌లు ‘ఫ్రెషర్స్‌’కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, ఫుల్‌స్టాక్‌ డెవలపర్స్‌లాంటి నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. రెండుమూడేళ్ల అనుభవం ఉన్న వారిని పెద్ద సంస్థలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ, కొత్తగా ఈ నైపుణ్యాలను సాధించిన వారిని నియమించుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి కొత్త వారికి అవకాశం ఇస్తూ అంకురాలు బలాన్ని పెంచుకుంటున్నాయి.


53 శాతానికి పైగానే..

అంకురాల్లో ఉద్యోగ నియామకాలపై తాజాగా ఫౌండిట్‌ నిర్వహించిన సర్వేను గమనిస్తే.. గత ఏడాదిగా అంకురాల సంఖ్యలో 37 శాతం పెరుగుదల కనిపిస్తోంది. దీని ఫలితంగా ఉద్యోగాల నియామకాలూ 14 శాతం పెరిగాయి. అన్ని అంకురాల్లోనూ తాజా గ్రాడ్యుయేట్ల నియామకాలు 53 శాతానికి పైగానే ఉండటం గమనార్హం. ఏప్రిల్‌లో ఉద్యోగాల నియామకాల్లో 23 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం సంవత్సరానికి 9 శాతం పెరుగుదల కనిపిస్తోంది.


 ఐటీ సేవల్లోనే అధికంగా..

నివేదిక ప్రకారం చూస్తే.. ఐటీ సేవల రంగంలో ఏప్రిల్‌ నెలలో 23 శాతం వరకూ నియామకాలున్నాయి. 2023 ఏప్రిల్‌లో 20 శాతంగా ఉన్నాయి. ఇంటర్నెట్‌ అంకురాల్లో 9 శాతం, ఆర్థిక సేవల సంస్థల్లో 10 శాతం, ఎడ్యుటెక్, ఇ-లెర్నింగ్‌ అంకురాల్లో 8 శాతం, మీడియా, వినోదం రంగాల్లో 6 శాతం చొప్పున అంకురాలు ఉద్యోగులను నియమించుకున్నాయి.


మొదటి స్థానంలో బెంగళూరు 

అంకురాల్లో నియామకాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలుస్తోంది. మొత్తం ఉద్యోగాల్లో అంకురాల్లో చేరిన వారి సంఖ్య దాదాపు 31 శాతం వరకూ ఉంది. దేశ రాజధాని దిల్లీలో 23 శాతం, ముంబయిలో 19 శాతం, పుణేలో 9 శాతం, చెన్నైలో 5 శాతం, హైదరాబాద్‌లో 3 శాతం నియమాకాలు అంకురాల్లో ఉన్నాయి. ఇక రిమోట్‌ పని విధానంలో చేరిన వారూ 3 శాతం వరకూ ఉన్నారు. 


తక్కువ వేతనాలతో..

ఐటీ, ఇతర రంగాల్లో కాస్త అనుభవం ఉన్న నిపుణులకు కనీసం వార్షిక వేతన ప్యాకేజీ రూ.15లక్షల వరకూ ఇవ్వాల్సి వస్తుంది. అంకుర సంస్థలు ఇంత భారాన్ని మోయలేవు. కాబట్టి, తాజా గ్రాడ్యుయేట్లను ఇంటర్న్‌లుగానూ, ట్రైనీలుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక అంకుర సంస్థ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. ‘ఫ్రెషర్స్‌’కు రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతన ప్యాకేజీని చాలా సంస్థలు ఇస్తున్నాయి. దీనివల్ల వారికి భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకూ అవకాశం ఉంటుందన్నారు. చదువు పూర్తికాగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం అనేది మంచిదని ఉద్యోగ నియామక సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అందుకు, అనువుగా స్టార్టప్‌లే ఉంటాయని పేర్కొన్నారు. 


ఆర్థిక సేవల రంగాల్లోనూ..

బ్యాంకింగ్, బీమాతోపాటు ఆర్థిక సేవల రంగాల్లోనూ ఇటీవలి కాలంలో తాజా గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం లభిస్తోంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ దేశ వ్యాప్తంగా 455 మందిని క్యాంపస్‌ నుంచే నియమించుకుంది. దీంతోపాటు బీమా సేవలను అందించే సంస్థలూ కొత్త వారిని మార్కెటింగ్, ఇతర విభాగాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ధోరణి మరికొన్ని రోజులు కొనసాగే అంచనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.