• facebook
  • whatsapp
  • telegram

Telangana: వచ్చే నెల నుంచి గురుకులాలకు కొత్త టీచర్లు  

* మరోసారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్న సొసైటీలు

* తొలుత జీవో నం.317 ప్రకారం కేటాయింపులు

* పదోన్నతుల తర్వాత పోస్టింగులు




ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు వచ్చేనెల నుంచి బోధన ప్రారంభించనున్నారు. గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు(ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్లు మినహా) ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగుల ప్రక్రియ చేపట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఈ నెల 24 నుంచి వచ్చేనెల మొదటి వారంలోపు పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేయనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఏడు జిల్లాల పరిధిలో నిలిచిపోయిన ఫలితాల వివరాలు బోర్డు నుంచి గురుకుల సంక్షేమ సొసైటీలకు చేరాయి.

కొత్తగా నియమితులైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ముందుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జీవో నం.317 ప్రకారం తుది కేటాయింపులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయనున్నాయి. అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత సొసైటీలు ప్రకటించాయి. కేటాయింపులు పూర్తయిన వారికి ఈ నెల 23న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ప్రకటించింది. ఆయా జోన్లు, మల్టీజోన్లలో ఖాళీల మేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ నెల 25న పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది. టీజీటీ నుంచి పీజీటీ, పీజీటీ నుంచి జేఎల్, జేఎల్‌ నుంచి ప్రిన్సిపల్‌ గ్రేడ్‌-2 పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలను ఇప్పటికే రూపొందించాయి. వాటిపై అభ్యంతరాలు తీసుకుని జులై మొదటి వారంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. అనంతరం పదోన్నతులు పొందిన వారికి పోస్టింగు ఇస్తాయి. ఈ ప్రక్రియ మొదటి వారానికి పూర్తిచేసి కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వనున్నాయి. 

వెబ్‌ కౌన్సెలింగ్‌తో కొత్తవారికి పోస్టింగులు..

అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ఆప్షన్ల ఆధారంగా సొసైటీలు ఇచ్చిన ఎంపిక జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని పంపించాయి. ఈ నెల 24 నుంచి వచ్చేనెల తొలివారం వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సొసైటీ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మరోసారి పరిశీలిస్తారు. అనర్హులుగా తేలినవారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. అనంతరం కొత్తగా నియమితులైన వారికి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జులై మొదటి వారం లేదా పదో తేదీ నాటికి పోస్టింగులు ఇచ్చి నియామక ప్రక్రియను పూర్తిచేస్తారు. బీసీ గురుకుల సొసైటీలో అత్యధికంగా దాదాపు 5 వేల వరకు పోస్టులున్నాయి. ఎస్సీ సొసైటీకి 1,375 మంది ఎంపికయ్యారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.