విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Union Budget:  నైపుణ్యాలపై కోటి ఆశలు!

* టాప్‌ 500 పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

* నెలకు రూ.5 వేల చొప్పున చెల్లింపు
 


ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు సాధించే దిశగా.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు కల్పించడంపై తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం ఊరట కానుంది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా కోటి మంది విద్యార్థులకు టాప్‌ 500 పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. అంటే ఏటా 20 లక్షల మందికి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌ కూడా చెల్లిస్తామని తెలిపింది. వృత్తి విద్యాకోర్సులైన ఇంజినీరింగ్, ఫార్మసీ తదితరాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్దఎత్తున ప్రవేశాలు పొందుతున్నారు. వీరందరికీ ఇంటర్న్‌షిప్‌ వల్ల అధిక ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు.


ఇంతవరకు ఐటీ కంపెనీల్లోనే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ముఖ్యమైన వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులు కొంతమందే ఇంటర్న్‌షిప్‌ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలే ప్రాంగణాలకు వచ్చి బీటెక్‌ రెండు, మూడో సంవత్సరాల్లో ఉండగానే ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. అనేక కంపెనీలు సొంతంగా 3-6 నెలల కాలానికి స్టైపెండ్‌ చెల్లిస్తున్నాయి. మిగిలిన రంగాల్లోని పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ కావాలంటే స్వయంగా విద్యార్థులు వెళ్లి ప్రయత్నించుకోవాల్సిన పరిస్థితి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేస్తూ 2018 నవంబరులోనే మార్గదర్శకాలను విడుదల చేసినా.. అమలు అంతంతమాత్రంగానే ఉంది. 


కేంద్ర నిర్ణయంతో ఊరట..

ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కోసం అడుగుతూ ఉంటారు. తెలిసిన మేరకు సహాయం చేస్తుంటాం. ఇప్పుడు కేంద్ర నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసేందుకు ఎటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తారో చూడాలి’’ అని జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘దేశవ్యాప్తంగా 50 శాతం మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లోనే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని ఏటా ఏఐసీటీఈ, వీబాక్స్‌ సంయుక్తంగా విడుదల చేసే నివేదిక చెబుతోంది. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు పెరిగితే విద్యార్థులు కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతార’ని ఆయన తెలిపారు.
 

----------------------------------------------------


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Updated at : 24-07-2024 12:45:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం