• facebook
  • whatsapp
  • telegram

Universities: వర్సిటీల ప్రక్షాళన

* ప్రభుత్వం ముందున్న తక్షణ సవాల్‌
* ఉన్నత విద్యను గాలికొదిలేసి వైకాపా భజన చేసిన వీసీలు
* నియామకాల్లేక పాఠాలు చెప్పేవారు కరవు
* ట్రిపుల్‌ఐటీలకు ఐదేళ్లుగా రెగ్యులర్‌ వీసీనే లేరు
* సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ

ఈనాడు-అమరావతి : వైకాపా ఐదేళ్ల పాలనలో భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను దారిలోకి తేవడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ఒకటి. ఒకప్పుడు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో సీటు కోసం భారీ పోటీ ఉండేది. ఇప్పుడు సీటిస్తామన్నా చేరేవారు లేని దుస్థితికి వర్సిటీలు రావడానికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వ వైఖరే. తమ పార్టీతో అంటకాగినవారిని, పార్టీ సానుభూతిపరులను ఉపకులపతులుగా నియమించి వాటిని రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు. పోస్టుల భర్తీ కోసమంటూ ఇష్టారాజ్యంగా చేసిన హేతుబద్ధీకరణతో చాలా కోర్సులు మూతపడ్డాయి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రారంభించకుండా.. ఉన్నవాటిని మార్చకుండా వర్సిటీలను దెబ్బతీశారు. నిధులివ్వకుండా వాటి నుంచే రూ.150 కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించారు. ఈ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వర్సిటీలకు విముక్తి కలిగించి, పూర్వవైభవం తేవడానికి కొత్త ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంది.

చదువును గాలికొదిలి..

రెండుసార్లు ఉపకులపతిగా నియమితులైన ప్రసాదరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు అడ్డాగా మార్చేశారు. 2021లో జీవీఎంసీ ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రసాదరెడ్డి విద్యార్థులతో సర్వే చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఏటా వర్సిటీలో జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల పుట్టినరోజులు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు, చివరికి వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించడం ఆయన గులాంగిరీకి పరాకాష్ఠ. మొదటిసారి వీసీ పదవీకాలం పూర్తయ్యే ముందు వర్సిటీలో వైఎస్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఓ హోటల్‌లో ఉత్తరాంధ్రలోని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి, వైకాపా అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. 

* కాకినాడ జేఎన్‌టీయూ వీసీ ప్రసాదరాజు ఎన్నికల కోడ్‌కు ముందు వర్సిటీలో వైకాపా కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. జనవరి 30న ‘జగనన్న కాలేజ్‌ కెప్టెన్స్‌’ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో జగన్‌కు జై కొట్టించారు. వైకాపా ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను పంచిపెట్టారు. 

* నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్‌ మూడు రాజధానులకు మద్దతుగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. వీసీగా బాధ్యతల స్వీకరించేవేళ జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వైకాపా ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. ఇందుకోసం వర్సిటీకి సెలవులు ప్రకటించడంతోపాటు పరీక్షలను వాయిదా వేశారు. వైకాపా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను వర్సిటీలో నిర్వహించారు.

* విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి.. జగన్‌కు సమీప బంధువు. పరిపాలన భవనానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు, ఆ భవనంలో ఆయన విగ్రహం పెట్టడం ఆమె స్వామిభక్తికి నిదర్శనం. వైకాపా హయాంలో దాదాపు అన్ని వర్సిటీల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. 

* కుప్పంలోని ద్రవిడ వర్సిటీలో వైకాపా నేతల కనుసన్నల్లో కొందరు గ్రానైట్‌ అక్రమ మైనింగ్‌ చేశారు.  

* రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)కి ఐదేళ్లుగా వీసీనే నియమించలేదు. రెండున్నరేళ్లు పని చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

* రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్తగా ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణలో ఉన్న వర్సిటీ ఏపీలో దూరవిద్య నిర్వహించకూడదు. 

అర్హత లేకపోయినా వీసీ

వీసీగా ఎంపికయ్యే వారికి పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. ఐదేళ్ల అనుభవమే ఉన్నప్పటికీ శ్రీకాంత్‌రెడ్డిని అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సుతో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా నియమించారు. దీనిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కీలకపాత్ర పోషించారు. గతంలో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా పని చేసిన రామకృష్ణారెడ్డిని సైతం అర్హత లేకపోయినా నియమించారు.

అన్నీ ఖాళీలే..

విశ్వవిద్యాలయాల్లో కొన్నేళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. చాలా విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేక కాంట్రాక్టు వారితోనే నెట్టుకొస్తున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 3,480 మంజూరు పోస్టులుంటే పనిచేస్తున్నవారు 845 మంది మాత్రమే. వైకాపా ప్రభుత్వంలో ఖాళీల భర్తీ అంటూ హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 200, శ్రీవేంకటేశ్వరలో 150 పోస్టులను రద్దు చేసేశారు. రిజర్వేషన్ల రోస్టర్‌ విధానాన్ని సక్రమంగా పాటించకపోవడంతో న్యాయవివాదాలేర్పడి నియామకాలు నిలిచిపోయాయి.

జాతీయ ర్యాంకుల్లోనూ దిగదుడుపే 

కేంద్ర ఉన్నత విద్యాశాఖ గతేడాది విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌- 2023లో రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఓవరాల్‌ మొదటి వంద ర్యాంకుల్లో 2019లో ఆంధ్ర వర్సిటీకి 29వ ర్యాంకు లభించగా.. 2023 నాటికి 76వ ర్యాంకుకు పడిపోయింది. శ్రీవేంకటేశ్వర వర్సిటీ 72వ ర్యాంకు నుంచి 100- 150 ర్యాంకుల్లోకి పడిపోయింది. కాకినాడ జేఎన్‌టీయూదీ ఇదే పరిస్థితి. వర్సిటీల విభాగంలో ఏయూ 2019లో 16వ స్థానంలో ఉంటే గతేడాది 43, శ్రీవేంకటేశ్వరకు 48వ ర్యాంకు ఉంటే 60కి పడిపోయాయి. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల (94వ ర్యాంకు) తప్ప ఏ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల కూడా వందలోపు ర్యాంకుల్లో లేనేలేదు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.