• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దు!

స్పష్టం చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) నిర్వహించాల్సిందేనంటూ ఏపీపీఎస్సీ సభ్యులు, కార్యదర్శి గట్టిగా పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరించలేదు. మౌఖిక పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించాలని స్పష్టంచేసింది. అయితే... ఏ విధానం మంచిది? ఏ విధానంలో సరైన అభ్యర్థులు ఎంపికవుతున్నారో అధ్యయనం చేయాలని సూచించింది. ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఏపీపీఎస్సీ సభ్యులు మాత్రం... ‘‘ఉద్యోగాలను భర్తీ చేయాలంటే అభ్యర్థులను మేం ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేసి అభ్యర్థుల తెలివి తేటలను, వారి మానసిక సామర్థ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయాల్సిందే’’ అంటూ ప్రతిపాదించడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ సభ్యుల్లో సింహభాగం అధికార పార్టీ నేపథ్యంతో సభ్యులైన వారే కావడం గమనార్హం. అలాంటి సభ్యులు కొందరు కలిసి ఉద్యోగాలు ఇవ్వాలంటే మేం ఇంటర్వ్యూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని 2021 జూన్‌ 26న సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కొన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగాయి. తాజాగా ఈ నెల 21న ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాసి ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించాలని బోర్డు సభ్యులతోపాటు కొందరు పౌరులు విన్నవించారని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి స్పందనగా సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మార్చి 28న ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. అందులో ‘‘ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలంపాటు ఇంటర్వ్యూలు వద్దు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో నియమితులయ్యే వారి కోసం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల పద్ధతులను పరిశీలించిన తర్వాతే రద్దు ఉత్తర్వులిచ్చాం. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో పక్షపాత ధోరణి లేకుండా చూడటం పెద్ద సవాల్‌గా ఉండటం, బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రించలేకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాకే ఇంటర్వ్యూలు ఉండకూదని నిర్ణయించింది’ అని పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎపీపీఎస్సీ సభ్యుల నియామకాలు

రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం పదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వారు సగం మంది సభ్యులుగా ఉండాలి. మిగిలిన స్థానాల్లో ప్రజా బాహుళ్యంతో సంబంధమున్న వారిని నియమించాలి. ప్రస్తుత సభ్యుల నేపథ్యాన్ని పరిశీలిస్తే నిబంధనల అనుసరించిన దాఖలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ప్రస్తుత ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఐపీఎస్‌ అధికారి. డీజీపీ హోదాలో ఉంటూ ఏపీపీఎస్సీకి నియమితులయ్యారు. మరో సభ్యుడు విజయకుమార్‌ ప్రభుత్వ సర్వీసులో పనిచేశారు. పద్మరాజు కాకినాడ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఏపీపీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. మిగిలిన సభ్యులు వైకాపాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే.  

ఇవీ వారి వివరాలు...

 డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డి: అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయులు. ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేశారు. వైకాపాలో కీలకంగా ఉన్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు.

 ఎస్‌.సలాంబాబు: కడప నగరం. వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు.

 నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి: కడప జిల్లా వీరపునాయినపల్లి మండలం పాయసంపల్లి గ్రామస్థులు. వైకాపా రాష్ట్రకార్యదర్శి. ఈయన  భార్య రాజేశ్వరమ్మ వీరపునాయినపల్లి జడ్పీటీసీ (వైకాపా) సభ్యురాలు. ఈయన మెడికల్‌ షాపు యజమాని.

 పి.సుధీర్‌: కర్నూలు జిల్లావాసి. వైకాపా తరఫున రాజకీయ నేపథ్యం ఉంది.

 ఏవీ రమణారెడ్డి: కర్నూలు జిల్లాకు చెందిన ఈయన విద్యా సంస్థల అధినేత. వైకాపా తరఫున రాజకీయ నేపథ్యం ఉంది.

 సోనీవుడ్‌ నూతలపాటి: తునిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. వైకాపా మద్దతుదారు. ఓ కీలక ఐపీఎస్‌ అధికారికి బంధువు.

మరింత సమాచారం ... మీ కోసం!

ఏపీపీఎస్సీ స్ట‌డీ మెటీరియ‌ల్

ఏపీపీఎస్సీ మోడ‌ల్‌ పేప‌ర్లు

ఏపీపీఎస్సీ ప్రీవియ‌స్ పేప‌ర్లు 

‣ బీఎల్‌డబ్ల్యూ, వారణాసిలో 374 అప్రెంటిస్‌లు

‣ ఇర్కాన్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

‣ ఎన్‌సీసీతో ఆర్మీ అధికారి కొలువు

‣ ఇస్రో-వీఎస్‌ఎస్‌సీలో 297 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

‣ పాఠాలు గుర్తుండాలంటే..!

‣ మే నెలలో టెట్‌!

‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ప్రామాణిక కోర్సులు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.