• facebook
  • whatsapp
  • telegram

Aided Schools: ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేసేది ఎవరు?  

ఈనాడు, అమరావతి:  రాష్ట్రంలో 846 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 109 పాఠశాలలు టీచర్‌ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టుల భర్తీకి అనుమతించారు. వీటిలో 307 పోస్టులు ఉండగా.. ఇప్పటికే 266 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇంకా 41 పోస్టులు భర్తీచేయాలి. ఈ పోస్టుల భర్తీకి టెట్, డీఎస్సీ లాంటి పోటీపరీక్షలు లేకుండా తూతూమంత్రంగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ముందుగానే లీక్‌ చేసి, కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చేలా అమ్మేస్తున్నారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ పోస్టులు కమీషన్లు తెచ్చిపెడుతుండడంతో ఈ నియామక విధానం మార్పునకు ఎవ్వరూ గట్టి చర్యలు తీసుకోవట్లేదు. అవినీతిని అరికట్టాలంటే ఎంపిక విధానాన్ని మార్చాలని, అవసరమైతే ఎయిడెడ్‌ చట్టానికి సవరణ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ఎంపిక విధానం ఇలా..

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఐదుగురు సభ్యుల కమిటీ ఉంటుంది. ఆయా పాఠశాలల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖ తరఫున డిప్యూటీ డీఈఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి, ఇద్దరు సబ్జెక్టు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఈ సబ్జెక్టు నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్‌ పాఠశాల కరస్పాండెంట్‌కు ఉంటుంది. టెట్‌ అర్హత ఉన్నా.. మెరిట్‌కు ప్రాధాన్యం లేదు. అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నపత్రం రూపకల్పనే అక్రమాలకు నిలయంగా మారుతోంది. రాతపరీక్షకు 95 మార్కులు, ఇంటర్వ్యూకు 5 మార్కులు ఇస్తున్నారు.

ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జీటీ టీచర్ల దస్త్రానికి డీఈఓ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులైతే ఆర్జేడీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయితే ఎంపికైనవారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. పైగా ఇక్కడ అప్రెంటిస్‌ విధానం కూడా లేదు. నేరుగా స్కేల్‌ ఇచ్చేస్తారు.

పకడ్బందీ వ్యవస్థ ఉండాలి

ఎయిడెడ్‌లో టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని యాజమాన్యాలు ఒక్కొక్కటిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. భవిష్యత్తులో మిగిలిన 737 పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి. 

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డీఎస్సీ తరహాలో పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొంది. పోస్టుల భర్తీకి మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ పద్ధతి పాటించాలని, ఏటా సెప్టెంబరు 30 నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా అక్టోబరులో హేతుబద్ధీకరణ నిర్వహించాలని సూచించింది. ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీఓను కోర్టు రద్దుచేసింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుతో జీతాలిచ్చే పోస్టులు కావడంతో ఎయిడెడ్‌లోని టీచర్, బోధనేతర పోస్టులకు ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నియామకాల్లో అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేయాలి.


 

మరింత సమాచారం...మీ కోసం!        

♦ ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

♦ ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

♦ నలుగురితో కలిసిపోవాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.