• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ పేపర్‌ లీక్‌ నిజమే

* పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు..

* అంగీకరించిన విద్యార్థులు

దిల్లీ: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రశ్న పత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రే నీట్‌ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్‌కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్‌ యాదవ్, నీతీశ్‌ కుమార్, అమిత్‌ ఆనంద్‌లతోపాటు దాణాపుర్‌ మున్సిపాలిటీలో పని చేస్తున్న సికందర్‌ యాదవేందు అనే జూనియర్‌ ఇంజినీరు ఉన్నాడు. పట్నాలోని శాస్త్రినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితులను విచారిస్తున్నారు. లీకేజీకి సూత్రధారి అమిత్‌ ఆనంద్‌ అని తేలింది. అతడు యాదవేందుతో కలిసి పేపరును బయటకు తీసుకొచ్చారు. యాదవేందు అనే నిందితుడు అనురాగ్‌ యాదవ్‌ అనే విద్యార్థికి మామయ్య అవుతాడు. 

విద్యార్థి ఏం చెప్పాడంటే..

‘‘రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు సిద్ధమవుతున్న నాకు మామయ్య ఫోన్‌ చేశాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, బిహార్‌ సమస్తీపుర్‌లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్‌ పరీక్ష (మే 5) తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4న రాత్రి నా స్నేహితులను తీసుకుని నేను మామయ్య వద్దకు వెళ్లాను. అతడు అమిత్‌ ఆనంద్, నీతీశ్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ నాకు నీట్‌ ప్రశ్నపత్రం, ఆన్సర్‌ షీట్‌ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీ పట్టాం. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా సరిపోలింది’’ అని 22 ఏళ్ల అనురాగ్‌ పోలీసులకు వివరించాడు. 

యాదవేందు చెప్పిందిదీ..

‘పరీక్షకు ముందు అమిత్‌ ఆనంద్, నీతీశ్‌ కుమార్‌ పేపరు లీకేజీ గురించి నాకు చెప్పారు. అది రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలకు దొరుకుతుందని తెలిపారు. దీంతో నేను ఆయుష్‌ కుమార్, అనురాగ్‌ యాదవ్, శివానంద్‌ కుమార్, అభిషేక్‌ కుమార్‌ అనే విద్యార్థులను తీసుకుని వాళ్ల వద్దకు వెళ్లా. నేను విద్యార్థుల నుంచి రూ.40లక్షలు డిమాండు చేశా’ అని యాదవేందు పోలీసులకు తెలిపాడు.

హైకోర్టుల్లో విచారణపై సుప్రీం స్టే

నీట్‌ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో విచారణలపై స్టే ఇచ్చింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్‌టీఏ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్‌ యూజీ-2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.  

లీకేజీపై విచారణ జరుపుతున్న బిహార్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఏడీజీ నయ్యర్‌ హస్నైన్‌ను కేంద్ర హోంశాఖ దిల్లీకి పిలిపించింది.  విచారణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యూజీసీ నెట్‌ రద్దు, నీట్‌ ప్రశ్నప్రతం లీకేజీపై దేశవ్యాప్తంగా జూన్‌ 20న విద్యార్థులు భగ్గుమన్నారు. దిల్లీలోని కేంద్ర  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు విద్యార్థి నేతలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నీట్‌ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే ఎన్‌టీఏ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు.


 

మరింత సమాచారం...మీ కోసం!        

♦ ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

♦ ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

♦ నలుగురితో కలిసిపోవాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.