* రెండేళ్లుగా మంజూరు కాని బోధన ఫీజులు
* గతేడాదికే రూ.3250 కోట్ల బకాయిలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ మరుసటి ఏడాదే ప్రభుత్వం బోధన ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తూ వస్తోంది. కరోనా అనంతరం చెల్లింపులు ఆలస్యం కావడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన, చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు కలిపి 2022-23 విద్యాసంవత్సరం నాటికే రూ.3250 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫీజుల విడుదల్లో ఆలస్యం, సంక్షేమ శాఖలు విడుదల చేసిన బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఉన్నతవిద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పులు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు.
త్వరలో సీఎం సమీక్ష
బోధన ఫీజుల బకాయిలపై త్వరలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ఉపకారవేతనాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన రూ.3250 కోట్లలో రూ.1250 కోట్లకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు ట్రెజరీలకు పంపించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల కాలేదు. బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో నిధుల కొరత నెలకొంది. 2023-24 ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల డిమాండ్ దాదాపు రూ.2400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం కలిపితే వచ్చే మార్చి నాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.5650 కోట్లకు చేరుకోనున్నాయి.
దరఖాస్తు గడువు పొడిగింపు!
2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం సంక్షేమశాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. దరఖాస్తు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. ఇప్పటివరకు కేవలం 4 లక్షల మందే దరఖాస్తు చేసుకోవడం, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువు మరో మూడు నెలలు పొడిగించాలని ఎస్సీ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ అనుమతి మేరకు దరఖాస్తు గడువు పొడిగించే అవకాశాలున్నట్లు సమాచారం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.