• facebook
  • whatsapp
  • telegram

B.Ed Counselling: ఉపాధ్యాయ విద్యలో ఆమ్యామ్యాల పాఠాలు!

* బీఈడీ కౌన్సెలింగ్‌కు రూ.3.40 కోట్ల వసూలు

ఈనాడు, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ వసూళ్లకు ఓ కీలక ప్రజాప్రతినిధి, ఉన్నత విద్యాశాఖలోని ఓ అధికారి పథకం రచించారు. ఈ ప్రజాప్రతినిధి, అధికారి ఏకమయ్యారంటే ఎక్కడినుంచైనా డబ్బులు పుట్టించగలరన్న విమర్శలున్నాయి. గతంలో డిగ్రీ, బీఈడీ కళాశాలల నుంచి దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికార బలంతో ఏదో ఒక అడ్డంకి సృష్టించడం, లొసుగులను గుర్తించడం, వాటిని బూచిగా చూపుతూ వసూళ్లకు దిగడం ఉన్నత విద్యాశాఖలో కొందరికి పరిపాటి అయింది. తాజాగా బీఈడీ కౌన్సెలింగ్‌లో రూ.3.40 కోట్ల అక్రమాలకు తెరతీశారు. కౌన్సెలింగ్‌లో జాప్యాన్ని కొనసాగిస్తూ యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి వారే తీసుకొచ్చి డబ్బులిచ్చేలా ఎత్తుగడ వేశారు.

* బీఈడీ కళాశాలల కౌన్సెలింగ్‌, ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యాశాఖ నిర్వహిస్తుంది. కళాశాలల అనుమతులనూ పర్యవేక్షిస్తుంది. కొత్త కళాశాలలకు అనుమతులిచ్చే దస్త్రాన్ని కొంతకాలంగా పక్కనపెట్టింది. కళాశాలలు సక్రమంగా నిర్వహించడం లేదని, అధ్యాపకులు లేరని, ప్రమాణాలను పాటించడం లేదంటూ కొర్రీలు పెట్టి యాజమాన్యాలను తొలుత బెంబేలెత్తించింది. చేసేదేమీలేక ఎంతో కొంత ఇచ్చుకొని కౌన్సెలింగ్‌కు వెళ్లాలని గుంటూరులో ఇటీవల సమావేశమైన యాజమాన్యాలు నిర్ణయించాయి.

* కౌన్సెలింగ్‌ ప్రక్రియను సత్వరం నిర్వహించేందుకు ఒక్కో సీటుకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని తీర్మానించాయి. వీటిని కీలక ప్రజాప్రతినిధికి, అధికారికి, కౌన్సెలింగ్‌లో భాగమయ్యే కొందరికి సమర్పించేందుకు నిర్ణయించుకున్నాయి. ఉన్నతవిద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలకు భిన్నమైన పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్రమాలపై కనీసం ఫిర్యాదు చేయాలన్నా ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకదని యాజమాన్యాలు వాపోతున్నాయి.


కీలక ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు!

ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలకు చెందిన నాలుగు కళాశాలల యాజమాన్యాలు కమిటీగా ఏర్పడి చెల్లింపునకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలలు డబ్బులు చెల్లించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 411 బీఈడీ కళాశాలలు, 34 వేలకుపైగా సీట్లున్నాయి. ఒక్కో సీటుకు రూ.వెయ్యి చొప్పున రూ.3.40 కోట్లు జమ కానున్నాయి. ఇందులోనుంచి కీలక ప్రజాప్రతినిధికి రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు చేరుతాయనే చర్చ సాగుతోంది.


పొరుగురాష్ట్రాల విద్యార్థులపై దృష్టి

జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో బీఈడీలో చేరుతున్నవారు తగ్గారు. దీంతో యాజమాన్యాలు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారికి తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు పెట్టి సర్టిఫికేట్లు ఇస్తున్నాయి. గతేడాది గుంటూరుకు చెందిన ఓ కళాశాల యజమాని ఇలా రూ.2 కోట్ల వరకు ఇలా సముపార్జించి అన్ని స్థాయిల్లోనూ సర్దుబాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోసారి ఇలాంటి సర్దుబాటు కోసం యాజమాన్యాలు వసూళ్లకు సిద్ధమవుతున్నాయి. అనుబంధ గుర్తింపునిచ్చేందుకు విశ్వవిద్యాలయాలు ముగ్గురు సభ్యుల తనిఖీ బృందాలను పంపించాలి.

* దీనికి భిన్నంగా ఒకరిద్దరు సభ్యులను.. వారిలోనూ అనర్హులను పంపుతున్నారు. ఆంధ్రకేసరి వర్సిటీ పరిధిలో ఇద్దరితోనే తనిఖీలు చేయించగా.. నాగార్జున వర్సిటీ పరిధిలో ఐదేళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులనే ఈ బృందంలో చేర్చుతున్నారు. నన్నయ్య, కృష్ణా వర్సిటీల పరిధిలోనూ ఇలాంటి లోపాలే కన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 411 కళాశాలలు ఉండగా 217 కళాశాలలు నాగార్జున, ఆంధ్రకేసరి, కృష్ణా, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి.
 

ఐదు నెలలైనా కౌన్సెలింగ్‌ లేదు..

ఈ విద్యా సంవత్సరం ఐదు నెలల్లో ముగియనున్నప్పటికీ బీఈడీ కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి స్పష్టతనివ్వడం లేదు. ఏటా జనవరి, ఫిబ్రవరిలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కళాశాలలు కాసులు కురిపించే కామధేనువుల్లా కనిపించడంతో ‘సర్దుబాటు’ అయ్యే వరకూ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించడం లేదు. ఏదో ఒక మెలిక పెడుతూ ఉన్నత విద్యాశాఖ సాగదీస్తోంది. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ ఫలితాలు జులై 14న వచ్చాయి. ఫలితాలు విడుదలై 5 నెలలు గడిచినా కౌన్సెలింగ్‌ చేపట్టలేదు. ఓ పక్క ప్రవేశాలు లేక పీజీ కోర్సులు బోసిపోతుండగా, మరోవైపు పదివేల మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నా బీఈడీ ప్రవేశాలు చేపట్టడం లేదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.