• facebook
  • whatsapp
  • telegram

TSPSC: 563 పోస్టులతో గ్రూప్‌-1

* పాత నోటిఫికేషన్‌ రద్దు

* 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 పరీక్షల నోటిఫికేషన్‌ జారీ చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి.. దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్షను మే లేదా జూన్‌ నెలలో, ప్రధాన(మెయిన్‌) పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్‌-1 (4/22 నోటిఫికేషన్‌)కు దరఖాస్తు చేసుకున్నవారూ పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్‌ స్పష్టం చేసింది. అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఓటీఆర్‌ తప్పనిసరి

కమిషన్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌)లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్‌ లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్‌, మొబైల్‌ నంబర్‌ను తప్పనిసరిగా పేర్కొనాలి.

దరఖాస్తు రుసుము రూ.200 కాగా, పరీక్ష రుసుము రూ.120. నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థల/కార్పొరేషన్ల/ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

యూనిఫామ్‌ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌(ఏఈఎస్‌), ఆర్టీవో పోస్టులకు కనిష్ఠ, గరిష్ఠ వయోపరిమితులు 21 నుంచి 35 ఏళ్లు కాగా.. మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వరకు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఆర్టీవో పోస్టుకు మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏసీఎల్‌ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్‌ వర్క్‌లో పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు, శ్వాస పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి.

ప్రిలిమినరీ పరీక్షకు ముందు ప్రభుత్వ శాఖలు మరికొన్ని ఖాళీలను గుర్తిస్తే.. ఆ పోస్టులను భర్తీ చేసేవాటికి కలుపుతారు.

రిజర్వేషన్‌ విధానం, సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.

పోస్టుల కేటాయింపులిలా

ఓసీ-209, ఈడబ్ల్యూఎస్‌-49, బీసీ(ఏ)-44, బీసీ(బీ)-37, బీసీ(సీ)-13, బీసీ(డీ)-22, బీసీ(ఈ)-16, ఎస్సీ-93, ఎస్టీ-52, దివ్యాంగులు-24, క్రీడాకారులు-4.

షెడ్యూలు..

* ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ

* మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో మార్పు(ఎడిట్‌)లకు అవకాశం.

* పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి 4 గంటల ముందు వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రాథమిక పరీక్ష: మే/జూన్‌

 మెయిన్స్‌: సెప్టెంబరు/అక్టోబరు

అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ

ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఓఎంఆర్‌ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌) విధానంలో అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

హైకోర్టు ఆదేశాల అమలుకే మొగ్గు

చకచకా పరిణామాలు

గ్రూప్‌-1 పరీక్షపై హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల అమలుకే టీఎస్‌పీఎస్సీ మొగ్గు చూపింది. గత నోటిఫికేషన్‌ రద్దు, కొత్త నోటిఫికేషన్‌ జారీ పరిణామాలు సోమవారం చకాచకా చోటుచేసుకున్నాయి. గత నోటిఫికేషన్‌కు సంబంధించి వివిధ అంశాలపై సమగ్ర విచారణ జరుగుతోందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ సోమవారం సాయంత్రం వెబ్‌ నోట్‌ జారీ చేసింది. ఆ వెంటనే కొత్త నోటిఫికేషన్‌ జారీ అయింది.

రెండుసార్లు పరీక్షల రద్దు

2022 ఏప్రిల్‌లో 19 శాఖల్లోని 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా, ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌ 11న మరోసారి గ్రూప్‌-1 పోస్టుల కోసం ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. దాదాపు 2.33 లక్షల మంది రాశారు. ఈ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు, తుది ‘కీ’ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పరీక్షను రద్దు చేసి, మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీన్ని డివిజన్‌ బెంచి కూడా సమర్థించింది. దీనిపై సుప్రీంకోర్టులో కమిషన్‌ అప్పీల్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది. ఈలోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. సర్కారు మారింది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రూప్‌-1పై సీఎం సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చేసరికి ఆలస్యమయ్యే అవకాశం ఉందని, వెంటనే నియామకాలు చేపట్టేందుకు వీలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా పిటిషన్‌ను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించుకుంది. మరోవైపు, గత రెండు నోటిఫికేషన్‌ల జారీ అనంతరం ఏర్పడిన ఖాళీల సమాచారాన్ని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించింది. కొత్తగా తేలిన 60 ఖాళీలు కలిపి.. మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత ప్రభుత్వం గ్రూప్‌-1లో మౌఖిక పరీక్షల విధానం రద్దు చేసింది. కొత్త ప్రభుత్వం అదే విధానం కొనసాగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మహిళలకు రోస్టర్‌ పాయింట్లు లేకుండా ఖాళీలను ప్రకటించారు. పరీక్షల విధానం, సిలబస్‌, ప్రిలిమినరీ ఎంపిక విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిసింది.

పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే... 

‣ డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు): వయస్సు 18 నుంచి 46 ఏళ్లు - వేతనం రూ.58,850 - రూ.1,37,050

‣ డీఎస్పీ (115 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.58,850 -రూ.1,37,050

‣ సీటీవో (48 పోస్టులు): 18 - 46ఏళ్లు - వేతనం రూ.58, 850 -రూ.1,37,050

‣ ఆర్టీవో (4 పోస్టులు): 21 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా రిజిస్ట్రార్‌ (6 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు): 18 - 35 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (30 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు (3 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (2 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (20 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (38 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌  (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ ఎంపీడీవో  (140 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి...



  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10.తెలంగాణ రాష్ట్ర విధానాలు
11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్



  ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   



   నమూనా ప్రశ్నపత్రాలు   


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.