• facebook
  • whatsapp
  • telegram

NEET Paper Leak: నీట్‌ పేపర్‌ లీక్‌లో కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు!

* అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను ప్రవేశపెట్టి పరీక్షలు 

మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రం గుర్తుందా..? అందులో ఒకరికి బదులు మరో వ్యక్తి మెడికల్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష రాసి ర్యాంక్‌ సాధిస్తాడు. కొన్నేళ్లుగా నీట్‌ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పేపర్‌ లీక్‌లో ‘సాల్వర్‌ గ్యాంగ్‌’ హస్తం ఉన్నట్లు బయటపడటంతో బిహార్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో ఈ గ్యాంగ్‌ కీలక సభ్యుడు రవి అత్రి హస్తం ఉన్నట్లు బలంగా విశ్వసిస్తున్నారు. అతడి కనుసన్నల్లోనే నీట్‌ పేపర్‌ లీకైనట్లు భావిస్తున్నారు. 

ఈ గ్యాంగ్‌ నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తుంది..?

నీట్‌ పేపర్‌ లీక్‌ వెనక ఈ గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా ప్రశ్నపత్రాన్ని ముందుగానే చేజిక్కించుకోవడం.. దానికి సమాధానాలు తయారు చేసి.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా కొనుగోలుదార్లకు పంపడంలో అందెవేసిన చెయ్యి. గతంలో కూడా వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పరీక్ష పత్రాలను లీక్‌ చేసిన కేసుల్లో రవి అత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతడికి ఆయా ప్రాంతాల్లోని ఎగ్జామ్‌ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయి. ప్రశ్న పత్రాలను పరీక్షకు ఒక రోజు ముందు సంపాదించడంలో ఇతడు నిష్ణాతుడు.

ఈ సాల్వర్‌ గ్యాంగ్‌కు డబ్బులు చెల్లిస్తే అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను ప్రవేశపెట్టి పరీక్షలు రాయిస్తుంది. కచ్చితంగా ర్యాంక్‌ వస్తుందన్న హామీ ఇచ్చి.. భారీగా సొమ్ములు తీసుకొని ఈ పనిచేస్తుంది.

డాక్టర్‌ కావాల్సినవాడు.. లీకర్‌గా మారాడు..!

2007లో రవి అత్రిని తల్లిదండ్రులు మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ కోసం సిద్ధమయ్యేందుకు రాజస్థాన్‌లోని కోటాకు పంపించారు. అతడు అక్కడ కొన్నేళ్లపాటు చదువుకొని 2012లో పీజీఐ రోహ్‌తక్‌లో సీటు సంపాదించాడు. నాలుగో ఏడాది డ్రాపౌట్‌ అయ్యాడు. అప్పటికే అతడు ఎగ్జామ్‌ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతరుల మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌కు అతడు హాజరై పేపర్‌ రాసేవాడు. దీంతోపాటు లీకైన పేపర్లను పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టాడు. ఇతడిని ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. 

సంజీవ్‌ ముఖియా కుటుంబం హస్తం..

ఈసారి నీట్‌ పేపర్‌ లీకేజీలో కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి సంజీవ్‌ ముఖియా. ఇతడు కూడా సాల్వర్‌ గ్యాంగ్‌లో సభ్యుడే. ఇతడి కుమారుడు కూడా దీనిలో కీలక పాత్ర పోషించాడు. గతంలో బీపీఎస్‌సీ టీచర్స్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పరీక్ష, కానిస్టేబుల్‌ పరీక్షల లీకుల్లో కూడా వీరి హస్తం ఉంది. ప్రస్తుతం నీట్‌ వివాదం పెద్దదికావడంతో సంజీవ్‌ ముఖియా నేపాల్‌ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ కేంద్రంగా..?

బిహార్‌ పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ ప్రాంతం లీకులకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ ఒయాసిస్స్‌ స్కూల్‌ నీట్‌ పేపర్‌ లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్లు బిహార్‌ పోలీస్‌లోని ది ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ గుర్తించింది. ఇక్కడ ట్యాంపర్ చేసిన నీట్‌ ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చిలో బీపీఎస్‌సీకి చెందిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పత్రాన్ని కూడా ఇక్కడి నుంచే లీక్‌ చేశారు. అప్పుడు కూడా ఇక్కడ 268 మంది అభ్యర్థులకు ముందు రోజు రాత్రి ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు గుర్తించారు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.