విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు

* సుప్రీంకోర్టు తీర్పు
 


దిల్లీ: నీట్‌-యూజీ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రశ్నపత్రం లీకైందని, చాలాచోట్ల అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు జులై 23న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రశ్నపత్రం వ్యవస్థీకృతంగా లీకైనట్లు చెప్పడానికి రుజువులు లేవని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో ఈ ఏడాది మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు 23.33 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 14న ఫలితాలు విడుదలైన అనంతరం ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు నరేందర్‌ హుడా, సంజయ్‌ హెగ్డే, మాథ్యూస్‌ నెడుమపార నాలుగు రోజులుగా చేసిన వాదనలను సుప్రీం ధర్మాసనం మంగళవారం ముగించింది. సాయంత్రం 4.50 గంటలకు ధర్మాసనం తిరిగి సమావేశమైంది. ఇది రెండు మిలియన్లకుపైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ఈ వివాదానికి వెంటనే ముగింపు ఇవ్వాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. ఎన్‌టీఏ, ఇతరులు స్వతంత్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలను ఉద్దేశిస్తూ ‘‘పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీకేజీ జరిగినట్లు ఆధారాలు లేవు’’ అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ‘‘పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే ఈ పరిణామం అడ్మిషన్ల ప్రక్రియపైనా, అట్టడుగు వర్గాలకు ప్రత్యేకించిన సీట్లపైనా, మొత్తంగా వైద్య విద్యపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. హజారీబాగ్, పట్నాలలో ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమే. సీబీఐ దర్యాప్తు నివేదిక ప్రకారం లీకేజీతో 155 మంది లబ్ధిపొందారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దర్యాప్తులో మరింత మంది పేర్లు వెల్లడైతే... అటువంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. 


* ఐఐటీ-దిల్లీ నిపుణుల నివేదికను అంగీకరిస్తున్నాం

ఫిజిక్స్‌ విభాగంలోని అటామిక్‌ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఎంపిక చేసినా... మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జులై 22న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, జులై 23న మధ్యాహ్నం 12 గంటలలోగా నివేదిక అందించాలని ఐఐటీ-దిల్లీని ఆదేశించింది. సంబంధిత ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని, రెండు లేవని... ఆప్షన్‌ 4 ఒక్కటే సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు జులై 23న విన్నవించింది. దాంతో ఆప్షన్‌ 4ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం పరీక్ష నిర్వాహకులను ఆదేశించింది. ఫలితంగా మరోసారి రివైజ్డ్‌ ర్యాంకులను విడుదల చేయడం అనివార్యంగా మారింది. ఈ తీర్పుతో నీట్‌ పరీక్షకు హాజరైన వారిలో 4.2 లక్షల మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోతారు. వారిలో 720కి 720 మార్కులు సాధించిన44మంది కూడా ఉన్నారు. 


రెండు రోజుల్లో రివైజ్డ్‌ ఫలితాలు: కేంద్ర మంత్రి 

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ ‘‘తుది ఫలితాలను రెండు రోజుల్లోనే విడుదల చేస్తాం. నిందితులను వదిలేది లేదు’’అని స్పష్టంచేశారు.

----------------------------------------------------


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Updated at : 24-07-2024 12:37:43

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం