• facebook
  • whatsapp
  • telegram

పొరపాట్లు సవరిస్తూ... ఒత్తిడిని ఓడిస్తూ!

ప్రాంగణ నియామకాల్లో విజయానికి సూచనలు

ఉద్యోగార్థులకు విషయ పరిజ్ఞానం ఎంత ముఖ్యమో.. దాన్ని మెరుగైన రీతిలో వ్యక్తీకరించటం అంత ముఖ్యం. భాషా నైపుణ్యాలను పెంచుకునే క్రమంలో పొరబాట్లు సహజం. వాటిని సవరించుకుంటూ శ్రద్ధతో, తపనతో సాధన చేయాలి!  

ప్రాంగణ నియామకాల ప్రక్రియపై సరైన అవగాహన లేనందున విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి నైపుణ్యాలనూ, విషయ పరిజ్ఞానాన్నీ కప్పిపుచ్చి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఒక సంస్థకు హాజరై విజయం సాధించిన విద్యార్థి మరో సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కాకూడదన్న నిబంధనలు పెడుతుంటారు. అలాంటప్పుడు ప్రాంగణ నియామకాలకు వచ్చే సంస్థల వివరాలు ముందుగానే సేకరించి ఇష్టపడే సంస్థల ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  

నిర్ణిష్ట అవసరాల గుర్తింపు

మీ ప్రాధాన్య క్రమంలో ఉన్న సంస్థల వ్యాపార సరళి, సంస్థ మానవ వనరుల నిర్వహణ విధానాన్ని గమనించండి. సంస్థ నిర్దిష్ట అవసరాలకు తగిన విధంగా సన్నద్ధమయితే యాజమాన్యాలు కోరుకునే అభ్యర్థిగా మిమ్మల్ని గుర్తిస్తారు. నియామకం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.  
హాజరయ్యే సంస్థ ఇంటర్వ్యూ నిర్వహణ ప్రక్రియను తెలుసుకోవడానికి గతంలో ఆ సంస్థకు ఎంపికైన అభ్యర్థుల నుంచి సూచనలు తీసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో కూడా ఇంటర్వ్యూ వివరాలూ, ప్రక్రియలను కొన్ని సంస్థలు తెలియజేస్తుంటాయి. మీ జాబితాలోని సంస్థల వ్యాపార వ్యవహార సరళికి తగినట్టు మీ ఇంటర్వ్యూ వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. నైపుణ్యం సాధించేందుకు మిత్రులతో కలిసి మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడం అనుసరణీయం. 

భాషపై పట్టు

బహళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను ఆంగ్లంలో జరుపుతుంటాయి. మాతృభాషతో పాటు ఆంగ్లంలోనూ పట్టు సాధించండి. ఇతరులతో సంభాషించేందుకు విలువలతో కూడుకున్న ప్రవర్తన, మంచి భాష అవసరం. పుస్తక పఠనం అందుకు సహకరిస్తుంది. ఎంపిక చేసిన పుస్తకాలు చదవడం వల్ల భాషా నైపుణ్యాన్నీ, విషయ పరిజ్ఞానాన్నీ.. తద్వారా ఆత్మవిశ్వాసాన్నీ బలపరుచుకోవచ్చు. మిత్రులతో నిత్యం ఆంగ్ల సంభాషణలు చేయడం వల్ల తప్పులు సరిదిద్దుకోవచ్చు. సమయోచితంగా బృంద చర్చల్లో పాల్గొనండి. నెమ్మదిగా ప్రారంభించి స్థిరంగా విషయాన్ని చర్చలోకి తీసుకుకెళ్ళండి. ప్రారంభంలో పొరబాట్లు జరగడం సహజం. తప్పుల సవరణ చేసుకుంటూ సాధన చేస్తే అనర్గళంగా మంచి సంభాషణ కర్తగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. దీనికి పఠనం, అభ్యసనం అవసరమవుతాయని మర్చిపోకూడదు.  

సత్సంబంధాలు

కొంతమంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల సమయంలో కొంత నెర్వస్‌గా ఉంటారు. దీన్ని అధిగమించేందుకు అవసరం మేరకు సంభాషణలు పెంచండి. ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలోనే కార్పొరేట్‌ సంస్థల పని విధానం, మానవ సంబంధాలు, అధికారుల మధ్యనున్న కమ్యూనికేషన్‌ చానెల్స్‌ మీకు తెలిసివుంటాయి. దీనికి అనుగుణంగా మీ ఇంటర్వ్యూల సందర్భంలో వ్యవహరించాలి. 

నైపుణ్యాలను వెలుగులోకి తేవడం

మీలో ఉన్న నైపుణ్యాలూ, సామర్థ్యాలను ఇంటర్వ్యూ సమయంలో సమయస్ఫూర్తితో వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించండి. ప్రతి వ్యక్తిలోనూ సాధారణ నైపుణ్యాలతో పాటు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఈ ప్రత్యేకత వృత్తిపరంగానూ, మనో వైఖరిపరంగానూ, ప్రవర్తనా పరంగానూ కావచ్చు. అలాంటి నైపుణ్యాలను ప్రదర్శించండి.  

‘సంస్థ గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?’ అన్నది ప్రతి ఇంటర్వ్యూలోనూ ఎదురయ్యే సాధారణ ప్రశ్న. ఆ సంస్థ పని సంస్కృతి గురించి ఇంటర్వ్యూ చేసే అధికారులను అడిగి తెలుసుకుంటే ఆ సంస్థపై మీ ఆసక్తినీ, ఉత్సాహాన్నీ, మీలోని కుతూహలాన్నీ సెలక్టర్లు అభినందిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని సెలక్టర్లకు తెలియజేసినవారవుతారు.  

మీ నైపుణ్యాలను ఎలా తెలియజెపుతున్నారన్నది ముఖ్యం. మీ భావప్రసరణ నైపుణ్యం ఇంటర్వ్యూ ప్యానల్‌పై ప్రభావం చూపిస్తుంది. నిజానికి ఈ నైపుణ్యం మీ ఇతర నైపుణ్యాలను ఇంటర్వ్యూ ప్యానెల్‌కు తెలియజెప్పేందుకు సహకరించే ఒక వాహకం మాత్రమే. ఇంటర్వ్యూ విజయవంతం కావడానికి మీ విషయ పరిజ్ఞానాన్ని మంచి మాడ్యులేషన్‌తో ప్రదర్శించగలగాలి. ఈ పోటీ మార్కెట్‌లో విషయ పరిజ్ఞానంతో పాటు అభ్యర్థులు ఇతర మార్కెటింగ్‌ నైపుణ్యాలనూ అభివృద్ధి చేసుకుని వాటిని సెలక్టర్ల ముందు విజయవంతంగా ప్రదర్శించగలగాలి. మెయిన్‌ సబ్జెక్ట్‌తో పాటు ఈ అంశాలను అర్థం చేసుకునేవారు విజయం సాధిస్తారు.

హాజరయ్యే సంస్థల పనితీరు, యాజమాన్య సిద్ధాంతాలను అధ్యయనం చేయండి. ఆ సంస్థ విజన్, మిషన్‌లను పరిశీలించండి. 

ఇంటర్నెట్లో ఆ సంస్థ గురించి తాజా సమాచారాన్ని తెలుసుకోండి. 

ఉద్యోగాన్ని మీ అభిరుచికి తగిన విధంగా తీర్చిదిద్దుకునే నైపుణ్యం వృద్ధి చేసుకోండి.  

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ ఇంటర్‌ తర్వాత ఐఐఎంలో ఎంబీఏ

‣ సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

‣ ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-03-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం