• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

ప్రముఖ కళాశాలల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ పూర్తి చేసుకున్నవారు ఉన్నత విద్య దిశగా అడుగులేయాలంటే మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సులో చేరవచ్చు. ఇందులో స్పెషలైజేషన్లు సైతం ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఫార్మసీలో పీజీ చదువులకు గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) రాయడం తప్పనిసరి. ఇందులో మంచి ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ) చదువుకోవటానికి వీలవుతుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జీప్యాట్‌-2022కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం! 

ఔషధాల తయారీలో ఫార్మసిస్టుల సేవలు కీలకం కావడంతో ఫార్మసీలో ఉన్నత విద్య అభ్యసించినవారికి ఫార్మా సంస్థల్లో మేటి అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే వీరికి ఆసుపత్రులు, గొలుసుకట్టు ఔషధాల విక్రయ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నత విద్య పూర్తిచేసుకున్నవారు బోధన రంగంలోనూ రాణించవచ్చు. భారతదేశం ఫార్మా హబ్‌గా గుర్తింపు పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ఫార్మా సంస్థలు విస్తరిస్తున్నాయి. అందువల్ల సమర్థులైన మానవ వనరుల ఉపాధికి డోకా లేదనే చెప్పుకోవచ్చు. 

దేశంలో దాదాపు 870 ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. జామియా హమ్‌దార్డ్, పంజాబ్, బాంబే ఫార్మసీ కాలేజీ, బిట్స్‌ పిలానీ లాంటి ఉత్తమ విద్యాసంస్థల్లో ఎం.ఫార్మసీ కోర్సులో చేరడానికి జీప్యాట్‌ కీలకం. దేశంలో ఫార్మా విద్యారంగంలో మేటి సంస్థగా పేరొందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌ (నైపర్‌)ల్లో ఎం.ఎస్‌. సీటు పొందాలంటే నైపర్‌ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్ష రాయటానికి ముందుగా జీప్యాట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. 

జీప్యాట్‌లో అర్హత సాధించినవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కాలేజీలో ఎం.ఫార్మసీలో చేరితే రెండేళ్లపాటు ప్రతి నెలా రూ.12,400 ఉపకార వేతనం అందుకోవచ్చు. ఎం.ఫార్మసీ తర్వాత పి.హెచ్‌.డి.లో చేరడానికీ జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. అందువల్ల వీరు పి.హెచ్‌.డి. ప్రవేశపరీక్షకు ప్రత్యేకంగా హాజరు కానవసరం లేదు. ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థలు జీప్యాట్‌ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి ఉపకారవేతనం అందిస్తున్నాయి. అనేక బహుళజాతి ఫార్మా సంస్థలు, ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థలు ఉద్యోగాలివ్వడానికీ జీప్యాట్‌ స్కోర్‌ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.  

సన్నద్ధత ఇలా

జీప్యాట్‌ సన్నద్ధతలో బీఫార్మసీ పాఠ్యపుస్తకాలే కీలకం. వాటిని శ్రద్ధగా చదువుకున్నవారు మెరుగైన స్కోరు సాధించి, మంచి సంస్థలో సీటు పొందవచ్చు. 

పాఠ్యాంశాల్లో...ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోఫార్మాస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ అంశాలు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ఫార్మాస్యూటిక్స్‌లోని ఇతర అంశాలతోపాటు ఫిజికల్‌ ఫార్మసీ, డిస్పెన్సింగ్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీల పాఠ్యాంశాలు క్షుణ్నంగా చదవాలి.

ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్, మెడిసినల్, బయో, ఫిజికల్‌ కెమిస్ట్రీల్లోని ముఖ్యాంశాలపై శ్రద్ధ చూపించాలి. 

ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లో వెట్‌ కెమిస్ట్రీలోని వివిధ అంశాలతోపాటు ఆధునిక అనలిటికల్‌ విధానాలు, పరికరాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. 

ఫార్మకాలజీలో జనరల్‌ ఫార్మకాలజీతోపాటు, పాథో ఫిజియాలజీ, టాక్సికాలజీ, సెంట్రల్‌ నర్వస్‌ సిస్టంలపై దృష్టి కేంద్రీకరించాలి. 

ఫార్మకాగ్నసీకి సంబంధించి క్రూడ్‌ డ్రగ్స్, వాటి నాణ్యత విశ్లేషణ, పిండి పదార్థాలు, వాలటైల్‌ ఆయిల్స్, లిపిడ్స్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుంది.

పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. అందులో వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల తీరును గమనించి పరీక్ష కోణంలో అధ్యయనం కొనసాగించాలి. 

సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.

ఇవీ స్పెషలైజేషన్లు

ఎంఫార్మసీ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో వివిధ స్పెషలైజేషన్లు ఉన్నాయి. విద్యార్థులు తమ అభిరుచి ప్రకారం వీటిని ఎంచుకోవచ్చు. ఎక్కువ సంస్థల్లో ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్, ఇండస్ట్రియల్‌ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్‌ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాకాగ్నసీ, ఫార్మాస్యూటికల్‌ బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ ఎఫైర్స్‌...తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఎంఫార్మసీ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. 

పరీక్ష విధానం  

ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) తరహాలో అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నపత్రం 500 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆయా విభాగాలవారీ ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ - 38, ఫార్మాస్యూటిక్స్‌ - 38, ఫార్మకాగ్నసీ - 10, ఫార్మకాలజీ - 28, ఇతర సబ్జెక్టులు - 11 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. 

ముఖ్య వివరాలు

అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ పురుష అభ్యర్థులకు రూ. 2000, మిగిలిన అందరికీ రూ. 1000. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 17

పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.  

వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in/

దేశంలో టాప్‌-10 ఫార్మసీ కళాశాలలు (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2021 ర్యాంకింగ్‌ ప్రకారం)

1. జామియా హమ్‌దార్డ్, న్యూదిల్లీ

2. పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌

3. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, పిలానీ

4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, మొహాలీ

5. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ముంబై

6. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, హైదరాబాద్‌

7. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఊటీ

8. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, ఉడిపి

9. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, మైసూరు

10. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, గాంధీనగర్‌

తెలుగు రాష్ట్రాల నుంచి టాప్‌-75లోపు నిలిచినవి...

6. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, హైదరాబాద్‌  

30. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 

44. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 

48. కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ 

54. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి 

55. రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, అనంతపురం 

61. అనురాగ్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ 

62. శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, చిత్తూరు 

69. చలపతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, గుంటూరు 

72. విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, నర్సాపూర్‌ 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

‣ ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

‣ ఎస్‌ఓపీ ఎలా రాయాలి?

‣ ఆధునిక వసతులు అత్యుత్తమ బోధన!

‣ విద్యార్థినులకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత

‣ ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌