• facebook
  • whatsapp
  • telegram

వినూత్న ప్రణాళికతో మెరుగైన కెరియర్‌

విద్యార్థులకు ఉపయోగపడే నిర్దిష్ణ అంశాలుఏటా ప్రతి రంగంలోనూ కొన్ని అంశాలు ఆ సంవత్సరం మొత్తం అత్యంత ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవేమిటనేది ముందే నిపుణులు అంచనా వేస్తుంటారు. ఇదే కోవలో ఈ ఏడాది ఉన్నత విద్యారంగాన్ని కొన్ని నిర్దిష్ట అంశాలు ప్రభావితం చేయనున్నాయనే అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే సమర్థంగా కెరియర్‌ ప్రణాళికను రూపొందించుకోవడం సాధ్యమవుతుంది. 


క్యాలెండర్‌ మారగానే ‘ఎడ్యుకేషన్‌ ట్రెండ్‌ ఎలా ఉంది’ అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. ఈ ఏడాది ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సంధి దశలో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సంప్రదాయ విద్యావిధానాలకు- దూసుకొస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవిస్తూ నూతన మార్పులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎటువంటి అంశాలు ఉన్నత విద్యారంగాన్నీ, తద్వారా విద్యార్థులనూ ప్రభావితం చేయబోతున్నాయనేది తెలుసుకోవడం ద్వారా మెరుగైన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుకోగలుగుతాం.


హైబ్రిడ్‌ లెర్నింగ్‌

పాఠ్యపుస్తకాలతో లాప్‌ట్యాప్‌లు జోడీ కట్టనున్నాయి. 2024లో విద్యార్థులు సంప్రదాయ రీతిలో పుస్తకాలు, తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా.. సరికొత్తగా వచ్చిన హైబ్రిడ్‌ లెర్నింగ్‌ పద్ధతిని అధికంగా అనుసరించనున్నారు. పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలను, వాటికి అదనంగా లభించే సమాచారాన్ని లాప్‌ట్యాప్‌ల ద్వారా తెలుసుకుంటూ కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించనున్నారు. హైబ్రిడ్‌ లెర్నింగ్‌ భౌగోళిక పరిమితులను చెరిపేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులు నేర్చుకునేందుకు దోహదం చేస్తోంది. ఒక అంశాన్ని అన్నికోణాల్లోనూ అభ్యసించేలా ప్రోత్సహిస్తోంది. ఈ తరహా విద్యావిధానం ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో తప్పకుండా అలవర్చుకోవాల్సిన విషయం.


మానసిక ఆరోగ్యం

ఈ ఏడాది విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం లభించనుంది. ఎందుకంటే దీని ద్వారానే విద్యార్థులు నేడు చదువులోనూ రేపు జీవితంలోనూ రాణించగలరు. ఈ నిజాన్ని గుర్తించిన విద్యాసంస్థలు ఇందుకోసం కృషిచేయనున్నాయి. విద్యార్థులకు అన్నివిధాలా మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడేలా తమ విధానాలు ఉండటంతోపాటు ఎటువంటి మానసిక ఒత్తిడికీ గురికాకుండా క్యాంపస్‌ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. మార్కుల వేటలో పగలూ రాత్రీ తేడా లేకుండా సాధన చేయించే విధానాలకు స్వస్తి పలికి ఆటలు, నిద్ర, ఇతర అంశాలకూ చోటుండేలా ఇప్పటికే కొన్ని ముఖ్య సంస్థలు మార్పులు చేస్తున్నాయి. దీనిపై విద్యార్థులు సైతం వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదువు ముఖ్యమే కానీ అది మనల్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టి, మానసికంగా కుంగిపోయేలా చేయకూడదనే విషయాన్ని ఆచరణలో చూపాల్సి ఉంది.


సంపూర్ణ శిక్షణ

ఏ అంశాన్నయినా విద్యార్థులు  పూర్తిస్థాయిలో నేర్చుకునేలా చూడటం ప్రస్తుత పద్ధతి. పాతకాలంలో నిర్దిష్ట సమయం తర్వాత విద్యార్థికి విషయం అవగాహనకు వచ్చినా రాకపోయినా తదుపరి అంశానికి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడలా కాకుండా మొత్తం అంతా నేర్చుకున్నాకే తర్వాతి పాఠం నేర్పేలా నాణ్యమైన విద్య అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేకమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం కలిగి ఉండేలా వారికి శిక్షణ ఇవ్వడం ఇందులో ప్రధాన లక్ష్యం. బయట ప్రపంచంలో అవసరమయ్యే నైపుణ్యాలకు సైతం అధిక ప్రాధాన్యం ఇస్తూ థియరిటికల్‌ నాలెడ్జ్‌ కంటే  ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ఈ విధానాలు ఉండబోతున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే కొత్త తరహా బోధన పద్ధతులపై ఇప్పటికే ఆలోచనలు, ఆవిష్కరణలు మొదలయ్యాయి.


ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌

విద్యార్థులంటే కేవలం మార్కులు, గ్రేడ్లు ఉంటే చాలు అంటూ ఏళ్లుగా వ్యవస్థలో వేళ్లూనుకున్న భావనలకు కాలం చెల్లుతోంది. సబ్జెక్టు జ్ఞానం ఎంత అవసరమో ప్రాక్టికల్‌ పరిజ్ఞానం, ఏ విషయాన్ని అయినా సమర్థంగా ఎదుర్కోగల ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ కూడా అంతే ముఖ్యమనే అవగాహన పెరుగుతోంది. ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌కు ఇదే సమయంలో ప్రాధాన్యం పెరగబోతోంది. ఈ ఏడాది విద్యా, ఉద్యోగ నియామక సంస్థలు దీనిపై మరింత శ్రద్ధ వహించనున్నాయి.


సర్టిఫికేషన్లు

కనీస, ప్రాథమిక అర్హతలను పక్కనపెడితే.. ప్రతి ఉద్యోగానికీ కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం అవుతాయి. వీటిపై శిక్షణ ఇచ్చే స్వల్ప వ్యవధి గల సర్టిఫికేషన్‌ కోర్సులకు రానున్న కాలంలో మరింత గిరాకీ పెరగనుంది. తాజాగా చేసిన ఒక సర్వే ప్రకారం గత ఏడాది ఇలాంటి తక్కువ వ్యవధి గల కోర్సులను మొత్తం విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మంది చేశారు. ఇది ఈ ఏడాది మరింత పెరగనుంది.


ఎడ్‌టెక్‌ సంస్థలు

కరోనా విజృంభించిన సమయంలో ఆన్‌లైన్‌ అభ్యాస వేదికలకు పెరిగిన ఆదరణ.. రానున్న కాలంలో మరింత స్థిరంగా ఉండబోతోందని అంచనా. దీనివల్ల మరికొన్ని ఎడ్‌టెక్‌ అంకుర సంస్థలు పుట్టుకొచ్చి విద్యార్థులకు నేర్చుకోవడాన్ని మరింత ఆసక్తికరం చేయనున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, బోధకులను ఒక దరికి చేర్చి విద్యార్థులకు అంతర్జాతీయ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయనున్నాయి.


సస్టెయినబిలిటీ  

సస్టెయినబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ మరింత ప్రాధాన్యం సంతరించు కోనున్నాయి. వాతావరణ మార్పులు, రెన్యూవబుల్‌ ఎనర్జీ, సహజ వనరుల బాధ్యతాయుత వినియోగం.. ఇలా వీటన్నింటి గురించీ విద్యార్థులు నేర్చుకుంటారు. కెరియర్‌ ఏదైనా వీటిపై కనీస అవగాహన ముఖ్యం కానుంది.


ఎల్‌ఎంఎస్‌ వినియోగం

లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ను ఎడ్యుకేషనల్‌ డొమైన్‌తో కలిపి చూడనున్నారు. వీటికి కేవలం కోర్సు మెటీరియల్స్, ఇతర డేటా మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ టూల్స్‌ ఉంటాయి. ఇవి సంప్రదాయ, హైబ్రిడ్‌ పద్ధతుల బోధన అవసరాలు తీర్చేలా సేవలందిస్తాయి. దీర్ఘకాలంలో ఇవి అందించే ప్రయోజనాలు యూనివర్సిటీలు, విద్యార్థులకు మేలు చేస్తాయి. వీటి వినియోగం కూడా ఈ ఏడాది పెరగనుందని అంచనా. 


టెక్నాలజీ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దాదాపు మన జీవితంలో ప్రతి అంశాన్నీ ప్రభావితం చేసినట్టుగానే ఉన్నత విద్యారంగాన్ని కూడా చేయనుంది. ఇప్పటికే కళాశాలలు దీన్ని ఉపయోగించుకుని మెరుగైన  బోధన ఎలా చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థీ నేర్చుకునే తీరుకు తగినట్టుగా వ్యక్తిగతంగా వారిపై ధ్యాస పెట్టేలా ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చో ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో టీచింగ్, టెస్టింగ్‌లో ఏఆర్, వీఆర్‌ టెక్నాలజీలను మరింత మిళితం చేయబోతున్నారు. లెర్నింగ్‌లో గేమిఫికేషన్‌ను కలపడం సైతం మరో ముఖ్యమైన విషయం. ప్రతి విద్యార్థీ తనకు నచ్చిన విధానంలో సబ్జెక్టు నేర్చుకునేలా ఏఐ సాయపడే విధానం ఒక విప్లవంగా చెప్పవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-01-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం