• facebook
  • whatsapp
  • telegram

ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

విద్యార్థులకు నిపుణుల సూచనలు



తాజాగా జరిగిన నీట్, నెట్‌ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది. కష్టపడి చదివి పరీక్ష రాసిన శ్రమంతా వృథా అయ్యిందనే బాధ.. తర్వాత ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. వారిని మాత్రమే కాదు, తల్లిదండ్రులనూ వెంటాడుతోంది. అయితే ఇటువంటి సమయంలో ఆశావహ దృక్పథాన్ని ఆశ్రయించాలని చెబుతున్నారు నిపుణులు. జరిగిన దాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు.


ప్రస్తుతం ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కచ్చితంగా నెలకొని ఉండాల్సింది కాదు. కానీ ఇది మనం రోజూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే ప్రమాదం  లాంటిది. జరగదనే నమ్మకంతో ఉన్నా, జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని తలచుకుని, భయపడుతూ, బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు! యాక్సిడెంట్‌కు భయపడి రోడ్డు మీదకు రావడం మానేయడం ఎలా అయితే చేయమో.. ఇటువంటి పేపర్ల లీకు వంటి సందర్భాల్లో వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం కూడా అలాగే చేయకూడదు. ఇది పూర్తిగా మన చేతుల్లో లేని విషయం. అందువల్ల మన చేతుల్లో ఉన్న విషయాల గురించే ఆలోచించాలి.



  సమయం సద్వినియోగం 

అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని పరీక్షకు మళ్లీ బాగా చదివేందుకు ఉపయోగించుకోవాలి. అయితే ఇది అంత సులభమైతే కాదు.. చదివి, రాసి అలసిపోయి ఉంటాం. కానీ తప్పదు. అనుకోకుండా జరిగిన ఘటనల కారణంగా అచేతనంగా ఉండిపోతే తోటి విద్యార్థులు మరింత శ్రద్ధతో సిద్ధమై మళ్లీ పరీక్ష రాస్తారు. దీనివల్ల మనం రేసులో వెనకపడే ప్రమాదం ఉంది. ఇటీవల రాసిన పరీక్షలను ఒక మాక్‌ టెస్ట్‌గా భావించి.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సన్నద్ధం కావాలి.


  సానుకూలంగా..   

ఒకవేళ పేపరు లీకేజీ ఘటనలు బయటకు రాకపోతే అంతా సవ్యంగా జరిగిపోయి అనర్హులకు సీట్లు దక్కేవి, అర్హులైనవారు వెనక్కి వెళ్లిపోయేవారు. అలా కాకుండా జరిగిన మోసం సమయానికి బయట పడటం ఒకరకంగా మెరిట్‌ స్టూడెంట్లకు మేలు చేసేదే. జరిగినదాన్ని ఈ కోణంలో చూడటం వల్ల బాధ, ఒత్తిడీ తగ్గుతాయి. ఈ మేరకు ప్రభుత్వాలు సైతం పాఠాలు నేర్చుకుంటాయి. ఇటువంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత శ్రద్ధతో పనిచేస్తాయి. ఇది భవిష్యత్తులో విద్యార్థులకు మేలు చేస్తుంది. తెలంగాణలో ఆ మధ్య గ్రూప్‌-1 పరీక్ష విషయంలో ఇలాగే ఇబ్బందులు తలెత్తాయి. కానీ మళ్లీ సజావుగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి.


  అపోహలు వద్దు   

సోషల్‌ మీడియాలో వీటి గురించి రకరకాలైన సమాచారం ప్రచారమవుతూ ఉంటుంది. కనిపించిన ప్రతిదీ చదవడం, నమ్మడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండకపోగా.. ఇంకా ఒత్తిడికి గురికావడంతోపాటు సమయం వృథా అవుతుంది. వీటిలో సత్యాలు, అసత్యాలు, పాక్షిక సత్యాలు ఉండొచ్చు. అందువల్ల అపోహలతో కాలం గడపొద్దు. వార్తాపత్రికలు, న్యూస్‌ఛానెళ్లు, అధికారిక వెబ్‌సైట్‌లలో కనిపించే సమాచారాన్ని మాత్రమే పరిగణించాలి. నీట్, నెట్‌లో దేశంలో వైద్యం, విద్యారంగాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలు. అందువల్ల ప్రభుత్వాలు కచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటాయనే నమ్మకంతో ఉండాలి.

ప్రస్తుతం వచ్చిన ఇబ్బందులు విద్యార్థుల పరుగుకు ఒక స్పీడ్‌ బ్రేకర్‌ వంటివి మాత్రమే. దీని ద్వారా కలిగే మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కొందరు విద్యార్థులు ఇటువంటి వాటివల్ల బాగా ఇబ్బంది పడి ‘అసలు మళ్లీ పరీక్షే రాయం’ అని నిశ్చయించుకుంటూ ఉంటారు. కానీ అలాంటి నిర్ణయాల వల్ల నష్టపోయేది వారి భవిష్యత్తేనని గుర్తించాలి. తల్లిదండ్రులు, స్నేహితులు సైతం ఇటువంటి సమయాల్లో వారికి అండగా ఉండాలి. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని రెట్టించిన వేగంతో పరీక్షకు సిద్ధం కావాలి. విద్యా సంవత్సరం మొదలయ్యేముందు కొంత వ్యవధిలోగానే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారనేది ఒక అంచనా. ఆమేరకు విద్యార్థులు సన్నద్ధం కావాలి.

ఇది విద్యార్థులకు ఒక జీవితపాఠం వంటిది, అంతా బాగా ఉంది అనుకున్నప్పుడే ఊహించని సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని మనం ఎలా ఎదుర్కొన్నాం అనేదానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరీక్ష నిర్వహణ సంస్థలు పబ్లిక్‌ నోటీస్‌ కనుక ఇస్తే.. నిర్వహణలో ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేయవచ్చు అనేదానిపై మీ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఓపిగ్గా ఉండాలి, ఎటువంటి పరిణామాలు ఎదురైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పరీక్షలు మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే జీవితం కాదు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. బహుశా చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ మలివిడత సన్నద్ధతను ప్రారంభించి ఉండొచ్చు. వారితో పోటీ పడాలంటే.. మనమూ ధైర్యంగా సిద్ధం కావాల్సిందే!


- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Posted Date: 28-06-2024


 

ఇతరాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం