• facebook
  • whatsapp
  • telegram

44 వేల విద్యార్థులతో అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్‌

‣ అంకుర సంస్థతో రాణిస్తున్న చిన్మయి బలుసుఒక చిన్న చిప్‌ ఆరడుగుల రోబోని నడిపించినట్లు.. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం శరీరాన్నే నియంత్రిస్తుంది. కానీ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసే అవకాశం, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం గమనించింది చిన్మయి బలుసు. తనలాంటి ఔత్సాహికులందరికీ ఒక వేదిక ఏర్పాటు చేయాలని ‘సింప్లీ న్యూరోసైన్స్‌’ అనే అంకురాన్ని ప్రారంభించింది. ఆమె ప్రయాణంలోని విశేషాలను వసుంధరతో పంచుకుంది..


కృత్రిమమేధపై ఓవైపు ప్రయోగాలు జరుగుతుంటే.. మరోవైపు మానవ శరీరంలో కీలకమైన నాడీవ్యవస్థ మీద అధ్యయనానికి సరైన వనరులే లేవు. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లకి తప్ప ఇంకెవరికీ ఈ శాస్త్రంలో ఉన్న లోటుపాట్లని తెలుసుకునే అవకాశం లేకపోవడం గమనించా. నేను ఉత్తర కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన భారతీయ మూలాలున్న యువతిని. అమ్మానాన్నలది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు. నాన్న గోపాలకృష్ణ, అమ్మ లక్ష్మీతులసి. ఇద్దరూ ఇంజినీర్లు. ఓసారి మా స్కూల్లో శరీర అవయవాల గురించి పాఠం చెప్పారు. అప్పటి నుంచి అనాటమీపై ఆసక్తి పెరిగింది. ఆ క్రమంలోనే నాడీవ్యవస్థ గురించి తెలుసుకున్నా. మెదడు తన కన్నా కొన్ని రెట్లు ఎక్కువ బరువు ఉండే శరీరాన్ని నియంత్రిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా. దీనిపై అధ్యయనం చేయాలనుకున్నప్పుడు సరైన సమాచారం దొరికేది కాదు. ఎవరినైనా అడిగితే చిన్నపిల్లవి నీకు చెప్పినా అర్థం కాదనేవారు. స్టెమ్‌ రంగంలో ఆదరణకు నోచుకోని మరో అంశమిది అనిపించింది. అందుకే దీన్ని అందరికీ చేరువ చేయాలనుకున్నా.

ఒక్కొక్కరిగా..

సెలవుల్లో.. న్యూరోసైన్స్‌లో ఏ బ్రాంచ్‌లు ఉన్నాయి? ఇప్పటి వరకూ ఎన్ని అంశాలపై పరిశోధన చేశారు? శోధించాల్సినవి ఇంకా ఉన్నాయా? లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలనుకున్నా. సీనియర్లనీ, ప్రొఫెసర్లనీ సంప్రదించినప్పుడు కొందరు చెప్పేవారు. మరికొందరు నిరాకరించేవాళ్లు. సమయం లేదనో, వేరే పనులు ఉన్నాయనో తప్పించుకునేవారు. ఏదైనా నేర్చుకోవాలి అనుకునేవారికి ఇంతకన్నా నిరుత్సాహం ఇంకొకటి ఉంటుందా? ఈ ఇబ్బందులు ఎవరికీ ఎదురుకాకూడదని.. ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండి, తమకు తెలిసినది ఇతరులతో పంచుకోవాలనుకునే వాళ్లని ఒక చోట చేర్చడం మొదలుపెట్టా. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని నాలాంటి ఔత్సాహికులందరినీ గ్రూప్‌గా ఏర్పాటు చేశాను. వీళ్లందరితో 2019లో ‘‘సింప్లీ న్యూరోసైన్స్‌’’ అనే లాభాపేక్ష లేని అంకుర సంస్థను ప్రారంభించా.


నేనూ, సంస్థా ఎదిగాం..

ఈ మూడేళ్లలో నాతో పాటూ సంస్థ కూడా ఎదిగింది. అప్పుడు నాది ఒంటరి ప్రయాణం. కానీ ఇప్పుడు దీనిద్వారా 142 దేశాల్లోని 44 వేల మంది విద్యార్థులను అనుసంధానం చేయగలిగాం. 100 మంది వలంటీర్లు దీని కోసం పనిచేస్తున్నారు. ఈ న్యూరోసైన్స్‌ బృందంలో ప్రతిభావంతులూ, ప్రముఖులు భాగమయ్యారు. వారు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ శాస్త్రాన్ని చదవాలనుకునే వారికి ఎలాంటి అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన విద్యాసంస్థలు, వాటి బ్రాంచ్‌లు, అసలు దీనిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఇప్పటిదాకా పరిశోధన చేయని అంశాలేంటి? చేస్తున్నవేంటి లాంటివన్నీ ఇందులో చెబుతారు. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి ఈ రంగంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. ఆసక్తి ఉన్నవారు ఇందులో ఉంచిన పాడ్‌కాస్ట్‌లు కూడా వినొచ్చు. దీని ద్వారా ఒక గ్లోబల్‌ కమ్యూనిటీ ఏర్పాటైంది. ఈ రంగంలో నేను అందిస్తోన్న సేవలకు డయానా సహా ఎన్నో అవార్డులనీ అందుకున్నాను. భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, ఇలా దేశమేదైనా, విద్యార్థి ఎవరైనా వారికి వచ్చే సందేహాలను దీనిద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో మెడికల్‌ హ్యుమానిటీస్‌, న్యూరోఎపిడమాలజీ చదువుతున్నా. బయోమెడిసిన్‌, న్యూరో డీజెనరేటివ్‌ విభాగాల్లో కొలంబియా విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఉన్నాను. భవిష్యత్తులో ఈ వేదికను మరింత విస్తరించాలన్నది నా లక్ష్యం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!

‣ బీటెక్‌ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?

‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!

‣ ఆరోగ్య శాఖలో 487 కొలువులు

‣ స్టాక్‌ మార్కెట్‌లో చక్కని కెరియర్‌!

‣ చలికాలంలో పరీక్షల సన్నద్ధత!

‣ సైనిక కొలువుకు సులువు దారి!

Posted Date: 21-11-2023


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని