• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ విద్యార్హతతో విదేశంలో ప్రభుత్వ ఉద్యోగం

 రూ.37 లక్షల ప్యాకేజీతో ఎంపిక 
 

కేవలం డిగ్రీ అర్హతతోనే విదేశంలో ఉద్యోగం.. అదీ అక్కడి ప్రభుత్వ వైద్య రంగంలో స్థిరమైన కొలువు! ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితులను చూస్తే ఎవరూ ఇది సాధ్యమని అనుకోరు. కానీ దీన్ని సాధ్యం చేసి చూపించింది గుంటూరు జిల్లాలోని సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన నన్నం నిస్సీ లియోన్‌! అందరూ ఐటీ రంగం వైపు పరుగులు తీస్తున్న ఈ తరుణంలో, తక్కువ పోటీ ఉండే మెడికల్‌ రంగంలో ఉన్న అవకాశాలకు ఈమె విజయం చక్కని ఉదాహరణ. మరి ఇది ఎలా సాధ్యమైందో తన మాటల్లోనే తెలుసుకుందామా..!


మా నాన్న ఊళ్లోనే చర్చి పాస్టర్‌గా ఉన్నారు, అమ్మ ఆయనకు చర్చి పనుల్లో సాయంగా ఉంటారు. పదోతరగతి వరకూ గుంటూరులోనే చదివాను. పదిలో 9.7 జీపీఏ వచ్చింది. ఇంటర్‌ కోసం విజయవాడకు వచ్చి.. బైపీసీ గ్రూపును ఎంచుకున్నా. అందులో 915 మార్కులు సాధించాను. అప్పుడే మెడికల్‌ సంబంధిత కోర్సులు చేయాలనే ఆలోచన కలిగింది. డిగ్రీ కోసం ఆసక్తికరమైన కోర్సుల గురించి ప్రయత్నిస్తూ ఉండగా.. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ కళాశాలలో బీఎస్సీ - కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ చదివే అవకాశం వచ్చింది. అది నాకు నచ్చడంతో అందులో చేరాను. మూడేళ్లపాటు చదువు పూర్తి చేసి సెకండ్‌ డివిజన్‌లో పాసయ్యాను. కోర్సు అనంతరం హైదరాబాద్‌లో సంబంధిత విభాగంలో ట్రెయినీగా పనిచేసే అవకాశం వచ్చింది. అందులో చేరిన సమయంలోనే.. నా ప్రొఫైల్‌తో యూకేలో ఉద్యోగం పొందే అవకాశం ఉన్నట్టు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది. వారు ప్రోత్సహించడంతో.. ఆమేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాను.


‣ ఇందుకోసం ముందుగా ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష రాశాను. తర్వాత అక్కడికి వెళ్లేందుకు ముఖ్యమైన టీటీఈ (ట్రాన్స్‌ థాసిక్‌ ఎకో కార్డియోగ్రఫీ) పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాను. నిజానికి ఇది అర్హత పొందడం  చాలా కష్టం అంటారు. నేను మొదటిసారి రాసినప్పుడు విఫలమయ్యాను. కానీ పట్టువదలకుండా ఇంకా కష్టపడి చదివి రాయడంతో రెండో ప్రయత్నంలో పాసయ్యాను. అనంతరం యూకే నుంచి వచ్చిన డెలిగేట్స్‌ నన్ను నేరుగా ఇంటర్వ్యూ చేశారు. అందులో కూడా క్వాలిఫై కావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో మరోసారి మౌఖిక పరీక్ష చేశారు. అందులో సైతం సెలక్ట్‌ కావడంతో రూ.37 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రకారా అనే సంస్థ నాకు సాయం చేసింది. మెడికల్‌ రంగంలో విద్యార్థులకు మెరుగైన విదేశీ ఉద్యోగాలు కల్పించేందుకు ఇది చేయూతనిస్తుంది.


‣ ఉద్యోగానికి ఎంపికైన అనంతరం నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేందుకు అవసరమైన రీలొకేషన్‌ ఖర్చులన్నీ ఆ దేశపు వైద్య విభాగమే భరించింది. వీసాకయ్యే ఖర్చు, విమాన టికెట్లు, నేను రాసిన పరీక్ష ఫీజు సైతం వారే చెల్లించారు. ప్రస్తుతం యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో భాగమైన ‘ఫేర్‌ఫీల్డ్‌ జనరల్‌ హాస్పటల్‌’లో స్పెషలిస్ట్‌ ఎకోకార్డియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాను. మొదటి రెండు నెలలు వారే ఉచితంగా వసతి సౌకర్యం కల్పించారు. తర్వాత నేను సొంతంగా చూసుకుని వెళ్లాలి. ఈ సర్వీసులో ఉన్నవారికి ఇక్కడ పెన్షన్‌ స్కీమ్‌ ఉంటుంది. బయట ఎటువంటి వస్తువులు కొన్నా కొంతమేరకు డిస్కౌంట్‌ ఉంటుంది.


ఇక్కడ వర్క్‌కల్చర్‌ కూడా బాగుంది. రోజుకు ఎంతమందిని పరీక్షించారు అనేదానికంటే ఎంత నాణ్యమైన పరీక్షలు చేశారు అనేదానికే విలువ ఎక్కువ. సగటున ఒక టెక్నీషియన్‌ రోజుకు 8 మంది కంటే ఎక్కువ రోగులను చూడరంటేనే.. నాణ్యతా ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడి బ్రిటిష్‌ సొసైటీ ఆఫ్‌ ఎకోకార్డియాలజీ అక్రిడిటేషన్‌ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకు ముందు థియరీ పరీక్ష రాసి, రెండేళ్లలోపు ప్రాక్టికల్‌ పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన లాగ్‌బుక్‌ తయారుచేసుకునే పనిలో ఉన్నాను.


గతంలో ఇలాంటి అవకాశాలు ఉన్నట్టుగా నాకు తెలియదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి కేవలం డిగ్రీతో ఫారిన్‌లో, అదీ గవర్నమెంటు సర్వీసులో ఉద్యోగం రావడం చాలా సంతోషకరం. నిజానికి నేను ఈ జాబ్‌లోకి రాకముందు విదేశాల్లో పీజీ చేయాలని అనుకున్నాను. కానీ దానికయ్యే ఖర్చు గురించి తెలుసుకుని ఆ ఆలోచన మానుకున్నాను. ఇప్పుడు నాకొచ్చే జీతంతో పీజీ చదువు పూర్తిచేయడంతోపాటు సంబంధిత కోర్సులు కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తోంది.. అవన్నీ చేయాలి!


ఈ రంగంలో విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి. నర్సింగ్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు మాత్రమే కాకుండా.. రేడియాలజీ, ఎనస్థీషియా, న్యూరోఫిజియాలజీ.. వంటి వాటికి డిమాండ్‌ ఉంది. వీటిపై దృష్టిపెట్టవచ్చు. అయితే విదేశాలకు రావాలంటే మాత్రం.. సరైన దారిలో మాత్రమే ప్రయత్నించాలి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

Posted Date: 02-07-2024


 

ఇత‌రాలు

మరిన్ని