• facebook
  • whatsapp
  • telegram

ఆరోగ్య సిరులు చిరుధాన్యాలు

ప్రోత్సాహంతోనే సాగు బాగు

చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌ ప్రతిపాదనకు అంగీకరించి ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గతేడాదే ప్రకటించింది. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం దాకా ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకంలో భాగంగా ఏడేళ్ల కాలానికి రూ.10,900 కోట్లను ఆహార శుద్ధి పరిశ్రమలపై వెచ్చించనుంది. ఫలితంగా అంతర్జాతీయ ఆహార విపణిలో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు గురి పెట్టింది. చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తామని, మిల్లెట్ల బ్రాండింగ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక విధానం రూపొందించి, రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌ సమయంలో ప్రకటించారు. 2018ని సైతం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారత్‌ ప్రకటించింది.

అధిక పోషక విలువలు

ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా పిల్లల్లో మంచి ఎదుగుదల ఉంటుందని హైదరాబాద్‌లోని ఇక్రిశాట్లో జరిగిన పరిశోధనలో తేలింది. ఇండియాలో అయిదు దశాబ్దాల క్రితం ఇంటింటా చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా పుష్కలంగా తీసుకునేవారు. రాగులు, జొన్నలు వంటి వాటితో గట్క, రొట్టెలు లాంటి వాటిని తయారు చేసుకొని తింటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేవారు. పట్టణ జీవన శైలిలో చిరుధాన్యాల వినియోగం గణనీయంగా తగ్గి, వరి అన్నాన్నే ప్రజలు ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. ఫలితంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, పండించే రైతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చిరుధాన్యాల్లో జొన్నలు, సజ్జలు, రాగులు ప్రధానమైనవి. అరికెలు, సామలు, అండుకొర్రలు, ఊదలు లాంటి వాటిని సూక్ష్మ ధాన్యాలుగా చెబుతున్నారు. వరి, గోధుమలకన్నా ఇవన్నీ అయిదురెట్లు అధిక పోషక విలువలను కలిగి ఉన్నాయని నిపుణులు అభివర్ణిస్తున్నారు. చిరుధాన్యాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) చెబుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తపోటును, గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి లాభాలు చిరుధాన్యాల వల్ల కలుగుతాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

చిరుధాన్యాల సాగులో దేశంలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ చిరుధాన్యాల సాగుకు అనువైన వాతావరణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సమశీతోష్ణ వాతావరణం వల్ల ఏడాది పొడవునా చిరుధాన్యాలను సాగు చేయవచ్చని ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాదిలో లుథియానా, పంత్‌నగర్‌, హరియాణా, ఉదయ్‌పుర్‌, ఇండోర్‌ తదితర ప్రాంతాల్లో రబీ సీజన్‌లో శీతల వాతావరణం వల్ల చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్‌తోపాటు, వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే ఉత్పత్తి (సీడ్‌ మల్టిప్లికేషన్‌) చేసి అక్కడికి సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా చిరుధాన్యాల్లో కొత్త వంగడాలపైనా ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి మంచి దిగుబడినిచ్చే రకాలను రూపొందించగలిగారు. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వాలు ఈ పంటలను ప్రోత్సహించేందుకు తగిన పెట్టుబడి రాయితీలు కల్పించడం లేదు. రైతులకు ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు నామమాత్రంగానే ఉంటున్నాయి.

ఎన్నో అనుకూలతలు

ఒకప్పుడు చిరుధాన్యాలతో కొన్ని ఆహార పదార్థాలనే వండుకొని తినేవారు. ఇప్పుడు వాటిని మిల్లింగ్‌ చేసే ఆధునిక యాంత్రాలు రావడం వల్ల అదనపు విలువ జోడించే అవకాశం కలుగుతోంది. రాగి బిస్కెట్లు, జొన్న పేలాలు, చిప్స్‌, పాలల్లో కలిపి తాగే చూర్ణంతోపాటు, ఆరోగ్యకరమైన చిరుతిళ్లనూ రూపొందించుకొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఐఎంఆర్‌ సరికొత్త ఆహార పదార్థాల్ని తయారు చేయడమే కాకుండా, ఈ రంగంలో ఆహార శుద్ధి అంకురాలను స్థాపించే వారిని ప్రోత్సహిస్తోంది. ఇతర పంటలతో పోలిస్తే మిల్లెట్ల సాగుకు అనేక అనుకూలతలు ఉన్నాయి. ఉష్ణ వాతావరణాన్ని తట్టుకొని మంచి దిగుబడినిచ్చే లక్షణం చిరుధాన్యాల సొంతం. భారత్‌లో ఏటా దాదాపు 1.7 కోట్ల టన్నుల చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 2020-21లో 87,558 టన్నులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాటి సాగు, ఉత్పత్తి పెరిగి ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు పడతాయి.

- జి.పాండురంగశర్మ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భవిష్యత్తుపై కోటి ఆశలతో...

‣ శాంతి జాడ ఎండమావే!

‣ ఈడీ... రాజకీయ అస్త్రమా?

‣ పెరగని పంట ఉత్పాదకత

‣ ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

‣ భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

Posted Date: 17-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని