• facebook
  • whatsapp
  • telegram

సేద్యంలో డ్రోన్ల విప్లవం

ఇటీవలి కాలంలో అనేక రంగాల్లో డ్రోన్ల వాడకం విస్తృతం అవుతోంది. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే వాటి వినియోగం పెరుగుతోంది. వ్యవసాయ రంగంలోనూ డ్రోన్లు సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.

ఆధునిక ఆవిష్కరణలు పలు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడుతున్నాయి. డ్రోన్లు ఈ కోవకే చెందుతాయి. రాబోయే రోజుల్లో కనీసం అయిదు లక్షల ఉద్యోగాలను అవి సృష్టిస్తాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఆధ్వర్యంలోని భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ పర్యవేక్షణ కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి గల అవకాశాలను ఆ నివేదిక వివరించింది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం చాలా ముఖ్యమైనది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోలిస్తే 2019-20 నాటికి స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో   18.29శాతం వాటాతో వ్యవసాయ రంగం 45.6శాతం ప్రజలకు ఉపాధి కల్పించినట్లు నివేదిక వెల్లడించింది. పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి కారణాలు ఆహారభద్రతకు సవాలుగా మారాయి. చిన్నచిన్న కమతాలు, అసమర్థ వ్యవసాయ పద్ధతులు, కొరవడిన రుణాల లభ్యత, మార్కెట్‌ సౌకర్యాల లేమి వంటి సవాళ్లను సాగు రంగం ఎదుర్కొంటోంది. మౌలిక సదుపాయాల కొరత వంటి కారణాలు వ్యవసాయరంగం సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. డ్రోన్లు వ్యవసాయ పద్ధతులను సమూలంగా మార్చే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

ఉపయోగాలెన్నో...

ప్రపంచంలోని పలు దేశాల్లో 20ఏళ్లుగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. గత అయిదు ఆరేళ్లుగా వాటి వినియోగం మరింతగా పెరిగింది. సాగు భూమి స్థితిగతులను అంచనా వేయడానికి, పంటలను పర్యవేక్షించడానికి, నీటిపారుదలను సమర్థంగా నిర్వహించడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. పంటలకు సోకే చీడపీడలను ముందుగానే అవి పసిగడతాయి. ఆధునిక సెన్సర్లను ఉపయోగించి మట్టిలోని నైట్రోజన్‌ స్థాయులను డ్రోన్లతో పర్యవేక్షించవచ్చు. డ్రోన్‌ సాంకేతికతలో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటివి కీలకపాత్ర పోషిస్తున్నాయి. వాటి సాయంతో రైతులు ఇంటి వద్ద ఉండి పొలంలోని పంటలను, దూర ప్రాంతాల్లోని తోటలను పర్యవేక్షించవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి డ్రోన్లను విరివిగా వాడుతున్నారు. జపాన్‌లో శాస్త్రవేత్తలు తేనెటీగల మాదిరిగా పూలను పరాగసంపర్కం చేసేందుకు సూక్ష్మ డ్రోన్లను రూపొందించారు. అమెరికా, ఇజ్రాయెల్‌, చైనా, జపాన్‌ దేశాలు డ్రోన్ల తయారీతో పాటు వాటి వినియోగంలోనూ ముందంజలో ఉన్నాయి.

ఇండియాలో రక్షణ రంగంతోపాటు వ్యవసాయం, భూముల సర్వే, మ్యాపింగ్‌, తనిఖీ, పర్యవేక్షణ, వినోదం, మీడియా రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, వివిధ రకాల వస్తువుల చేరవేతకు డ్రోన్లు సహాయపడతాయి. మానవ అవయవాలను వేగంగా రవాణా చేసేందుకూ తోడ్పడతాయి. తుపానులు, భూకంపాలు సంభవించిన తరవాత నష్టాన్ని అంచనా వేయడానికీ వాటిని వినియోగిస్తున్నారు. డ్రోన్ల వినియోగం పెరుగుతుండటంతో వాటి తయారీ, నిర్వహణ తదితరాలకు అవసరమైన నిపుణుల గిరాకీ అధికమైంది. ఇండియాలో డ్రోన్లను తయారుచేసే కంపెనీలు వందకు పైగా, సర్వీసు ప్రొవైడర్లు రెండు వందలకుపైగా, డ్రోన్‌ పైలట్లు లక్ష మంది ఉన్నట్లు భారత డ్రోన్‌ సమాఖ్య వెల్లడించింది. 2030 నాటికి డ్రోన్ల తయారీలో ఇండియాను ప్రపంచ కేంద్రంగా నిలపాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా డ్రోన్ల తయారీ సంస్థలను మరింతగా ప్రోత్సహించాలని చెబుతున్నారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖ దేశంలో డ్రోన్‌ చట్టాలు, నిబంధనలను సరళతరం చేసింది. దేశీయంగా డ్రోన్ల రంగం 2026 నాటికి దాదాపు రూ.15,000 కోట్ల వ్యాపారాన్ని సాధిస్తుందని ఆ శాఖ అంచనా వేసింది.

ప్రోత్సాహకాలు అవసరం

కేంద్ర ప్రభుత్వం నిరుడు ప్రారంభించిన పనితీరు అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ) దేశీయంగా డ్రోన్ల తయారీ కంపెనీలకు దన్నుగా నిలుస్తోంది. భారీ డిమాండ్‌, మార్కెట్‌ వృద్ధి దృష్ట్యా దేశీయంగా డ్రోన్ల తయారీ అంకుర సంస్థల సంఖ్య క్రమేణా అధికమవుతోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరగాలంటే ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇండియాలో చిన్న సన్నకారు రైతులే అధికం. డ్రోన్లను కొనుగోలు చేయడం వారి శక్తికి మించిన విషయమే. వారు సాగుచేసే కమతాల పరిమాణం సైతం తక్కువగా ఉన్నందువల్ల డ్రోన్లను వినియోగించలేరు. వాటి వాడకం పెరిగేకొద్దీ వ్యవసాయ కూలీల ఉపాధికీ ఆటంకం ఏర్పడవచ్చు. ఇలాంటి సమస్యలన్నింటిపై ప్రభుత్వాలు దృష్టి సారించి సరైన పరిష్కారాలు చూపాలి. ఎవరికీ నష్టం వాటిల్లకుండా, రైతులకు ప్రయోజనం కలిగేలా సాగు రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

‣ తైవాన్‌తో ఉపయుక్త బంధం

‣ తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

Posted Date: 07-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం