• facebook
  • whatsapp
  • telegram

వ్యర్థాల నిర్వహణలో సమస్యల మేట

దేశంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కొరడా ఝళిపిస్తోంది. వ్యర్థాల ఉత్పత్తికి బాధ్యులైన వారే పరిహారం చెల్లించాలన్న ప్రాతిపదికన రూ.4000 కోట్ల పర్యావరణ పరిహారం చెల్లించాలంటూ తాజాగా బిహార్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు తెలంగాణ, మణిపూర్‌ దిల్లీ, కర్ణాటకలపైనా పర్యావరణ పరిహారం విధించింది. వ్యర్థాల అశాస్త్రీయ నిర్వహణపై పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

గతంలో ఘనద్రవ వ్యర్థాల నిర్వహణ అంశాల్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించేది. 2014లో సుప్రీంకోర్టు ఆ బాధ్యతలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి బదిలీ చేసింది. 2016 నుంచి వ్యర్థాల నిర్వహణపై ఎన్జీటీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. సమస్యాత్మక అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తోంది. వ్యర్థాల నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలను నిర్దేశిస్తోంది. 2019లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో రాష్ట్రాల వారీగా సమావేశాలు నిర్వహించి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు చేపట్టాల్సిన అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ జారీ చేస్తున్న ఉత్తర్వులు వ్యర్థాల నిర్వహణలో రాష్ట్రాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రాల అలసత్వం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తోందని ట్రైబ్యునల్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

పెరుగుతున్న చెత్త కొండలు

దేశంలో ఘన వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గాడి తప్పిన పట్టణీకరణ, పెరుగుతున్న వినియోగ సంస్కృతి నగరాల్లో చెత్త కొండలను సృష్టిస్తోంది. దేశంలో రోజూ కోటీ యాభై లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతకన్నా అయిదురెట్లు ఎక్కువే చెత్త ఉత్పత్తి జరుగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనం స్పష్టం చేసింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో వీధుల్లో  పేరుకుపోతోంది. నగరాల్లో చెత్తను శివార్లలోని డంపింగ్‌ యార్డుల్లో పారబోస్తున్నారు. చెత్తలో 28 శాతమే శుద్ధికి నోచుకుంటోందని నివేదికలు వివరిస్తున్నాయి. మన దేశంలోని డంపింగ్‌ యార్డులు పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుల్లా ఉన్నాయని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ఘన వ్యర్థాలను శుద్ధి చేసి మళ్ళీ వినియోగించే ప్రక్రియ, శుద్ధి ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. టన్నుల కొద్ది పేరుకుపోతున్న చెత్త ఆధునిక శుద్ధి సాంకేతికతల వినియోగాన్ని కూడా క్లిష్టతరం చేస్తోంది. సరైన ప్రణాళిక లేని ద్రవవ్యర్థాల నిర్వహణ మూలంగా నగరాలను ముంచెత్తుతున్న మురుగు నీరు జలకాలుష్యం, తాగునీటి సమస్యలకు మూల హేతువవుతోంది. మురుగు నీరు పూర్తిస్థాయిలో శుద్ధికి నోచుకోకపోవడంతో, అదంతా జల వనరుల్లోకి చేరి కాలుష్యానికి, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోంది. మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ వహించడం లేదు. దేశంలో సగం మురుగు శుద్ధి కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశంలో భూగర్భ కాలువలకన్నా బహిరంగ మురుగు కాలువలే అధికం. వర్షాకాలంలో అవి నిండిపోయి రోడ్లు, వీధుల్లో మురుగునీరు ప్రవహించి రహదారుల ధ్వంసానికి, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. పారిశుద్ధ్య మెరుగుదలకు, వరద ముంపు కట్టడికి అనుకూలమైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.

‘ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016’కు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ మిషన్‌, స్వచ్ఛనగరం, మ్యాన్‌హోల్‌ టూ మెషీన్‌హోల్‌, అమృత్‌ వంటి పలు ప్రాయోజిత పథకాలను అమలు చేస్తున్నాయి. 2026 నాటికి నగరాలను చెత్తరహితంగా మార్చాలని కేంద్రం లక్షించింది. అయితే, ఫలితాల సాధన సంతృప్తికరంగా లేదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చాలా నగరాలు, గ్రామాలు పారిశుద్ధ్యపరంగా అధ్వానస్థితిలో ఉన్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు, పురపాలికలదేనని ఓ కేసులో ఎన్జీటీ స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల బడ్జెట్లలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం దక్కడం లేదు. వ్యర్థాల నిర్వహణకు తక్షణ బాధ్యత వహించవలసిన పురపాలికల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నిధులు, నిపుణులైన పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ప్రణాళికారాహిత్యం, అధికారులు, రాజకీయ నాయకత్వంలో సంకల్ప శుద్ధి కొరవడటం- ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో పురపాలికల వైఫల్యానికి ప్రధాన కారణాలు.

ప్రజల భాగస్వామ్యంతో..

చెత్త నుంచి సంపదను సృష్టించడంతోపాటు చెత్త కొండల్ని కరిగించే ఆధునిక సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాంట్లను నిర్మించడమే సరైన పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. చెత్త నుంచి నిర్మాణ రంగానికి ఉపకరించే ఇటుకలనూ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా తడి పొడి చెత్తను ఉత్పత్తి స్థానంలోనే వేరు చేసి శుద్ధిచేసే ప్రక్రియను ప్రోత్సహించాలి. మురుగునీటి సమస్య నివారణకు నగరాల్లో భూగర్భ కాలువలను నిర్మించాలి. వ్యర్థాల నిర్వహణకు పురపాలికలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలి. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. వ్యర్థాల నిర్వహణలో పౌర భాగస్వామ్యం అత్యంత కీలకం. ముఖ్యంగా రాష్ట్ర, నగర ప్రభుత్వాలకు వ్యర్థాల నిర్వహణ పట్ల చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి అవసరం. అప్పుడే వ్యర్థాల నిర్వహణ సక్రమ రీతిలో సాగి ఎన్జీటీ ఆదేశాలకు, సూచనలకు మన్నన దక్కుతుంది. ఘన ద్రవ వ్యర్థాల అశాస్త్రీయ నిర్వహణ వల్ల సంభవించే ఆర్థిక వృద్ధి క్షీణతను అధిగమించి నగరాలు, గ్రామాలు ఆర్థిక పురోగతిని, మానవ వనరుల అభివృద్ధిని సాధిస్తాయి.

జరిమానాలపై హెచ్చరిక

వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ‘ఘనద్రవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016’ ప్రాతిపదికన ఎన్జీటీ నిశితంగా పరిశీలించి విచారణ చేపడుతోంది. వ్యర్థాల నిర్వహణలో విఫలమైన రాష్ట్రాలకు విధించే పర్యావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, ఆ నిధిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో వ్యర్థాల నిర్వహణ దిద్దుబాటు చర్యలకే వినియోగించాలని ఆదేశించింది. జలాశయాల్లో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని, ఆ విషయంలో విఫలమైతే సంబంధిత పురపాలిక పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది. మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ధి ప్లాంట్లను ఉత్పత్తి పరిమాణం ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, ఉన్నవాటిని ఆధునికీకరించాలని పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ఘన వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించింది. రాష్ట్రాలు ప్రతి ఆరు నెలలకొకసారి వ్యర్థాల నిర్వహణపై నివేదికలు పంపాలని, ఇంకా ఉల్లంఘనలు కొనసాగితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవ వైవిధ్యంతోనే సుస్థిర అభివృద్ధి

‣ డిజిటల్‌ సాగుతో లాభాల పంట

‣ జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

Posted Date: 24-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం