• facebook
  • whatsapp
  • telegram

బ్రిక్స్‌ విస్తరణకు డ్రాగన్‌ ఆరాటం

వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కలయికగా అంతర్జాతీయ యవనికపైకి బ్రిక్స్‌ కూటమి దూసుకొచ్చింది. దాని విస్తరణ ప్రణాళికలపై త్వరలో చర్చలు జరపనున్నట్లు ప్రస్తుతం బ్రిక్స్‌ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికా ఇటీవల ప్రకటించింది. బ్రిక్స్‌పై పట్టు పెంచుకోవాలన్న చైనా ఆరాటమే విస్తరణపై చర్చలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా కలిసి 2009లో బ్రిక్‌ కూటమిగా ఏర్పడ్డాయి. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికా చేరికతో అది బ్రిక్స్‌గా మారింది. సభ్యదేశాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాల కోసం కూటమి కృషిచేస్తోంది. ఆయా దేశాలకు చెందిన అభివృద్ధి బ్యాంకుల మధ్య ఒప్పందాలను, స్థానిక కరెన్సీలో లావాదేవీలను (డాలరుపై ఆధారపడటం తగ్గించేలా) ప్రోత్సహిస్తోంది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్‌ దేశాల వాటా దాదాపు 42శాతం. అయినా, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)లలో వాటి ఓటింగ్‌ హక్కులు 15శాతం లోపే ఉన్నాయి. దాంతో ఆ సంస్థలకు పోటీగా బ్రిక్స్‌ దేశాలు 2014లో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)ను స్థాపించాయి. 2021లో బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఎన్‌డీబీలో చేరాయి. ఈజిప్టు, ఉరుగ్వేలకు సైతం ఎన్‌డీబీ సభ్యత్వం ఖరారైంది. మరోవైపు- బ్రిక్స్‌లో చేరేందుకు డజనుకు పైగా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ జాబితాలో సౌదీ అరేబియా, ఇరాన్‌, తుర్కియే, అఫ్గానిస్థాన్‌, అర్జెంటీనా, యూఏఈ, అల్జీరియా, ఈజిప్ట్‌, బహ్రెయిన్‌, ఇండొనేసియా వంటివి ఉన్నాయి. కూటమిలో చేరికపై స్పష్టమైన విధివిధానాలేవీ లేకపోవడంతో ఇప్పటివరకు వాటికి సభ్యత్వం దక్కలేదు.

పట్టు పెంచుకునే వ్యూహం

బ్రిక్స్‌ విస్తరణపై బీజింగ్‌ ఎన్నాళ్లుగానో ఉత్సుకత ప్రదర్శిస్తోంది. అందుకు పలు కారణాలున్నాయి. కూటమిలోని మిగిలిన నాలుగు సభ్యదేశాల జీడీపీ సంయుక్త విలువతో పోలిస్తే, ఒక్క చైనా జీడీపీయే రెట్టింపు కంటే అధికం. అయినా, కూటమిలో దాని మాట పూర్తిస్థాయిలో చెల్లుబాటు కావడం లేదు. తనతో సన్నిహితంగా మెలిగే మరికొన్ని దేశాలకు సభ్యత్వం ఇప్పించగలిగితే బ్రిక్స్‌పై ఆధిపత్యం సాధ్యమవుతుందన్నది బీజింగ్‌ వ్యూహం. ప్రాంతీయంగా ఇండియా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్‌ విస్తరణను పావుగా వాడుకోవాలన్నదీ చైనా ప్రణాళికల్లో భాగమే. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలో డాలరు పెత్తనాన్ని డ్రాగన్‌ సహించలేకపోతోంది. బ్రిక్స్‌ కూటమి విస్తరణతో దాని ప్రత్యామ్నాయానికి బాటలు పడతాయని ఆశిస్తోంది.  మరోవైపు- కొవిడ్‌తో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)కీ నిధుల కేటాయింపు తగ్గింది. ఫలితంగా ఇదివరకటిలా ప్రాజెక్టుల రూపంలో భారీగా పెట్టుబడులు గుమ్మరించి ఆయా దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకే బ్రిక్స్‌ వంటి కూటముల్లో మిత్రదేశాలకు సభ్యత్వం ఇప్పించడం ద్వారా తనను అగ్రశక్తిగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నిరుడు బ్రిక్స్‌ అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడే విస్తరణపై చైనా చర్చలు ప్రారంభించింది. సౌదీ, ఇరాన్‌ వంటి దేశాలను చేర్చుకుంటే కూటమికి అనేక ప్రయోజనాలుంటాయని పదేపదే చెబుతోంది. బ్రిక్స్‌ విస్తరణతో ప్రపంచ చమురు నిల్వల్లో 45శాతం, గ్యాస్‌ రిజర్వుల్లో 60శాతం ఈ కూటమి పరిధిలోకి వస్తాయంటూ ఊరిస్తోంది. ఇతర దేశాల కలయిక వల్ల కూటమిలో తమ ప్రభావం తగ్గుతుందేమోనన్న ఆందోళనతో ఇతర సభ్యదేశాలు విస్తరణకు ఇన్నాళ్లూ మొగ్గు చూపలేదు. అయితే, పరిస్థితుల్లో కొంతకాలంగా మార్పు కనిపిస్తోంది. బ్రిక్స్‌ విస్తరణతో పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశాలు మెరుగు పడతాయన్న భావన రష్యాలో కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ సైతం కొత్త దేశాలను కలుపుకొనేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.

విధివిధానాలు కీలకం

బ్రిక్స్‌ విస్తరణకు ఇండియా విముఖమేమీ కాదు. సిఫార్సులతో కాకుండా, నిర్దిష్ట విధివిధానాల ద్వారా సభ్యత్వం ఇవ్వాలని భారత్‌ వాదిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో నిర్దేశిత స్థాయిని అందుకున్న దేశాలను ఏకాభిప్రాయ సాధన ద్వారా చేర్చుకోవడం మేలని సూచిస్తోంది. సిఫార్సుల విధానం వైపు మొగ్గితే- పాకిస్థాన్‌ వంటి దేశాలనూ బ్రిక్స్‌లోకి బీజింగ్‌ తీసుకొచ్చే ముప్పుందన్నది దిల్లీ ప్రధాన ఆందోళన. బ్రిక్స్‌ అనేది వేగంగా విస్తరిస్తున్న విపణులను కలిగిన వర్ధమాన దేశాల కూటమి. విస్తరణ పేరుతో బలహీన ఆర్థిక వ్యవస్థలను చేర్చుకుంటే కూటమి మౌలిక స్వరూపం దెబ్బతింటుంది. పరస్పర శత్రు దేశాలైన సౌదీ, ఇరాన్‌లు రెండూ బ్రిక్స్‌లో ఉండాలని చైనా కోరుకుంటోంది. వాటి మధ్య కలహాలు కూటమి లక్ష్యాలను నీరుగార్చే ప్రమాదం ఉంది. తన మిత్ర దేశాలైన పాక్‌, మెక్సికో వంటి వాటికీ బ్రిక్స్‌ సభ్యత్వం ఇప్పించాలని బీజింగ్‌ ప్రయత్నిస్తోంది. అదే జరిగితే బ్రిక్స్‌ సైతం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) తరహాలో చైనా కేంద్రీకృత కూటమిగా మారుతుంది. అభివృద్ధి, సహకార అజెండా పక్కదోవ పట్టి, బీజింగ్‌ రాజకీయ ప్రయోజనాలను రక్షించే వేదికగా అది తయారయ్యే ప్రమాదం ఉంది.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దయనీయ స్థితిలో దాయాది

‣ ఈసారైనా జనగణన చేపడతారా?

‣ సామాజిక న్యాయమే ప్రపంచ గమ్యం

‣ చైనా - ఇరాన్‌ సహకారంలో చిటపటలు

‣ అమ్ముల పొదిలో కృత్రిమ మేధ

‣ త్రైపాక్షిక సహకారంతో వ్యూహాత్మక ముందడుగు

Posted Date: 25-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం