• facebook
  • whatsapp
  • telegram

భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు 

నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇటీవలే భారత్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యపోరు అంతకంతకు ఎక్కువవుతోంది. భవిష్యత్తులో ఇటలీ ఇక్కడ కీలకంగా మారనుండటం భారత్‌కు కలిసివచ్చే అంశం.

ఇండియా-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలది 75 ఏళ్ల చరిత్ర! 2018లో ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా నాటి ఇటలీ ప్రధాని కాంటే భారత్‌లో పర్యటించారు. అనంతరం 2020లో జరిగిన వర్చువల్‌ సమావేశాల్లో పలు రంగాలలో పరస్పర సహకారానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1,500 కోట్ల డాలర్లకు చేరడంతో పాటు భారత్‌కు ఐరోపా సమాఖ్యలోని ప్రధాన వాణిజ్య భాగస్వామి ఇటలీయే కావడం విశేషం.

రక్షణ, భారీ యంత్ర సామగ్రి తయారీ, ఆహార తయారీ ప్రక్రియ, వ్యవసాయం వంటి రంగాలలో ఇటలీ ముందంజలో ఉంది. భారత్‌కు ఇటలీ ఎగుమతుల్లో దాదాపు 35శాతం వరకు యంత్ర సామగ్రే ఉంటోంది. ఆ దేశం నుంచి రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయితే ‘భారత్‌లో తయారీ’ మరింతగా జోరందుకుంటుంది. 2021లో అప్పటి భారత సైన్యాధిపతి జనరల్‌ నరవణె ఇటలీలో పర్యటించిన సమయంలో పరస్పర సైనిక సహకారంపై ఉభయదేశాల మధ్య చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఉగ్రవాద కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేశాయి. తాజాగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలపై భారత్‌ తాజాగా నిర్వహించిన బహుళపక్ష సమావేశాల (రైసినా డైలాగ్‌-2023) సందర్భంగా ప్రధానులు మోదీ, జార్జియా మెలోనీల మధ్య కీలక చర్చలు జరిగాయి. అనంతరం ఇటలీతో రక్షణ సంబంధాలను మరింతగా పెంపొందించుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరుదేశాలు సైనిక బలగాల ఆధునికీకరణకు, సంయుక్త విన్యాసాలకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని తలపోశాయి. ‘స్టార్టప్‌ బ్రిడ్జ్‌’ పేరిట కొత్త అంకుర సంస్థలను ప్రోత్సహించాలనీ నిర్ణయించాయి. ఇండియా-ఇటలీ వాణిజ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన వనరులదే సింహభాగం. ఐరోపాలో యూకే, నెదర్లాండ్స్‌ తరవాత ఇటలీలోనే భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయ ఐటీ సంస్థలు సైతం అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐరోపా ఉత్పత్తి రంగంలో రెండో స్థానంలో ఉన్న ఇటలీ- అంతర్జాతీయ సరఫరా గొలుసుల కేంద్రంగా ఉంటోంది. ఆసియా, ఆఫ్రికాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఇటలీతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పెంపొందడం భారత్‌కు కలిసివచ్చే అంశమే. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇటలీ ఆలస్యంగా ప్రవేశించినా భవిష్యత్తులో కీలకపాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ తదితర ఐరోపా దేశాలు ఈ ప్రాంతంపై వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించాయి. 2021లో ఇండియా-ఇటలీ-జపాన్‌ త్రైపాక్షిక భాగస్వామ్యం ఆరంభమైంది. ఇందులో భాగంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇటలీ కీలకంగా వ్యవహరించనుంది. ఎర్రసముద్రం, మధ్యధరా సముద్రాలను కలిపే బాబ్‌ఎల్‌మందెబ్‌ జలసంధి వద్ద జిబూటీలో ఇటలీకి నౌకాదళ స్థావరముంది. భారత్‌కు ఇక్కడి నుంచి సహకారం అందుతోంది.ముఖ్యంగా సముద్రపు దొంగలు, చైనా నౌకాదళ కదలికలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇటలీ భారత్‌తో పంచుకుంటోంది. బాబ్‌ఎల్‌మందెబ్‌, సూయజ్‌కాలువల గుండా ఐరోపాను త్వరగా చేరుకోవచ్చు. అందుకే ఈ మార్గంలో ప్రపంచ వాణిజ్యం భారీగా సాగుతోంది. జిబూటీలో చైనాకూ సైనిక స్థావరం ఉన్నా, ఇటలీ సహకారంవల్ల భారత వాణిజ్య నౌకలకు పూర్తి రక్షణ లభిస్తోంది.

హిందూ మహాసముద్రంలోని సెషెల్స్‌ దీవుల్లో భారత సైనిక స్థావర నిర్మాణంపై చర్చలు పూర్తికాలేదు. ఇవి కొలిక్కివస్తే హిందూ మహాసముద్రంలో చైనా దళాల కదలికలపై నిఘా పెట్టడం భారత్‌కు సాధ్యమవుతుంది. అంతవరకు జిబూటీలోని ఇటలీ నౌకాస్థావరం తోడ్పాటుతో హిందూ మహాసముద్రంతో పాటు ఎర్రసముద్రంపైనా భారత్‌కు పట్టు లభిస్తుంది. తైవాన్‌పై డ్రాగన్‌ ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిని ఇటలీ ఖండించింది. ఇటలీ నౌకాదళం పూర్తిస్థాయిలో ఇండో-పసిఫిక్‌లో మోహరిస్తే ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లతో కూడిన చతుర్భుజ కూటమికి మరింత బలం చేకూరనుంది. రానున్నకాలంలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను ఇండో-పసిఫిక్‌ ప్రాంతం నిర్దేశిస్తుందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక్కడ చైనా నౌకాదళ సంచారం బాగా పెరిగింది. ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ దేశ కార్యకలాపాలను మరింతగా నిలువరించే అవకాశం ఉంటుంది.

- శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

‣ బ్రిక్స్‌ విస్తరణకు డ్రాగన్‌ ఆరాటం

‣ దయనీయ స్థితిలో దాయాది

‣ ఈసారైనా జనగణన చేపడతారా?

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం