• facebook
  • whatsapp
  • telegram

మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

సంక్షోభాల ప్రభావం పురుషులకన్నా స్త్రీలు, బాలికలపైనే అధికంగా ఉంటుంది. వారి ఆరోగ్యం, భద్రత, జీవనాధారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. సమాజంలో మహిళల పాత్ర, లింగ సమానత్వం పట్ల అత్యధిక శ్రద్ధాసక్తులు కనబరచాల్సిన తరుణంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది.

జీ20 అధ్యక్ష పదవిని భారత్‌ చాలా సంక్లిష్ట సమయంలో భుజాలకు ఎత్తుకుంది. ఇది సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి అనువైన సందర్భం. గత మూడేళ్లుగా కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం, ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలని ప్రపంచ దేశాలు నడుం కట్టిన సమయమిది. ముఖ్యంగా కరోనా విజృంభణ, ఎడతెగని రష్యా-ఉక్రెయిన్‌ పోరు ప్రపంచ దేశాలను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాయి. మహిళలపై వాటి ప్రభావం మరింతగా ఉంది. వాటి వల్ల వారి ఉపాధులు, భద్రత దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలకు ఆర్థిక సహాయం, రుణ సదుపాయం పెరగాలని, ఎక్కువమంది మహిళా కార్మికులు, ఉద్యోగినులు పనిపాటల్లో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. స్త్రీలలో కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించే వ్యవస్థాపక వర్గం ఆవిర్భవించాలని ఆయన అభిలషిస్తున్నారు. అందుకు ప్రభుత్వ పరంగా చేయూతను అందిస్తున్నారు.

నిర్దిష్ట కార్యాచరణ అవసరం

ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట చేపట్టిన అభివృద్ధి అజెండాలో స్త్రీలు, బాలికలు అన్ని దశల్లో సంపూర్ణ వికాసం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతోంది. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం వల్ల 2014 నుంచి లింగ నిష్పత్తిలో 16 పాయింట్ల వృద్ధి కనిపించింది. సూక్ష్మ రుణ సౌకర్యం అందించే ముద్రా పథకం లబ్ధిదారుల్లో 70శాతం మహిళలే. 1.2 కోట్ల మంది గర్భవతులు, బాలింతలకు మిషన్‌ పోషణ్‌   2.0 కింద పౌష్టికాహారం అందింది. ఉద్యోగినులకు హాస్టళ్లు, యువతులకు నైపుణ్య శిక్షణ, వారి భద్రత కోసం ప్రత్యేక పథకాలు అమలులోకి వచ్చాయి. మహిళలకు సురక్ష (భద్రత), సువిధ (వసతులు), స్వాభిమాన్‌ (స్వాతంత్య్రం) కల్పించడమే ధ్యేయంగా మోదీ సర్కారు ముందుకు సాగుతోంది. స్త్రీకి భారత సంస్కృతీ నాగరికతల్లో విశిష్ట స్థానం ఉంది. ఆధునిక యుగంలోనూ సామాజిక రూపాంతరంలో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం గుర్తించింది. మహిళలు అభివృద్ధికి చోదక శక్తులు, మార్పునకు సారథులు. వారిని కేవలం అభివృద్ధి ఫలాలను అనుభవించే లబ్ధిదారులుగా పరిగణించకూడదు. 2023లో జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న భారత్‌ ఇంతవరకు సాధించిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవడంపై శక్తియుక్తులు కేంద్రీకరించాలి. మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండాను సమర్థంగా అమలు చేయాలి. ఒక రంగంలో లింగ దుర్విచక్షణ మిగతా అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతుంది. అభివృద్ధిని వెనక్కు లాగుతుంది. అందువల్ల జీ20 అజెండాలో లింగ సమానత్వానికి ప్రాధాన్యం కల్పించి, చిత్తశుద్ధితో ఆచరణలోకి తీసుకురావాలి. కింది విభాగాల్లో నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి.

ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు చురుగ్గా పాలుపంచుకొనే సామర్థ్యాన్ని ప్రభుత్వాలు వారికి అందించాలి. విద్య స్త్రీలకు సాధికారత చేకూరుస్తుందని ప్రపంచమంతా గుర్తిస్తున్నా, ప్రాథమిక విద్యలో 49శాతం దేశాలు మాత్రమే లింగ సమానత్వం సాధించాయి. 42శాతం దేశాలు దిగువ మాధ్యమిక స్థాయిలో, 24శాతం దేశాలు ఉన్నత మాధ్యమిక స్థాయిలో లింగ సమానత్వం సాధించాయి. ప్రపంచమంతటా 110 కోట్ల బాలికలు, స్త్రీలు సాధికార ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉన్నారు. వారిలో చాలామందికి పూర్తిస్థాయిలో డిజిటల్‌ సాంకేతికతలు లభ్యం కావడం లేదు. ఎక్కువమంది మహిళలు జీతం లేకుండానే చాకిరీ చేస్తున్నారు. సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. జీవితంలో, పనిలో మహిళలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక అడ్డంకులను తొలగించడానికి ఒక సమగ్ర కార్యక్రమాన్ని జీ20 దేశాలు ఏకాభిప్రాయంతో రూపొందించి అమలు చేయాలి.

నేరుగా ఫలాలు దక్కేలా...

ప్రస్తుతం ఇండియాలో పాలన సంబంధ ఉద్యోగాల్లో 1.90 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 17,000 మంది పంచాయతీరాజ్‌ పదవులకు ఎన్నికయ్యారు. పది వేల మంది మహిళలు రక్షణ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యలను వారు వీక్షించే పద్ధతి పురుషులకన్నా భిన్నంగా ఉంటుంది. వారి అనుభవాలు, నాయకత్వ శైలులు సైతం భిన్నమే. కాబట్టి, వారు తీసుకునే నిర్ణయాలు విలక్షణంగా ఉంటాయి. అందువల్ల విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళా భాగస్వామ్యం చక్కని ఫలితాలనిస్తుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే సాధించిన ఫలితాలను పదిలపరచుకోవాలి. వాటి పునాదిపై మరిన్ని విజయాలు సాధించాలి. వివిధ రంగాల సమాచారంలో మహిళలకు సంబంధించిన డేటాను వేరుగా విశ్లేషించాలి. అవసరమైనప్పుడు అదనపు సమాచారం సేకరించాలి. లింగ సమానత్వ సాధనకు అడ్డుపడుతున్న అంశాలేమిటో గుర్తించడానికి ఈ సమాచార విశ్లేషణ ఉపకరిస్తుంది. ఆ లోపాలను పరిహరించి మహిళలకు ఉద్దేశించిన పథకాల ఫలాలు నేరుగా వారికే చేరేలా జాగ్రత్తపడవచ్చు. తద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు. గత మూడేళ్లుగా వివిధ సంక్షోభాలు అంతర్జాతీయ సమాజం ఉమ్మడి లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడ్డాయి. ఈ లోపాలను అధిగమించి సరికొత్త ఉమ్మడి అజెండాను రూపొందించడానికి భారత్‌ జీ20 అధ్యక్ష హోదాలో కృషిచేయనుంది. మహిళలకు సముచిత ప్రాధాన్యమిస్తూ అభివృద్ధిలో మరిన్ని శిఖరాలను అందుకోవడానికి పాటుపడనుంది. ఈ మహా యజ్ఞంలో జీ20 దేశాలను కలుపుకొని పోనుంది.

ఆర్థిక సాధికారతకు బాటలు

ప్రపంచవ్యాప్తంగా 42శాతం మహిళలు, బాలికలు సాధికార ఆర్థిక వ్యవస్థకు బయటే ఉన్నారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా లింగపరమైన అంతరాలు పూడటం లేదు. మహిళలు వేగంగా ఆర్థిక సాధికారత సాధించడానికి ఐటీ, కమ్యూనికేషన్లు తోడ్పడతాయి. మహిళలకు ఈ డిజిటల్‌ సాంకేతికతలు, డిజిటల్‌ విద్యావకాశాలు పూర్తి స్థాయిలో లభించడం లేదు. జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ (జామ్‌) త్రయం ద్వారా డిజిటల్‌ మార్గంలో మహిళలకు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కల్పించాలని భారత ప్రభుత్వం నడుంకట్టింది. మహిళల ఆర్థిక సాధికారతకు జామ్‌ త్రయం బాటలు వేసింది. వివిధ సామాజిక భద్రతా కార్యక్రమాలు మహిళలకు నేరుగా చేరడానికి తోడ్పడింది. స్త్రీలు డిజిటల్‌, ఆర్థిక సాధికారతను, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో జీ20 దేశాలకు భారత్‌ అనుభవం తోడ్పడుతుంది. దాన్ని అవి సద్వినియోగం చేసుకోవాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

‣ బ్రిక్స్‌ విస్తరణకు డ్రాగన్‌ ఆరాటం

‣ దయనీయ స్థితిలో దాయాది

‣ ఈసారైనా జనగణన చేపడతారా?

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం