• facebook
  • whatsapp
  • telegram

విస్తరణ కాంక్షతో చెలరేగుతున్న చైనా

వాస్తవాధీన రేఖ వెంట తరచూ కయ్యానికి దిగుతున్న చైనా- భారత్‌కు తలనొప్పిగా మారింది. తీవ్ర విస్తరణ వాదంతో చెలరేగిపోతూ అగ్రరాజ్యం అమెరికాకే అది సవాలు విసురుతోంది. తాజాగా డ్రాగన్‌ రక్షణ బడ్జెట్‌ మరోసారి భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) దూకుడుపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డ్రాగన్‌ దేశం వరసగా ఎనిమిదోసారి తన రక్షణ బడ్జెట్‌ను పెంచడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిరుటితో పోలిస్తే తాజాగా చైనా రక్షణ పద్దు 7.2శాతం పెరిగి, 22,500 కోట్ల డాలర్లకు చేరింది. ఇటీవలి బడ్జెట్లో భారత రక్షణ రంగానికి కేంద్రం రూ.5.94 లక్షల కోట్లు (7,260 కోట్ల డాలర్లు) కేటాయించింది. ఇండియాతో పోలిస్తే చైనా రక్షణ పద్దు మూడింతలు. కొద్ది కాలంగా ప్రపంచంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న డ్రాగన్‌- అమెరికాతో పోటీ పడుతోంది. భారత సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది. సైనిక సాంకేతికత పరంగానూ రెండు దేశాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజింగ్‌ రక్షణ బడ్జెట్‌ పెరగడం ఇండియాకు చీకాకు కలిగించే విషయమే.

చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నిర్దేశించిన శతాబ్ది లక్ష్యాలకు అనుగుణంగా బీజింగ్‌ రక్షణ వ్యయం పెరుగుతోంది. 2027 నాటికి ప్రజా విమోచన సైన్యాన్ని, 2035 నాటికి అన్ని జాతీయ రక్షణ, సాయుధ బలగాలను ఆధునికీకరించాలని డ్రాగన్‌ లక్షించింది. చైనా విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేక పవనాలను వీస్తున్నాయి. దాని విస్తరణ కాంక్షను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు స్వదేశీ ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల ఆధునికీకరణకు సంబంధించి పరిశోధన, అభివృద్ధిపై బీజింగ్‌ పెద్దమొత్తంలో వ్యయం చేస్తోంది. ఆ ఖర్చులకు సంబంధించి చైనా పారదర్శకత పాటించదు కాబట్టి, అసలు వ్యయం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సైన్యం ఆధునికీకరణ చైనాను పటిష్ఠంగా మార్చడంతోపాటు ఆర్థికంగానూ దానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది. సైన్యం నవీకరణపై అధికంగా దృష్టి సారించడం వల్ల ప్రపంచ ఆయుధ వ్యాపారంలో చైనా ప్రధాన దేశంగా అవతరించింది. చాలా ఏళ్లుగా సంప్రదాయ ఆయుధాలనే ఎగుమతి చేస్తున్న డ్రాగన్‌- దశాబ్ద కాలంగా ఇతర ప్రధాన ఆయుధాల పంపిణీదారుగానూ అవతరించింది. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ సంస్థ (సిప్రీ) లెక్కల ప్రకారం 2010-20 మధ్య కాలంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీల తరవాత చైనా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. డ్రాగన్‌ సైనిక ఆధునికీకరణ వాషింగ్టన్‌కూ ఆందోళన కలిగించే విషయమే. చైనా ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండటం ఇప్పటికే అగ్రరాజ్యంగా అవతరించిన అమెరికాకు విఘాతకరమే. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతకూ అది ప్రమాదకరంగా మారుతుంది. చైనా ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మూడో బలమైన సైనిక శక్తిగా ఎదిగింది.

దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో ప్రాదేశిక వివాద జ్వాలలనూ డ్రాగన్‌ ఎగదోస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో తాను నిర్మించిన పలు మానవ నిర్మిత దీవుల్లో కనీసం మూడింటిని చైనా భారీగా సైనికీకరించింది. ఆయా దీవుల్లో నౌకా, విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలు, లేజర్‌, జామింగ్‌ పరికరాలు, ఫైటర్‌ జెట్‌లను బీజింగ్‌ మోహరించింది. దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్‌  వాదనలను వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్‌, బ్రునై, తైవాన్‌లు తిప్పికొడుతున్నాయి. తూర్పు చైనా సముద్రంలోనూ బీజింగ్‌కు జపాన్‌తో ప్రాదేశిక తగాదాలున్నాయి. తైవాన్‌ను సైతం చైనా తనదిగానే చెప్పుకొంటోంది. వాస్తవాధీన రేఖ వెంట అది తరచూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ఇండియాకు చిరకాల మిత్ర దేశం రష్యా సైతం ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల దృష్ట్యా వ్యూహాత్మకంగా డ్రాగన్‌కు చేరువవుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు దీటుగా భారత్‌ సైనికంగా శక్తిమంతం కావాలి. శస్త్రాస్త్రాల పరంగా స్వావలంబన సాధించాలి.

- నీరజ్‌ కుమార్‌ సైబేవార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళా సమానత్వమే పరమావధి

‣ ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి జోరు

‣ సముద్ర సహకారంలో చెట్టపట్టాల్‌!

‣ భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం