• facebook
  • whatsapp
  • telegram

చిన్న పరిశ్రమల వృద్ధితోనే ఆత్మనిర్భరత

దేశార్థికానికీ ఊతం

అధిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలతోపాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం అమోఘ సాధనం. బ్రిటిష్‌ వలస పాలనలో దారుణంగా దెబ్బతిన్న ఈ రంగం స్వాతంత్య్రానంతరం గణనీయ పురోగతి సాధించింది. భారత్‌లో చిరకాలం నుంచి పరిఢవిల్లిన కుటీర పరిశ్రమలను నాశనం చేసిన బ్రిటిష్‌వారు- తమ యంత్ర ఉత్పత్తులను మనపై రుద్దడం ద్వారా దేశార్థికానికి, భారతీయులకు తీరని హాని కలిగించారు. ఒకప్పుడు గ్రీస్‌, రోమన్‌ సామ్రాజ్యాలకు మేలిమి వస్త్రాలను ఎగుమతి చేసిన భారతదేశం వలస పాలనలో ఆ వైభవాన్ని కోల్పోవడానికి కారణం- మన జౌళి ఎగుమతులపై బ్రిటిష్‌ వాళ్లు విపరీతమైన సుంకాలు విధించడమే. భారతదేశాన్ని కేవలం ముడి సరకుల ఎగుమతిదారు స్థాయికి దిగజార్చి... బ్రిటన్‌లో యంత్రాలపై తయారైన వస్తువులను భారతీయులకు అధిక ధరలకు అంటగట్టేవారు. అది స్థానిక కుటీర పరిశ్రమలను, చేతివృత్తులవారిని ఎన్నటికీ కోలుకోకుండా దెబ్బతీసింది. వలస పాలకులు మన దేశంలో నిర్మించిన రైల్వే యంత్రాంగం ద్వారా తమ సరకులను భారత్‌లో మూలమూలలకూ రవాణా చేసి విక్రయాలు పెంచుకున్నారు. భారతీయ ఉత్పత్తులకు అదే స్థాయిలో మార్కెట్‌ లభ్యమయ్యేది కాదు. ఈ విధంగా మౌలిక వసతుల లేమి, యంత్ర ఉత్పత్తుల నుంచి తీవ్రమైన పోటీ, వలస పాలకుల దుర్విచక్షణాపూరిత వ్యాపార విధానం కలగలిసి భారతీయ కుటీర పరిశ్రమలను, హస్తకళాకారులనూ దారుణంగా దెబ్బతీశాయి. భారతదేశ ఆర్థిక వెన్నెముకను విరిచేశాయంటే అతిశయోక్తి కాదు.

ప్రోత్సాహం తప్పనిసరి

బ్రిటిష్‌ వలస ప్రభుత్వం 1905లోనే వాణిజ్యం, పరిశ్రమల శాఖను ఏర్పరచినా- అది ప్రధానంగా ఇంగ్లాండ్‌లోని పరిశ్రమలకు ఇక్కడ ఉన్నదంతా దోచిపెట్టడానికే పనిచేసింది. భారతదేశ పారిశ్రామిక, వాణిజ్య ప్రగతికి అది చేసింది సున్నా. భారతీయ విద్యావంతులు, స్వాతంత్య్ర సమర యోధుల ఆందోళనను పురస్కరించుకుని 1940లో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా బోర్డును ఏర్పాటు చేసినా... అది కేవలం కంటితుడుపు చర్యే. స్వాతంత్య్ర ఉద్యమ ఉద్ధృతిలో స్వదేశీ పారిశ్రామికవేత్తలు దేశాభ్యుదయానికి 1944లో ‘బోంబే ప్రణాళిక’ను రూపొందించారు. వారిని బుజ్జగించడానికి 1946లో బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశానికి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినా- అది ఆరో వేలుగానే మిగిలింది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత 1948లో ప్రకటించిన మొట్టమొదటి పారిశ్రామిక విధానం... చిన్న పరిశ్రమలను సహకార సంఘాల తరహాలో అభివృద్ధి చేయాలని లక్షించింది. 1956నాటి పారిశ్రామిక విధానం గ్రామీణ, కుటీర, చిన్న పరిశ్రమలకు ఊతమివ్వాలని పేర్కొంది. ఆ తరవాత వెలువడిన పారిశ్రామిక విధానాలు ఏవో చిన్న మార్పుచేర్పులతో సరిపెట్టగా, 1991నాటి పారిశ్రామిక విధానం అసలు సిసలు సంస్కరణలను ప్రతిపాదించింది. 1997 పారిశ్రామిక విధానం చిన్న పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా వర్గీకరించింది. 2006నాటి ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి చట్టం నిర్దిష్ట విధానాలతో ముందుకొచ్చింది. 2020లో ఆత్మనిర్భర్‌ పథకంలో ఎంఎస్‌ఎంఈ వర్గీకరణకు కొత్త ప్రమాణాలను ప్రతిపాదించారు. స్వాతంత్య్రం వచ్చాక ఎంఎస్‌ఎంఈ రంగం గణనీయ విజయాలు నమోదు చేసింది. 2015-16లో ఈ రంగం 11.10 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని 73వ జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. విధానపరంగా మరింత ప్రోత్సాహం లభిస్తే ఈ రంగం మరెన్నో అద్భుత విజయాలను సాధించగలదు.

పటిష్ఠ కార్యాచరణ ముఖ్యం

భారతీయ ఎంఎస్‌ఎంఈ రంగం అంతర్జాతీయ విపణిలో రాణించే స్థాయికి ఎదగాలంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాలి. దీనికోసం న్యూజిలాండ్‌, నార్వే, కెనడా వంటి దేశాల్లో అనుసరిస్తున్న విశిష్ట వ్యాపార గుర్తింపు (యూబీఐ) విధానాన్ని భారతదేశమూ చేపట్టాలి. యూబీఐ వల్ల సానుకూల వ్యాపార వాతావరణం నెలకొంటుంది. ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు అధునాతన సాంకేతికతలు అందించడం, డిజిటలీకరణ, వ్యాపార సమాచార పంపిణీ, అంతర్జాల అనుసంధానం కోసం కేంద్రం రాష్ట్రాలు చేయీచేయీ కలిపి పనిచేయాలి. ఈ అంశాల్లో ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు తోడ్పడే భారీ పరిశ్రమలు, వ్యాపారాలకు కేంద్రం తగిన ప్రోత్సాహకాలు అందించాలి. భారీ సంస్థలు తమ సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలను ఎంఎస్‌ఎంఈలతో పంచుకోవాలి. వాటికి సరైన మార్గదర్శకత్వం అందించాలి. ఆర్థికంగా, మార్కెట్‌కు సరకుల రవాణాపరంగా తగిన వెసులుబాటు కల్పించాలి. భారీ పరిశ్రమలు ఈ బాధ్యత నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు భారం తగ్గుతుంది. దీనికి ప్రతిగా భారీ పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రభుత్వం ఇతోధిక ప్రత్యుపకారం చేయాలి. ఎంఎస్‌ఎంఈ రంగం కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతోపాటు ఆర్థిక నిర్వహణ నైపుణ్యాన్నీ అలవరచుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూత ఇవ్వాలి. ఆర్థిక, సాంకేతిక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను పుణికిపుచ్చుకోవాలి. కార్మిక చట్టాలను సంస్కరించి, ఉత్పాదకత వృద్ధికి తోడ్పడే నవీకరణలను ప్రోత్సహించి, వ్యాపార సౌలభ్యాన్ని పెంచాలి. చట్టపరంగా, పాలనా పరంగా లొసుగులను తొలగించి ఎంఎస్‌ఎంఈలు చురుగ్గా వ్యాపారం చేయడానికి తోడ్పడాలి. కేంద్రం, రాష్ట్రాలు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలి. ఎంఎస్‌ఎంఈ రంగం ప్రపంచ విపణిలో సమర్థంగా పోటీపడగల స్థాయికి ఎదగడానికి చేయూత ఇవ్వాలి. అది యావత్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊపు తెస్తుంది.

బంగ్లా చూపుతున్న బాట

బంగ్లాదేశ్‌ వేగంగా ఆర్థిక ఫలితాలు సాధించడానికి మొదట్లో భారీ పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహించింది. ప్రపంచ విపణిలో పోటీపడగల నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసే సౌలభ్యం భారీ సంస్థలకు ఎక్కువగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టి, తమ బ్రాండ్లకు ప్రాచుర్యం కల్పించి, మార్కెట్‌ను విస్తరించుకునే సత్తా కూడా వాటికి ఉంటుంది. బంగ్లాదేశ్‌లో భారీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు అభివృద్ధి చెందాక తమకు వివిధ సరకులు, విడిభాగాలను అందించగల సరఫరాదారుల కోసం అన్వేషించసాగాయి. ఎంఎస్‌ఎంఈ యూనిట్లు క్రమంగా భారీ సంస్థలకు సరఫరాదారులుగా వర్ధిల్లసాగాయి. ఫలితంగా అటు భారీ పరిశ్రమలు, ఇటు చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. బంగ్లాలో శ్రామికశక్తి చౌకగా లభ్యమవుతుంది కాబట్టి, విదేశీ మార్కెట్లలోకి బంగ్లా ఉత్పత్తులు వేగంగా చొచ్చుకెళ్లాయి. అభివృద్ధిలో దిగువ అంచెలో ఉన్న దేశాలను ఎల్‌డీసీలుగా వర్గీకరిస్తారు. ఈ వర్గంలోకి వచ్చే దేశాల ఎగుమతులను ఐరోపా సమాఖ్య (ఈయూ) సుంకం లేకుండా తమ మార్కెట్‌లోకి అనుమతిస్తుంది. దీన్ని బంగ్లా పరిశ్రమలు చక్కగా ఉపయోగించుకుని వేగంగా వృద్ధి చెందాయి. బంగ్లా ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఈ సౌకర్యాన్ని కోల్పోతుంది. ఆ రోజు వచ్చేలోపే తన మార్కెట్‌ను ఈయూ నుంచి ప్రపంచమంతటికీ విస్తరించడానికి బంగ్లాదేశ్‌ సమాయత్తమవుతోంది. ఈయూకు సుంకాలు చెల్లించిన తరవాత సైతం అక్కడి మార్కెట్‌లో తన వస్తువులకు గిరాకీ పెరిగేలా నాణ్యతపై, సాంకేతికతపై దృష్టి కేంద్రీకరిస్తోంది. బంగ్లా అనుభవం నుంచి భారతీయ ఎంఎస్‌ఎంఈ రంగమూ పాఠాలు నేర్చి, ప్రపంచమంతటికీ విస్తరించాలి.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొగబారుతున్న నగరాల ఆరోగ్యం

‣ అణ్వాయుధ నిరోధంపై ఐక్యగళం

‣ సేంద్రియ సాగుకు ప్రోత్సాహమే కీలకం

‣ సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపులు

‣ సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 10-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం