• facebook
  • whatsapp
  • telegram

సముచిత వాటాతోనే ‘ఆమె’కు న్యాయం

నేటికీ కొరవడిన లింగ సమానత్వం

స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచినా ఉన్నత న్యాయస్థానాల్లో మహిళలకు ఇప్పటికీ సముచిత ప్రాతినిధ్యం లభించలేదు. భారతదేశ న్యాయస్థానాల్లో కేసులు గుట్టల్లా పేరుకుపోవడం, న్యాయమూర్తుల కొరత, మతపరంగా ప్రాతినిధ్యం కొరవడటం గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ న్యాయమూర్తి పదవుల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించడం లేదనే అంశాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నేడు పరిస్థితి మారుతోంది. మహిళలు పెద్ద సంఖ్యలో న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తున్నా- సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి పదవుల్లో వారికి లభిస్తున్న ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. 1950 నుంచి ఇంతవరకు సుప్రీంకోర్టులో 247 మంది న్యాయమూర్తులు పదవులు నిర్వహించారు. పితృస్వామ్య భావజాలం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి సుప్రీంలో ప్రాతినిధ్యం కోసం మహిళలు సంఘర్షించవలసి వస్తోంది. ‘దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క రోజులో పరిష్కరించలేం. మార్పు రావడానికి బహుశా ఏళ్లూపూళ్లు... ఇంకా చెప్పాలంటే తరాలు పట్టవచ్చు. అయినాసరే! మార్పు రాకతప్పదు. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మహిళల నియామకాలు పెరుగుతున్న కొద్దీ న్యాయ సాధన ప్రక్రియ పరిపూర్ణమవుతుంది’ అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవల ఉద్ఘాటించారు.

అది హక్కు మాత్రమే!

జడ్జీలను ఎంపిక చేసే హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియాల్లో మహిళా సభ్యులు లేకపోవడం న్యాయమూర్తుల నియామకాల్లో లింగపరమైన అసమానత్వానికి ప్రధాన కారణం. సుప్రీంకోర్టు మొదటి నుంచి న్యాయమూర్తుల ఎంపికలో సీనియారిటీకే ప్రాధాన్యమిస్తోంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి 1973లో జస్టిస్‌ ఎ.ఎన్‌.రే ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అప్పట్లో ఆయనకన్నా ముగ్గురు సీనియర్‌ జడ్జీలు ఉన్నా సంప్రదాయాన్ని తోసిరాజని జస్టిస్‌ ఎ.ఎన్‌.రే ని ఎంపిక చేశారు. ప్రభుత్వ జోక్యాన్ని నివారించడం కోసం ఆత్యయిక పరిస్థితి తరవాత సుప్రీంకోర్టు సీనియారిటీకి మునుపటికన్నా మరింత ఎక్కువ ప్రాధాన్యమివ్వసాగింది. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే సంప్రదాయం కలిగిన ఏకైక ప్రజాస్వామ్య దేశం భారత్‌ ఒక్కటే. అదే దక్షిణాఫ్రికాలోనైతే న్యాయ, ప్రభుత్వ, చట్టసభల ప్రతినిధులతో ఏర్పడే న్యాయ సర్వీసు కమిషన్‌ జడ్జీల నియామకాలను చేపట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. లింగ, జాతిపరమైన సమానత్వం ఈ నియామకాల్లో ప్రతిబింబించాలని స్పష్టం చేస్తోంది. దక్షిణాఫ్రికాలో 1994లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం తొమ్మిది; క్రమంగా 2011నాటికి ఆ సంఖ్య 61కి పెరిగింది. 2021 నాటికి  49 శాతానికి చేరింది. 2021 ఆగస్టు 31 నాటికి మన సుప్రీంకోర్టులోని మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే. అదే ఇంతవరకు గరిష్ఠం. 2007-17 మధ్యకాలంలో 17 రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లలో మహిళలు 36.45శాతం. వీరిలో అత్యధికులు దిగువ అంచె న్యాయస్థానాల్లో పనిచేస్తున్నారు. న్యాయమూర్తి పదవుల్లో 50శాతం మహిళలకు దక్కాలని, అది వారి హక్కే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడాల్సిన అగత్యం ఉండకూడదని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఉద్ఘాటించారు. నేడు హైకోర్టు న్యాయమూర్తుల్లో 11.5శాతం, దిగువ అంచె న్యాయస్థానాల్లో 30శాతం మహిళలు, అన్ని హైకోర్టుల్లో 627 మంది న్యాయమూర్తులు ఉండగా- వారిలో మహిళలు 66 మందే. 2006-21 మధ్య కాలంలో 150 మంది మహిళలు హైకోర్టు న్యాయమూర్తి పదవులు చేపట్టినా, వారిలో 84 మంది రిటైర్‌ అయ్యారు. 66 మందే మిగిలారు. అదే కాలంలో సుప్రీంకోర్టులో తొమ్మిదిమంది మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహించారు. వారిలో నలుగురే ఇంకా సర్వీసులో ఉన్నారు.

పటిష్ఠ విధానాలు అవసరం

మహిళా న్యాయమూర్తులు వ్యవస్థాపరంగా, చట్టాలపరంగా పలు మార్పులు తీసుకొచ్చారు. దుర్బల సాక్షుల రక్షణ ప్రాజెక్టును రూపొందించిన కమిటీకి జస్టిస్‌ గీతా మిత్తల్‌ అధ్యక్షత వహించారు. మహిళా సాక్షులు ముద్దాయిల ఎదుటకు రాకుండా ఆంతరంగికంగా సాక్ష్యం   చెప్పడానికి వీలు కల్పించిన ప్రాజెక్టు అది. పూర్వీకుల ఆస్తిలో మహిళలకూ వాటా కల్పించడానికి 1956నాటి హిందూ వారసత్వ చట్టానికి తగు సవరణలు చేసిన 15వ న్యాయ కమిషన్‌లో జస్టిస్‌ లీలాసేఠ్‌ సభ్యురాలిగా ఉన్నారు. 2012లో దిల్లీలో దారుణ మూకుమ్మడి అత్యాచారం జరిగిన తరవాత నియుక్తమైన జస్టిస్‌ వర్మ త్రిసభ్య సంఘంలో ఆమె కూడా సభ్యురాలే. అత్యాచార కేసుల్లో వేగంగా విచారణ పూర్తిచేసి, నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత వివాద పరిష్కార సంస్థ మాత్రమే కాదు... ఈ దేశ విధానాలను ప్రభావితం చేసే సంస్థ కూడా. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నించేవారూ ఉన్నారు. ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపైన సుప్రీంకోర్టు స్పందించిన సందర్భాల్లో కోర్టు జోక్యాన్ని శంకించినవారికి కొదవ లేదు. కానీ, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుందని గమనించాలి. ఇంతటి కీలక వ్యవస్థలో   మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత ఆవశ్యకం.   దానివల్ల న్యాయస్థానాల ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియంలో మహిళా న్యాయమూర్తులూ ఉంటే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు గౌరవ ఆమోదాలు పెరుగుతాయి. చాలా రాష్ట్రాలు దిగువ న్యాయస్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా హైకోర్టు, సుప్రీంకోర్టుల స్థాయిలో అటువంటి విధానం లోపించింది. సుప్రీంకోర్టులో దళిత, ఆదివాసులతో పాటు అన్ని వర్గాలకూ చెందిన మహిళా న్యాయమూర్తులను నియమించడం ద్వారా ఆ వ్యవస్థను పరిపుష్టం చేయాలి.

ఆకాశంలో సగమైనా...

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నాగరత్న నియామకం మహిళా ప్రాతినిధ్యాన్ని ఇనుమడింపజేయబోతోంది. 2027లో ఆమె భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్నారు. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల సంఘం న్యాయస్థానాల్లో లింగ సమానత్వం కోసం కృషి చేస్తోంది. 85 దేశాలకు చెందిన 6,000 మంది మహిళా న్యాయమూర్తులు ఈ సంఘ సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో 2019లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిలో 44శాతం మహిళలే కావడం విశేష పరిణామం. అయితే దేశంలో మొత్తం 17 లక్షలమంది న్యాయవాదులు ఉంటే, వారిలో మహిళలు 15శాతమే. న్యాయవాదుల క్రమశిక్షణ సంఘాలైన రాష్ట్ర స్థాయి బార్‌ కౌన్సిళ్ల సభ్యుల్లో మహిళలు రెండు శాతమే. న్యాయవాదుల సర్వోన్నత సంఘమైన ‘బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’లో కనీసం ఒక్క మహిళా సభ్యురాలూ లేరు. 1923నాటి న్యాయవాదుల(మహిళా)చట్టం మహిళలను న్యాయవాద వృత్తి చేపట్టడానికి అనుమతించింది. అప్పటినుంచి ఇప్పటివరకు మహిళా న్యాయవాదుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నా, వనితలకు న్యాయస్థానాల్లో పురుషులతో సమాన స్థాయి ప్రాతినిధ్యం సుదూర స్వప్నంగానే మిగిలింది!

- పీవీఎస్‌ శైలజ

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైరస్‌పై పోరాడే ఉద్యోగం కావాలా?

‣ జవాబుదారీతనం నేర్చుకో... పెంచుకో!

‣ గ్రూప్‌-4 ఉద్యోగం సాధించండి... ఇలా!

‣ బాలికలకు ఉపకారవేతనాలు

‣ క్లాట్‌ మార్గంలో నాణ్యమైన న్యాయవిద్య!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం