• facebook
  • whatsapp
  • telegram

ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

పెచ్చరిల్లుతున్న విద్వేష ప్రసంగాలు

హరిద్వార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాల్లో కొంతమంది చేసిన విద్వేష వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అవి సుప్రీంకోర్టు దృష్టికీ వెళ్ళాయి. అప్రజాస్వామికమైన అటువంటి అతివాద పోకడలు రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు పరమత సహనానికి పేరుగాంచిన భారతదేశానికి మచ్చతెస్తున్నాయి. వసుధైక కుటుంబం అనే ఆర్యోక్తిని అపహాస్యం చేస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం దుర్విచక్షణలకు ఆజ్యంపోయడం, సమాజంలోని ఇతర వర్గాల పట్ల విద్వేషాన్ని నూరిపోయడం, హింసోన్మాదాలను ప్రేరేపించడం ఆందోళనకరం. రాజ్యాంగం ప్రబోధిస్తున్న లౌకిక విలువలు, సౌభ్రాతృత్వాలపై దాడి ఇది. బుల్లీబాయ్‌ వంటి పేర్లతో ఇటీవల చక్కర్లు కొట్టిన యాప్‌లు సమాజాన్ని కలుషితం చేశాయి. ప్రజాహిత జీవనంలో చురుకైన పాత్ర వహిస్తున్న మైనారిటీ మహిళలను వేలం వేస్తున్నట్లు అవి చిత్రించాయి. సరిగ్గా కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు ముందు ఆ యాప్‌లు చలామణీలోకి రావడం గమనార్హం. ఓట్ల కోసం సమాజాన్ని చీల్చాలనే ఆరాటం నుంచి అవి పుట్టుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై గొంతెత్తే వారిని లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అశ్లీల, వికృత వ్యాఖ్యలు వెల్లువెత్తుతుండటమూ కలవరపరుస్తోంది.  

సమాజంపై విష ప్రభావం

విద్వేషం వెళ్లగక్కే ప్రసంగాలు హింసాకాండకు, కొన్ని వర్గాల ఊచకోతకు దారితీస్తాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు పెల్లుబికినప్పుడు దిల్లీలో, మరికొన్ని ప్రాంతాల్లో మైనారిటీలపై దాడులు జరగడం అందుకు నిదర్శనం. ఈ దాడులు సమాజంలో అనైక్యతను పెంచి జాతీయ భద్రతకు ముప్పు తెస్తాయి. బాధితులు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తాయి. దీనివల్ల రాజ్యాంగ పునాదులు బలహీనపడతాయి. సమాజం తమను వెలివేసిందని అల్పసంఖ్యాక వర్గాలు భావిస్తున్నప్పుడు, వారు ఆర్థిక జీవనంలో పాలుపంచుకోలేకపోతారు. అది యావత్‌ దేశార్థికానికి నష్టదాయకమవుతుంది. హింసోన్మాదాన్ని ప్రేరేపించే ప్రసంగాలు 1948నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి విరుద్ధం. జనవర్గాల ఊచకోతకు దారితీసే ఉపన్యాసాలను నిషేధించి, ఆయా వక్తలను శిక్షించాలని తీర్మానించిన ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన 150 దేశాల్లో భారత్‌ ఒకటి. జనహనన ప్రసంగాలు, చర్యలకు తావిచ్చే దేశాలపై ఇతర సభ్య దేశాలు ఈ ఒప్పందం కింద అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిములపై జరిగిన హింసాకాండ మీద గాంబియా ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనార్హం. అదే వరసలో ఇతర దేశాలూ ఇండియాపై  అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయదలిస్తే, అంతర్జాతీయంగా దేశానికి తలవంపులు ఎదురవుతాయి. భారత రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం ఇచ్చిందే తప్ప సమాజంలో ఇతర వర్గాలపై విద్వేష ప్రసంగాలు చేయవచ్చని చెప్పలేదు. ఆ తరహా ఉపన్యాసాలను నిరోధించడానికి భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లో పొందుపరచిన నిబంధనల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. అందుకే ఆ తరహా నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. సమాజంలో భిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేవారిని ఐపీసీ 153(ఎ) సెక్షన్‌ కింద శిక్షించవచ్చు. జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రకటనలు, ప్రసంగాలపై 153(బి) నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మతాల మధ్య చిచ్చుపెట్టే వదంతులు, వార్తలను వ్యాపింపజేసేవారికి 505 సెక్షన్‌ కింద సంకెళ్లు వేయవచ్చు. ఇతర మతవర్గాలను కించపరిచే మాటలు, చేతలపై 295(ఎ)ను ప్రయోగించవచ్చు. ఇన్ని నిబంధనలు ఉన్నా విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డూఆపూ లేకుండా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మతపరంగా కానీ, ఇతరత్రా కానీ హింస, దుర్విచక్షణలను రెచ్చగొట్టే ఉపన్యాసాలను విద్వేష ప్రసంగాలుగా పరిగణించాలని 2017లో భారత న్యాయసంఘం (లా కమిషన్‌) తన 267వ నివేదికలో సిఫార్సు చేసింది. పార్లమెంటు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విస్మయకరం. మరోవైపు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విరివిగా చలామణీ అవుతున్న విషప్రసంగాలు, వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడానికి శిక్షాస్మృతిలో సమర్థ నిబంధనలు లేవు. ఐపీసీ అంతర్జాలం పుట్టుకురావడానికి ముందు రూపుదిద్దుకున్నది కావడం దీనికి కారణం. 2018లో ఫేస్‌బుక్‌ దాదాపు 30 లక్షల విద్వేషపూరిత పోస్టులను తొలగించాల్సి వచ్చింది. యూట్యూబ్‌ సైతం ప్రతి నెలా అటువంటి వీడియోలను వేల సంఖ్యలో తొలగిస్తున్నా- కొత్తవి తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ముకుతాడు వేయాల్సిందే

ప్రస్తుత చట్టాల ప్రకారం విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారికి గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించవచ్చు. కనీస శిక్షలను ఎక్కడా నిర్దేశించలేదు. ఈ పరిస్థితిని మార్చాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫాలీ రోహింగ్టన్‌ నారిమన్‌ గతంలోనే సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషం వెళ్లగక్కేవారి మీదా చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను రూపొందించాలి. లేకపోతే ఉన్న చట్టాల్లోనే తగు సవరణలు చేయాలి. వైషమ్యాలను ప్రేరేపించే ఉపన్యాసాలకు వదంతులు, కట్టుకథలు, దుష్ప్రచారాలే ఆధారం. వాటిని ఎదుర్కోవడానికి వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలు, మేధావులు చర్చల్లో పాల్గొని సత్యాసత్యాలను నిగ్గుతేల్చాలి. చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజ్యాంగ మౌలిక చట్రంలో లౌకికత్వం తిరుగులేని అంతర్భాగమని 1994నాటి ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాబట్టి లౌకికత్వాన్ని దెబ్బతీసే విద్వేష చర్యలు, ప్రసంగాలను ప్రభుత్వం సహించకూడదు. వాటిని తక్షణం అరికట్టి రాజ్యాంగాన్ని రక్షించాలి. ఎన్నికల్లో విజయం కోసం విభేదాలను రెచ్చగొట్టే రాజకీయ పక్షాలు, వాటి అభ్యర్థులను ఎన్నికల నుంచి బహిష్కరించాలి. 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఇందుకు వీలుకల్పిస్తోంది. మేధావులు, పౌర హక్కుల సంఘాలు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు విద్వేష ప్రసంగాలపై ధ్వజమెత్తాలి. ప్రజలందరిలో లౌకికత్వం, సౌభ్రాతృత్వం తదితర రాజ్యాంగ విలువలను పాదుగొల్పాలి.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

‣ కృత్రిమ మేధతో ఆరోగ్య విప్లవం

‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

‣ కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం