• facebook
  • whatsapp
  • telegram

నగరాలు ఆరోగ్య పెన్నిధులుగా...

పటిష్ఠ ప్రణాళికలతో సుసాధ్యం

దేశ పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ నీతి ఆయోగ్‌ గత నెలలో ఒక నివేదికను వెలువరించింది. పట్టణీకరణ నిపుణులతో ఏర్పాటైన కమిటీలతో విస్తృత సంప్రదింపులు, చర్చల అనంతరం విడుదలైన ఈ నివేదిక పట్టణ ప్రణాళికా సామర్థ్య మెరుగుదలకు పలు సూచనలు, సిఫార్సులు చేసింది. పౌరుల ఆరోగ్య భద్రత ప్రాథమ్యంగా పట్టణ ప్రణాళికల్ని రూపొందించాలని అభిప్రాయపడింది. కొవిడ్‌ వంటి మహమ్మారులు విజృంభిస్తున్న తరుణంలో 2030 కల్లా దేశంలోని ప్రతి పట్టణం, నగరం ప్రజలకు ఆరోగ్యకరంగా మారాలని పేర్కొంది. దానికోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా 500 ఆరోగ్యవంతమైన నగరాల (హెల్త్‌ సిటీస్‌) కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయిస్తుంది.

అందరికీ ఉపయుక్తంగా...

ఆరోగ్యవంతమైన నగరాల మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన మార్గదర్శకాలనూ నీతి ఆయోగ్‌ నివేదిక సవివరంగా చర్చించింది. నీతి ఆయోగ్‌తో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రాష్ట్రాల సంయుక్త సమావేశంలో ఆరోగ్యవంతమైన నగరాల ఎంపిక జరగాలని సూచించింది. నిధుల కేటాయింపులు, మెట్రోపాలిటన్‌, జిల్లా ప్రణాళికా కమిటీల ఏర్పాటు తదితర అంశాలకు ఒక ప్రోత్సాహక యంత్రాంగం ఏర్పాటును పరిశీలించాలని పేర్కొంది. పౌరుల ఆరోగ్య భద్రతకు కీలకమైన పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, విశాలమైన రోడ్లు, పచ్చటి పరిసరాలు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు సమగ్రమైన ఉపప్రణాళికలు, పటిష్ఠమైన వ్యూహాలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ఐదేళ్ల కాలావధిలో ఆరోగ్య నగరాల ప్రాజెక్టు పూర్తి కావాలని లక్షించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 1986లోనే అందరికీ ఆరోగ్యం నినాదంతో ఆరోగ్యవంతమైన నగరాల ప్రాజెక్టుకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. సంస్థ ఐరోపా ప్రాంతీయ కార్యాలయం కేంద్రంగా 11 నగరాలు దానికి ఎంపికయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆరోగ్య నగరాల భావన తోడ్పడుతుందని, వాటిని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని 1991లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు అభిప్రాయపడింది. ఆరోగ్యవంతమైన నగరాల నిర్మాణంలో స్థానిక ప్రభుత్వాలు కీలక భూమిక పోషించాలని 1986 ఓట్టవా ఛార్టర్‌ స్పష్టం చేసింది. స్వచ్ఛమైన, సురక్షితమైన భౌతిక వాతావరణం, అందరికీ ఆహారం, నీరు, ఆవాసం, ఆదాయం, భద్రత, ఉపాధి వంటి మౌలిక వసతుల కల్పన, బలమైన, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, చారిత్రక, సాంస్కృతిక, జీవసంబంధ వారసత్వం, అందరికీ ప్రజారోగ్య సేవల అందుబాటు వంటి వాటిని ఆరోగ్యవంతమైన నగరాల లక్షణాలుగా ఓట్టవా ఛార్టర్‌ పేర్కొంది. మూడు దశల్లో, ఇరవై అంచెలతో కూడిన ఆరోగ్యవంతమైన నగరాల నమూనా ప్రాజెక్టును డబ్ల్యూహెచ్‌ఓ రూపొందించింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా నగరాలు ఆరోగ్యవంతమైన నగరాల నెట్‌వర్క్‌లో ఉన్నాయి. పట్టణ ప్రణాళికల లక్ష్యాలకు సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య నగరాల నెట్‌వర్క్‌ నివేదికలు పలు సూచనలు చేశాయి. నగరాల్లో ఆరోగ్య భద్రతను, జీవన నాణ్యతను పెంపొందించడానికి స్థానిక ప్రభుత్వాలే సమీకృత వ్యూహాలను రూపొందించి అమలు చేయాలి. బహుళ రంగాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. పౌరసమాజ అభిప్రాయాలకూ మన్నన దక్కాలి. పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం మరో ప్రధాన అంశం. ఇందులో భాగంగా కర్బన ఉద్గారాలను అరికట్టాలి. అందరికీ గృహ వసతిని కల్పించాలి. బలహీన వర్గాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగుల ప్రయోజనాలకు నగర ప్రణాళికలో చోటు దక్కడం తప్పనిసరి. సాంఘిక, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, అంతరాల తొలగింపు ఆరోగ్య భద్రతకు బాటలు పరుస్తాయి. అందరికీ అందుబాటులో ఉండేలా బలమైన ప్రజారోగ్య వ్యవస్థను సైతం పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. పౌరులకు పటిష్ఠ రక్షణ ఏర్పాట్లు అందుబాటులో ఉంచడమూ తప్పనిసరి.

ప్రజారోగ్యానికి బాటలు

భారత్‌లో అమలవుతున్న ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో ఆరోగ్య నగరాల భావన అంతర్లీనంగా ఉంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆరోగ్య నగరాల జాబితాలో మన దేశం నుంచి ఒక్కటీ చోటు దక్కించుకోలేక పోయింది. చండీగఢ్‌ అతి తక్కువ వ్యాధుల వ్యాప్తి ఉన్న నగరంగా గుర్తింపు పొంది దేశంలోని ఏడు ఆరోగ్య నగరాల జాబితాలో అగ్రశ్రేణిలో నిలిచింది. తరవాతి స్థానాల్లో వరసగా జైపుర్‌, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌, ముంబయి నిలిచాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య నగరాల రూపకల్పన తక్షణావసరంగా మారింది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన 500 ఆరోగ్య నగరాల ప్రాజెక్టును ఆ దిశగా పడిన తొలి అడుగుగా అభివర్ణించవచ్చు. దేశంలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యవంతమైన నగరాల నమూనా ప్రాజెక్టు రూపకల్పన, దానిపై లోతైన అధ్యయనం జరగాలి. ప్రాజెక్టు అమలుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించడం తప్పనిసరి. ఆరోగ్య నగరాలు స్థానిక ఆరోగ్య విధానంలో నవీన ఆవిష్కరణలను, మార్పులను ప్రోత్సహిస్తాయి. నూతన ప్రజారోగ్య పద్ధతులకు, వ్యవస్థల ఏర్పాటుకు బాటలు పరుస్తాయి. పౌరుల జీవన నాణ్యతను పెంపొందించి నగరాలను చక్కటి నివాసయోగ్యంగా మారుస్తాయి. 500 ఆరోగ్య నగరాల ప్రాజెక్టు విజయానికి రాజకీయ చిత్తశుద్ధి, వ్యవస్థాగత మార్పులు కీలకం. లేకుంటే నిర్ణీత కాలంలో పూర్తికాని ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులా ఇదీ అసంపూర్తిగా మిగిలే ప్రమాదం ఉంది.

బహుళ ప్రయోజనాలు

దవ్యాల వినియోగం వంటి సమస్యలతో కునారిల్లుతున్నాయి. వ్యర్థాల సమర్థ నిర్వహణ, తాగునీరు, గృహ వసతి, హరిత స్థలాలు, పారిశుద్ధ్యం, ఇంధన వినియోగం వంటివి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఆయా సేవలను నాణ్యంగా, విస్తృతంగా అందించడం ద్వారా అంటువ్యాధులను అరికట్టవచ్చు. పౌరులకు సరైన జీవన విధానంపై అవగాహన కల్పించడం ద్వారా గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్లు వంటి అసాంక్రామిక వ్యాధులను నివారించవచ్చు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చు. ఇవన్నీ ఆరోగ్యవంతమైన పట్టణ ప్రణాళికలో భాగం కావాలి.

- పుల్లూరు సుధాకర్‌, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు
 

Posted Date: 07-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం