• facebook
  • whatsapp
  • telegram

భాజపా - కాంగ్రెస్‌... మధ్యలో ఆప్‌!

భాజపాపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సమరశంఖం పూరిస్తోంది. రాజకీయ రణరంగంలో అది తన సర్వశక్తులనూ ఒడ్డుతోంది. దాంతో కొన్నేళ్లుగా ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ స్వప్న సాకారంలో నిమగ్నమైన భాజపా సైతం ప్రస్తుతం ఆప్‌పై దృష్టి సారించాల్సి వస్తోంది.

పూర్తి శక్తియుక్తులను కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) సిద్ధమవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా అది పావులు కదుపుతోంది. అందుకే నరేంద్ర మోదీకి పోటీగా దేశ రాజకీయ యవనికపై అరవింద్‌ కేజ్రీవాల్‌ను నిలబెట్టేందుకు ఆప్‌ ప్రయత్నిస్తోంది. ‘సబ్‌ కా సాథ్‌... సబ్‌ కా వికాస్‌’, ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదాలతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ విజయాన్ని చేజిక్కించుకొన్నారు. 2024 సార్వత్రిక సమరంకోసం కేజ్రీవాల్‌- ‘భారత్‌ను అగ్ర దేశంగా నిలుపుదాం’ అనే లక్ష్యాన్ని ప్రవచిస్తున్నారు. అందులో భాగంగా ఉచిత ఆరోగ్య సంరక్షణ, అందరికీ విద్య, రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు సమాన హక్కులు, యువతకు ఉపాధి అంశాలను ప్రస్తావిస్తున్నారు. పెరుగుతున్న కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ దాడులకు తెరతీసిందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా ఇటీవల ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను కీలక సూత్రధారిగా భాజపా అభివర్ణిస్తే- గుజరాత్‌లో ఇటీవలి అక్రమ మద్యం మరణాలను సిసోదియా ప్రశ్నించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ‘ఆప్‌’ ప్రభుత్వ అసాధారణ విజయాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. దానికి ప్రతిస్పందనగా దిల్లీ విద్యాశాఖ మంత్రిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పిందని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ మండిపడ్డారు.

దిల్లీ సంక్షేమ నమూనాపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం, అక్కడి విద్యాశాఖ మంత్రిపై సీబీఐ దాడులు యాదృచ్ఛికమే కావచ్చు. వాటికి ముందూ వెనకా చోటుచేసుకున్న వివిధ ఘటనలు- ఆప్‌ విస్తరణ ప్రణాళికలను దెబ్బతీయాలన్న భాజపా ఉద్దేశాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతల కారణంగా- మోదీ ప్రవచిత ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదం పక్కకెళ్ళిపోయింది. హస్తం పార్టీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో అధికారంలో కొనసాగుతోంది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, అస్సాం తదితర రాష్ట్రాల్లోనూ దానికి బలమైన పునాదులే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లో ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టి, భాజపా అధికారంలోకి వచ్చింది. ఏక్‌నాథ్‌ శిందే చీలిక వర్గం పుణ్యామా అని మహారాష్ట్రలోనూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌లు మాత్రం భాజపాకు అంది రావడం లేదు. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ సంకీర్ణ సర్కారును కూల్చివేయాలనే ప్రయత్నమూ ఫలించలేదు. తన ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో భాజపా చాలా బలంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో- ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతంలో అది విజయాలు సాధించలేకపోతోంది. మరోవైపు, ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ దిశగా భాజపా వ్యూహాలతో ఏర్పడుతున్న రాజకీయ శూన్యాన్ని తాను పూరించాలని ఆప్‌ తలపోస్తోంది. భాజపాకు పెద్దగా ఉనికి లేని పంజాబ్‌లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి, ఆప్‌ అధికారంలోకి వచ్చింది. ఆ ఉత్సాహంతో హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ విస్తరించేందుకు అది ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు- పంజాబ్‌లో ఆప్‌ విజయం తరవాతే భాజపా మేల్కొంది. కేజ్రీవాల్‌ శిబిరాన్ని నిలువరించడంపై ఆలోచనలు ప్రారంభించింది.

సుశిక్షితులైన కార్యకర్తల దన్నుతో భాజపా అజేయంగానే కనిపిస్తుండవచ్చు. కాంగ్రెస్‌ నేతలను తమ పక్షంలోకి విరివిగా చేర్చుకుంటుండటం భావజాల భూమికపై పార్టీకోసం పనిచేస్తున్న భాజపా శ్రేణులను ఇబ్బంది పెడుతోంది. గతంలో దీర్ఘకాలం అధికారంలో ఉండటం, పాతతరం గాంధేయవాద నేతలు అనుసరించిన విధానాలతో కాంగ్రెస్‌ పార్టీ పోరాటతత్వాన్ని కొంత మేరకు కోల్పోయి ఉండవచ్చు. ఆప్‌ మాత్రం యువ కార్యకర్తలు, దూకుడైన నేతలతో భాజపాతో సై అంటే సై అంటోంది. దిల్లీలో సీబీఐ దాడుల తీవ్రత తగ్గకముందే ఆప్‌ నేతలు గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలవడమే ఇందుకు నిదర్శనం. ఆప్‌ రాజకీయ పోరాటం మున్ముందు తీవ్రతరం కానుంది. ఈ సవాలును భాజపా ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తికరం!

- ఆర్‌.కె.మిశ్రా

(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

‣ ఉత్తరకొరియా దూకుడు

‣ సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

Posted Date: 25-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం