* ఫీజు రూ.55 నుంచి రూ.800
* ఒక్క సీఎస్ఈలోనే దాదాపు 1800 మంది విద్యార్థులు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయనే సాకుతో డిమాండ్ ఉన్న దాదాపు 28కు పైగా కోర్సులను తొలగించారు. ఫలితంగా ఆయా విభాగాల్లో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 250 మంది అతిథి అధ్యాపకులు ఉద్యోగాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని విధంగా ఏయూలో ఫీజులు పెంచి, విద్యార్థులపై భారం మోపారు. అయిదేళ్లుగా ఏయూను పేదలకు దూరం చేసి.. పెద్దలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వర్సిటీలో చర్చించుకుంటున్నారు.
అదనపు వసూళ్లు: గతంలో ఏయూలో అన్ని వర్గాల ప్రజలు చదువుకునేలా నామమాత్రపు ఫీజులుండేవి. గత ప్రభుత్వంలో వసతి గృహాలు, పరీక్ష ఫీజులను ఇష్టానుసారం పెంచేశారు. వసతి గృహాల ఫీజులను రూ.2,500 నుంచి రూ.4000కు పెంచారు. ఇప్పటికే కొన్ని మెస్లను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. గతంలో మెస్ బిల్లు నెలకు రూ.2 వేల కంటే తక్కువ వచ్చేదని, ఇప్పుడు ప్రతి నెలా రూ.5 వేలు దాటుతోందని విద్యార్థులు వాపోతున్నారు. వసతి గృహాల్లో పేర్కొన్న రుసుముల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు 2019-20లో సెమిస్టర్ పరీక్షలకు ఫీజు రూ.55 ఉండేదని, 2020 తర్వాత అమాంతం రూ.800కు పెంచారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయ కోర్సులకు అందలం..
ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్లు భారీగా పెంచారు. గతంలో ఆ విభాగంలో 3 నుంచి 4 సెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 8 నుంచి 10 వరకు ఉంది. ఒక్క సీఎస్ఈలోనే దాదాపు 1800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏయూసెట్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 470 ప్రవేశాలు, 2022-23లో 700కు పైగా ప్రవేశాలు కల్పించారు. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు సైన్స్, ఆర్ట్స్, న్యాయ కళాశాలల్లో సీట్లు తగ్గించేశారు. ఎం.టెక్ నానో టెక్నాలజీ, ఎంఏలో సంస్కృతం, లింగ్విస్టిక్స్, ఏన్సియెంట్ హిస్టరీ, పురావస్తు శాస్త్రం, పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్, హ్యూమన్ రైట్స్, రిలీజియస్ స్టడీస్, థియేటర్ ఆర్ట్స్, ఎం.ఎస్. ఎకనామిక్స్ తదితర కోర్సులు మూసేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.