• facebook
  • whatsapp
  • telegram

Education: పాలి‘టెక్నిక్‌’ పట్టని ప్రభుత్వం  

* కేవలం 24 కళాశాలల్లోనే కంప్యూటర్, ఏఐ ఇంజినీరింగ్‌

ఈనాడు, అమరావతి: మార్కెట్‌లో ఉన్న డిమాండుకు అనుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కోర్సులను ప్రవేశపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక నైపుణ్యాలు నేర్పించే కొత్త కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతున్నా సాంకేతిక విద్యాశాఖ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కోరుకున్న కోర్సులు ప్రభుత్వ కళాశాలల్లో లేక  విద్యార్థులు ప్రైవేటు వైపు వెళ్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ప్రైవేటు కళాశాలలు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డిప్లొమా విద్యలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌లాంటి బ్రాంచ్‌లకు విద్యార్థుల నుంచి డిమాండు ఉన్నా సీట్లు మాత్రం పెరగడం లేదు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌తోపాటు కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డేటా అనలిటిక్స్‌లాంటి కోర్సులను ప్రవేశ పెడుతుండగా.. డిప్లొమాలో మాత్రం ఆ దిశగా ఆశించిన స్థాయిలో అడుగులుపడడం లేదు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో 50% సీట్లూ భర్తీ కావడం లేదు.

22 కళాశాలల్లోనే సీఎంఈ కోర్సు

రాష్ట్రంలో 87 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఉండగా.. వీటిలో సుమారు 16,494 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో మాత్రం 1,376 సీట్లు ఉన్నాయి. 22 కళాశాలల్లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌(సీఎంఈ) కోర్సు, కళ్యాణదుర్గంలో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్, బేతంచర్లలో కృత్రిమ మేధ కోర్సులు ఉన్నాయి. అదే ప్రైవేటులో 179 కళాశాలలు ఉంటే.. 123 కళాశాలల్లో సీఎంఈ, ఎమర్జింగ్‌ కోర్సులు ఉన్నాయి. ప్రైవేటులో విద్యార్థుల అవసరాలు, మార్కెట్‌ డిమాండు మేరకు బ్రాంచీలు మారుతుంటే ప్రభుత్వ కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం అవుతోంది. 70 ఏళ్ల చరిత్ర ఉన్న విజయవాడలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంతవరకూ సీఎంఈ బ్రాంచే ప్రారంభించలేదు. ఇక్కడి విద్యార్థులు ఆ బ్రాంచి కోసం గన్నవరం లేదా ప్రైవేటు బాట పట్టాల్సి వస్తోంది. విశాఖపట్నంలోని కంచరపాలెంలో 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కళాశాలలోనూ సీఎంఈ లేదు. ఆ కోర్సు చదవాలనుకునే ఇక్కడి విద్యార్థులు అనకాపల్లి వెళ్లాల్సి వస్తోంది. నంద్యాల జిల్లా బేతంచర్ల కళాశాలలో గతేడాది కృత్రిమ మేధలో 60 సీట్లు ప్రారంభిస్తే 56 మంది ప్రవేశాలు పొందారు. అన్నిచోట్ల సీఎంఈ సీట్లు దాదాపుగా భర్తీ అవుతున్నాయి. 

పాఠాలు చెప్పేవారు లేరు..

పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఎక్కువగా డిప్లొమా కోర్సుల్లో చేరతారు. పాలిటెక్నిక్‌తో ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం లభిస్తుందనే ఆశతో వీటిల్లో ప్రవేశాలు పొందుతారు. ఇలాంటి వాటిలో ఆధునిక అవసరాలకు తగిన కోర్సులు లేకపోవడం ఒక లోటు అయితే.. కొన్నిచోట్ల రెగ్యులర్‌ అధ్యాపకులు లేకపోవడం శాపంగా మారింది. రాష్ట్రంలో 11 కళాశాలలకు ఒక్క రెగ్యులర్‌ పోస్టూ మంజూరు చేయలేదు. మరో 12 కళాశాలలకు అరకొర పోస్టులు ఇచ్చారు. సెకండ్‌ షిప్టు కింద కొనసాగుతున్న 11 కళాశాలలకు అదనంగా పోస్టులు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో పాలిటెక్నిక్‌ విద్యకు డిమాండు ఉండడంతో ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరులాంటి చోట్ల సెంకడ్‌ షిఫ్టు మంజూరు చేశారు. కొన్నిచోట్ల సదుపాయాల్లేవు. 4 కళాశాలలకు సొంత భవనాలు లేక రేకుల షెడ్లు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రాక్టికల్స్‌కు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఈ సమస్యను పరిష్కరించడం లేదు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.